Cervical Cancer: గర్భాశయ సమస్యలపై నిర్లక్ష్యం వద్దు.. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించడం మరవొద్దు..
Cervical Cancer:ప్రతి ఏడాది జనవరి(january)నెలను గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer)అవగాహన నెలగా పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా..
Cervical Cancer:ప్రతి ఏడాది జనవరి(january)నెలను గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer)అవగాహన నెలగా పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,04,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. 3,42,000 మంది ఈ వ్యాధితో మరణించారని తెలుస్తోంది అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే.. ఈ క్యాన్సర్ బారిన పడి మహిళలు మరణిస్తున్న వారిలో భారతీయులే అత్యధికం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ముఖ్యంగా భారత దేశంలో క్యాన్సర్ బారిన పడే మహిళల్లో 6 నుంచి 29 శాతం మంది గర్భాశయ క్యాన్సర్‌తోనే బాధపడుతున్నారని.. ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఓ నివేదికలో తేలింది. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా.
గర్భాశయ క్యాన్సర్ అంటే…? అనేది అత్యంత సాధారణ స్త్రీ జననేంద్రియ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, “గర్భాశయ క్యాన్సర్ గర్భాశయం కింద భాగం (గర్భాశయం) లైనింగ్ కణాలలో మొదలవుతుంది. శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. గర్భాశయ క్యాన్సర్ అనేది మానవ పపిల్లోమా వైరస్ (హ్యూమన్ పపిల్లోమా వైరస్, హెచ్‌పీవీ) వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా హెచ్‌పీవీ 16, హెచ్‌పీవీ 18 వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ భాగం మిగతా అన్ని క్యాన్సర్‌లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. గర్భాశయ క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తిస్తే.. చికిత్స సులభం.
హెచ్‌పీవీ అంటే ఏమిటంటే:
హెచ్‌పీవీ అనేది అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా లేదా లిప్ కిస్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఈ హెచ్‌పీవీ వైరస్‌ఉంటుంది. అయితే ఈ వైరస్ అందరికీ క్యాన్సర్ గా మారదు. చాలావరకు HPV ఇన్‌ఫెక్షన్ తమంతట తాముగా క్లియర్ అవుతుంది. కొంతమందిలో మాత్రమే గర్భాశయ క్యాన్సర్ గా మారుతుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. ఈ హెచ్‌పీవీలో 100 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 14 జాతులు క్యాన్సర్‌గా మారే లక్షణాలు కలిగి ఉన్నాయి. మహిళల్లో చాలా ఇన్ఫెక్షన్లు 2 సంవత్సరాలలో ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే సాధారనంగా క్లియర్ అవుతాయి. అయితే కొన్ని హెచ్‌పీవీ వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉండి.. కణాలతో కలిసిపోయి గర్భాశయ క్యాన్సర్‌గా పురోగమిస్తాయి. వీటిని తరచుగా స్క్రీనింగ్చేయించుకోవడం వలన ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంది.
ఈ గర్భాశ క్యాన్సర్ చిన్న వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. అంతేకాదు ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు:
రుతుక్రమం లేకపోయినా యోని నుంచి రక్తస్రావం కనిపిస్తే గర్భాశయ క్యాన్సర్‌కు ముందుస్తు హెచ్చరికగా భావించవచ్చు. శృంగారం అనంతరం యోనిలో రక్తస్రావం , యోనిలో మంట లేదా దురద.. యోని నుండి నీరు మరియు చెడువాసనతో కూడిన రక్తస్రావం జరగడం గర్భాశయ ప్రధమ లక్షణాలుగా భావించవచ్చు. అంతేకాదు కడుపు నొప్పి లేదా వెన్ను కింద నొప్పి విపరీతమైన అలసట.. తరచూ మూత్రం ఆపుకోలేకపోవడం. పొట్ట ఉబ్బరం ఈ లక్షణాలు కనిపించిన స్త్రీలు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంతేకాదు కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా క్యాన్సర్ బారిన పడిన వారున్నా.. గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక గర్భాశయంలో జరిగే సహజ మార్పులను ప్రతీ స్త్రీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. అందుకనే బాలికలు గర్భాశయ ముఖద్వార కేన్సర్ నిరోధ టీకా తీసుకోవడం ముఖ్యం.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? మన శరీరం సహజమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే కణాలను తయారు చేసుకుంటుంది. ఈ యాంటీబాడీస్.. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియా లను తట్టుకునే శక్తినిస్తాయి. అయితే ఈ హెచ్‌పీవీ వైరస్ నిరోధానికి మన శరీరంలో ఎటువంటి యాంటీబాడీస్‌లను తయారు చేయదు. కనుక హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకున్న మహిళ శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేస్తుంది. తద్వారా హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది.
ఎప్పుడు ఏ వయసులో ఎన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకోవాలంటే..
9 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల నుంచి 18 ఏళ్ళ వరకూ ఉండే ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలని అమెరికన్ క్యా న్సర్ ఇన్‌స్టిట్యూట్ వారి సిఫార్సు చేస్తోంది. 9 నుంచి 14 ఏళ్ల మధ్య బాలికలకు 6 నెలల వ్యవధిలో 2 సార్లు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇక 14 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు లోపు ఉన్న బాలికలకు మూడు సార్లు హెచ్‌పీవీ వ్యాక్సిన్ డోసు ఇస్తారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఇప్పటి వరకూ హెచ్‌పీవీ సోకని మహిళలకు కూడా ఇవ్వవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కే కాదు ఆనల్ కేన్సర్, జననేంద్రియ వార్ట్స్ , నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ఇతర సమస్యలనుంచి కూడా రక్షిస్తుంది.
Also Read: