Cancer treatment: మూత్రాశయ క్యాన్సర్ రోగులకు శుభవార్త.. ఆ చికిత్సా విధానంలో శాశ్వతంగా క్యాన్సర్ దూరం!
బ్లాడర్ క్యాన్సర్ రోగులు సర్జరీ అయిన తర్వాత ఇమ్యూనోథెరపీ చేయించుకుంటే వారు మిగిలిన జీవిత కాలంలో క్యాన్సర్ రహితంగా జీవించవచ్చని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి చుట్టేస్తోంది. దీనిని నివారించడానికి అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా క్యాన్సర్ చికిత్స అనగానే కీమోథెరపీ, రేడియేషన్ లేదా సర్జరీ ఇవే గుర్తొస్తాయి. అయితే ఇమ్యూనోథెరపీ సైతం ఎంతగానో తోడ్పడుతోందని ఇటీవల పరిశోధకులు కొనుగొన్నారు. ఇదే క్రమంలో చేస్తున్న మరిన్ని పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా బ్లాడర్ క్యాన్సర్ ఉన్న వారికి మంచి ప్రయోజనాలను చేకూరుతున్నట్లు వివరించారు. సర్జరీ చేయించుకున్న తర్వాత పూర్తిగా క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం లేకుండా బతకవచ్చని నిర్ధారించారు. ఆ పరిశోధన వివరాలు ఇప్పుడు చూద్దాం..
మళ్లీ వచ్చే అవకాశాన్ని తగ్గింది..
బ్లాడర్ క్యాన్సర్ రోగులు సర్జరీ చేయించుకొన్న తర్వాత ఇమ్యూనోథెరపీ చేయించుకుంటే వారు మిగిలిన జీవిత కాలంలో క్యాన్సర్ రహితంగా జీవించవచ్చని పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ(ఏఎస్సీఓ)2023 జెనిటూరినరీ క్యాన్సర్ సింపోజియంలో ప్రజెంట్ చేశారు. మూడు సంవత్సరాల పాటు సాగిన ఈ పరిశోధనలో 699 మంది మూత్రాశయ రోగులపై వివిధ దశల్లో పరీక్షించారు. సాధారణంగా ఈ క్యాన్సర్ ఉన్న రోగులు సర్జరీ చేయించుకున్నా.. తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరిపై ఈ ఇమ్యూనోథెరపీ చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఇమ్యూనోథెరపీ చేసిన రోగులలో ఎక్కవ మందికి తిరిగి క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడం లేదని నిర్ధారణకు వచ్చారు.
ఇమ్యునోథెరపీ అంటే ఏంటి?
క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఈ అసాధారణ కణాలు తరచుగా మారుతూ పరివర్తన చెందుతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. అయితే ఇమ్యునోథెరపీ క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు శరీరంలో సొంతంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది క్యాన్సర్ థెరపీల విస్తృత వర్గం. ఈ ఇమ్యునోథెరపీ.. పెరుగుతున్న క్యాన్సర్ కణాల గురించి రోగ నిరోధక వ్యవస్థను హెచ్చరించడానికి రూపొందించబడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించిన మందులు క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..