Heart Helath: కార్డియాక్ అరెస్ట్‌కు, హార్ట్ అటాక్‌కూ మధ్య తేడా ఏంటి?
గుండెపోటు ముప్పు ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధ లేకుండా గుండెపోటు ప్రాణాలను తీస్తోంది. అసలు గుండెపోటు అనేది ఏవయసులో వస్తుంది..ఇప్పుడెందుకు యువతలో ఎక్కువగా కనిపిస్తోంది...? పోస్ట్ కొవిడ్‌తోనే హార్ట్‌స్ట్రోక్‌లు ఎక్కువయ్యాయా..? హార్ట్‌స్ట్రోక్‌కు, కార్డియాక్ అరెస్ట్‌కు తేడా ఏంటి..?

గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వేధిస్తోంది. జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి సహా పలు కారణాలతో యువతలో గుండెపోటు సమస్య తీవ్రం అవుతోంది. కొన్నిసార్లు యువతలోని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సోకిన యువతలో గుండెపోటు ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెపోటుతో చనిపోయిన యువతలో ఎక్కువగా కరోనా సోకినవారే ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కరోనా ప్రారంభం తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో అన్ని వయసుల వారిలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మన ఇండియాలో మరీ ఎక్కువయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదక ప్రకారం గుండెపోటు మరణాల్లో మన దేశమే టాప్‌లో ఉంది.
గత మూడు సంవత్సరాలుగా మనదేశంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం, 2022లోనే గుండెపోటు కేసులు 12.5% పెరిగాయి. 2022లో 32,457 మంది వ్యక్తులు హార్ట్‌అటాక్‌తో చనిపోయారు. అంతకుముందు ఏడాది 28వేల413మంది చనిపోయారు. చనిపోయినవారంతా 25 నుంచి 44 సంవత్సరాల వయస్సు వారే. వృద్ధులతో పోలిస్తే యువకుల మరణాల రేటు 23 నుంచి 34% పెరిగింది. గుండెపోటుకు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాలు చూస్తే..
-
- 1. ఛాతీలో నొప్పి లేదంటే అసౌకర్యం
- 2. మెడ, దవడ, చేతులతో సహా ఛాతి పైభాగంలో నొప్పి
- 3. శ్వాస ఆడకపోవడం
- 4. కళ్లు మసకగా కనిపించడం
- 5. చల్లని చెమటలు పట్టడం
- 6. విపరీతమైన అలసట
- 7. వికారం, వాంతులు
- 8. తీవ్రమైన ఆందోళన, భయం
- 9. లో ఫీవర్
గుండెపోటు వచ్చిన సమయంలో తీసుకునే తక్షణ చర్యలు తీసుకుంటే ప్రాణాలను నిలపవచ్చు. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తి స్పందించకపోతే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ CPR చేయాలి. కోవిడ్ -19 ఉన్న 150,000 మందిపై 2022 లో ఒక పరిశోధన నిర్వహించారు. కోవిడ్-19 సోకిన వారిలో 4% మంది గుండె సమస్యలను ఎదుర్కొంటారని అధ్యయనం అంచనా వేసింది.
ఈమధ్య మనం తరచూ వినిపిస్తున్న మాట కార్డియాక్ అరెస్ట్. గుండెపోటు వేరు..కార్డియాక్ అరెస్ట్ వేరు. గుండెపోటు వచ్చినప్పుడు …రక్తసరఫరాలో అంతరాయం వల్ల ఏర్పడుతుంది. రక్తనాళంలో అడ్డంకి లేదా క్లాట్ ఏర్పడినప్పుడు గుండె కండరాల వరకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇందులో బాడీలోని ఇతర భాగాలకు గుండె రక్త ప్రసరణ చేస్తూనే ఉంటుంది. బాధితుడు స్పృహలోనే ఉంటాడు.
కార్డియాక్ అరెస్ట్ ..సడెన్‌గా గుండె ఆగిపోవడంతో ఏర్పడుతుంది. దానికి సంబంధించిన ముందస్తు సింటమ్స్ కూడా శరీరంలో ఏమీ కనిపించవు. వెంటనే సీపీఆర్ చేసి బతికించవచ్చు. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండెకు సంబంధించిన విద్యుత్ కార్యకలాపాలు చెల్లచెదురు అవుతాయి. ఈ అలజడి వల్ల హార్ట్ బీట్ సమతుల్యం దెబ్బతింటుంది. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో మెదడు, గుండె, బాడీలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీని వల్ల కొద్ది క్షణాల్లోనే బాధిత వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే.. వెంటనే సీపీఆర్ చేసి బతికించవచ్చు. లేదంటే రోగి కొద్ది సెకన్లలో లేదా నిమిషాల్లో మరణిస్తాడు.




