నిత్యం కూర్చొనే ఉంటున్నారా..? వామ్మో.. గుండె జబ్బులు సహా ఈ సమస్యలకు స్వాగతం పలికినట్టే..
మీరు ప్రతిరోజూ 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిరంతరం కూర్చుంటే.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ అలవాటు క్రమంగా మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడప్పుడు లేచి అటు, ఇటు నడవండి.. తేలికపాటి వ్యాయామం చేయండి. మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు..

నేటి జీవనశైలిలో గంటల తరబడి కూర్చుని పనిచేయడం సర్వసాధారణమైపోయింది. ఆఫీసు అయినా, ఇంట్లో అయినా, ప్రజలు 6-8 గంటలు నిరంతరం కూర్చుని ల్యాప్‌టాప్, మొబైల్‌తో బిజీగా ఉంటున్నారు.. కానీ ఎక్కువసేపు కూర్చోవడం మీ శరీరానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా…? చాలా డేంజర్ అని పరిశోధనలో వెల్లడైంది.. రోజుకు 6 గంటలకు పైగా కూర్చునే వ్యక్తులకు ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? దానిని ఎలా నివారించవచ్చు.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
6 గంటలకు పైగా నిరంతరం కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..
బరువు పెరిగే ప్రమాదం: మీరు గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే.. శరీరంలో కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని కారణంగా, కడుపు – నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. బరువు వేగంగా పెరుగుతుంది.
గుండె జబ్బుల ప్రమాదం: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 30% పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, నిరంతరం కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది: ఎక్కువసేపు కూర్చునే వారి జీవక్రియ మందగిస్తుంది. ఇది ఇన్సులిన్‌కు ప్రతిస్పందించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
వెన్ను – మెడ నొప్పి: నిరంతరం కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వెన్నునొప్పి, నడుము నొప్పి, మెడ బిగుసుకుపోవడానికి కారణమవుతుంది. ఎక్కువసేపు తప్పు స్థితిలో కూర్చోవడం వల్ల కూడా వెన్నెముక సమస్యలు వస్తాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం: ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన – నిరాశకు దారితీస్తుంది.
ఈ ప్రమాదాలను నివారించడానికి నిపుణులు చెబుతున్న సూచనలు ఇవే..
- ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి: 2-3 నిమిషాలు నడవండి లేదా తేలికపాటి సాగతీత వ్యాయామాలు చేయండి.
- మీ వర్క్‌స్టేషన్‌ను మార్చండి: నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి.
- శారీరక శ్రమను పెంచండి: లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించండి.. ఆఫీసులో లేదా ఇంట్లో నడుస్తూ కొన్ని పనులు చేసేలా చూసుకోండి..
- వ్యాయామం అలవాటుగా మార్చుకోండి: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి లేదా యోగా చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..