Mental Health: ఇష్టమైన వారిని కోల్పోయారా? ఆ బాధను అధిగమించలేకపోతున్నారా? మీకోసమే ఈ టిప్స్..!
Mental Health: మనకు ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు మనసులో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్నాళ్లపాటు ఆ బాధ మనల్ని వేధిస్తూనే ఉంటుంది.
Mental Health: మనకు ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు మనసులో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్నాళ్లపాటు ఆ బాధ మనల్ని వేధిస్తూనే ఉంటుంది. మానసికంగా, శరీరకంగా క్రుంగదీస్తుంది. పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్తుంటాం. అలా అనారోగ్యానికి గురవుతుంటారు చాలా మంది. అయితే క్రమంగా వీటన్నింటి నుంచి బయటపడాలి. జీవితం అంటేనే ఒడిదుడుకులు. వాటన్నింటినీ అధిగమించి నిలబడాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం.
ఇలాంటి మానసిక వేదనను ఎదుర్కొనే చాలా మంది వ్యక్తులు.. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. వారి మనసును తేలికపరుచుకునేందుకు వారితో గడుపుతుంటారు. మరికొందరైతే.. గదిలో ఒంటరిగా కూర్చుని తమలో తాము కుమిలిపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని బయటపడేందుకు మానసిక నిపుణులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవాన్ని స్వీకరించాలి: మనం ప్రేమించే వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు, మనం అదే ఆలోచనలో ఉంటాం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవిస్తాం. కానీ అదే జ్ఞాపకం మనల్ని పదే పదే వెంటాడుతున్నప్పుడు, వారు లేరనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతాం. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. వారు లేరని అంగీకరించి జీవితంలో ముందుకు నడవాలి.
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి: ఇలాంటి సమయాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. మంచి ఆహారం తినాలి. వ్యాయామం చేయాలి. అన్నికంటే ముఖ్యంగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం: కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపేందుకు ప్రయత్నించండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీరు కోల్పోయిన వ్యక్తి గురించి కూడా వారితో మాట్లాడండి.
సంతోషకరమైన సమయాన్ని గుర్తుంచుకోండి: బాధాకరమైన రోజులను గుర్తుంచుకోవడానికి బదులుగా, ఆ వ్యక్తితో గడిపిన సంతోషకరమైన సమయాన్ని గుర్తుంచుకోండి. వారి జ్ఞాపకార్థం స్వచ్ఛంద సంస్థను మొదలు పెట్టండి. చెట్లను నాటండి, అనాథలను చేరదీయండి.
వైద్యుడిని సంప్రదించాలి: ఎంత చేసినా ఈ సమస్య నుంచి బయటపడకపోయినట్లయితే.. మానసిక వైద్యుడిని సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలి.