AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతిమరుపు మాయం కావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..! మీ మెదడుకు బూస్ట్ ఇస్తాయి..!

ప్రస్తుత రోజుల్లో శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎక్కువ పనిభారంతో పాటు, ఒత్తిడి, వయసు పెరగడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరమవడం వల్ల చాలా మందికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కానీ మన మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు రోజువారీ ఆహారంలో చేర్చితే.. మెదడు పనితీరు మెరుగవుతుంది, జ్ఞాపకశక్తి బలపడుతుంది.

మతిమరుపు మాయం కావాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..! మీ మెదడుకు బూస్ట్ ఇస్తాయి..!
Memory Strengthening
Prashanthi V
|

Updated on: Jun 30, 2025 | 1:02 PM

Share

మెదడు.. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది నిరంతరం శ్రమిస్తూ మన భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలను నియంత్రిస్తుంది. మెదడు కణాలు చురుకుగా పనిచేయాలంటే సరైన పోషణ చాలా అవసరం. ఇప్పుడు మానసిక క్షీణతను తగ్గించే జ్ఞాపకశక్తిని బలపరచే కొన్ని ముఖ్యమైన పోషకాలను పరిశీలిద్దాం.

మెగ్నీషియం మెదడులో న్యూరోకెమికల్స్ విడుదలను నియంత్రిస్తుంది. ఇది శాంతియుత భావనను కలిగిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడం, ఆందోళన, జ్ఞాపక లోపానికి ఈ ఖనిజం లోపమే ఒక కారణమవుతుంది. ఆకుకూరలు, బాదం, బీన్స్ వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

ఫ్యాట్ అనే పదం వినడానికి ఇబ్బందిగా అనిపించినా.. ఒమేగా 3 ఫ్యాట్స్ మాత్రం మెదడుకు అద్భుతమైన మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా DHA అనే పదార్థం మెదడు కణాల నిర్మాణంలో కీలకం. చేపలు, వాల్‌ నట్స్, అవిసె గింజలు వీటికి మంచి వనరులు.

గ్రీన్ టీలో కనిపించే కాటెచిన్స్ ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించి మెదడు కణాలను రక్షిస్తాయి. ఇవి మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచి స్పష్టతను కలిగిస్తాయి. ప్రతి రోజు ఒకటి రెండు కప్పుల గ్రీన్ టీ మంచి ఫలితాలు ఇస్తుంది.

మైరిసెటిన్.. ఈ సహజ సమ్మేళనం వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మైరిసెటిన్ అధికంగా ఉండే బెర్రీలు, ఉల్లిపాయలు, టీలను తీసుకోవడం ద్వారా మెదడు హానికరమైన ప్రభావాల నుంచి రక్షించబడుతుంది.

ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకోవడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కణాల బలాన్ని నిలబెట్టడంతో పాటు మానసిక క్షీణతను ఆలస్యం చేస్తుంది. నూనెలు, గింజలు, అవకాడో, పాలకూర ఈ విటమిన్‌ కు మంచి వనరులు.

విటమిన్ D లోపం మానసిక ఉత్సాహాన్ని తగ్గించి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. సూర్యరశ్మి ద్వారా దొరికే ఈ విటమిన్ తేలికపాటి డిప్రెషన్ లక్షణాలను కూడా తగ్గించగలదు. చేపలు, డెయిరీ ఉత్పత్తులు, సప్లిమెంట్ల ద్వారా దీన్ని పొందవచ్చు.

విటమిన్ B12 లేకపోతే అలసట, మతిమరుపు వంటి లక్షణాలు వస్తాయి. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. గుడ్లు, మాంసాహారం, పాలు దీనికి ఉత్తమ వనరులు.

క్వెర్సెటిన్.. ఈ పదార్థం శరీరంలోని మంటను తగ్గించి మెదడు కణాలకు రక్షణ కల్పిస్తుంది. క్వెర్సెటిన్ ఆపిల్, ద్రాక్ష, ఎర్ర ఉల్లిపాయలు, బెర్రీలలో ఎక్కువగా ఉంటుంది.

జ్ఞాపకశక్తి పెరగాలంటే మాత్రలు వేసుకోవడం కన్నా ముందుగా చేయాల్సిన పని పోషకాహారాన్ని మెరుగుపరచడం. ప్రకృతిలో మనకు కావలసిన పోషకాలు అన్నీ ఉన్నాయి. సరైన ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవడమే కాకుండా.. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటే మిగతా శరీరం మొత్తం అందుకు అనుగుణంగా పని చేస్తుంది.