డయాబెటిస్ వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతింటుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఈ రోజుల్లో డయాబెటిస్ వల్ల జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. మెదడుకు శక్తిని అందించే గ్లూకోజ్ సరఫరా లేకపోవడం, ఇన్సులిన్ ప్రభావం వల్ల మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక విశ్రాంతి తో జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ సమస్య సాధారణ జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. ఈ వ్యాధి రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాదు.. శరీరంలోని చాలా భాగాలపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఏంటి..? విజ్ఞానపరంగా అమ్నీషియా (Amnesia) అని పిలిచే జ్ఞాపక లోపం చాలా కారణాల వల్ల రావచ్చు. వాటిలో ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం
- మెదడులో గాయాలు, దెబ్బలు
- ఎక్కువ కాలం మద్యం తాగడం
- మెదడును ప్రభావితం చేసే వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
- కొంత మందికి షుగర్, థైరాయిడ్, మెటబాలిజం సంబంధించిన వ్యాధులు
- మానసిక ఒత్తిడి, నిద్రలేమి
- డయాబెటిస్ జ్ఞాపకశక్తి మధ్య సంబంధం
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు.. మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ సరఫరాకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల మెదడు శక్తిని కోల్పోయి తాత్కాలిక జ్ఞాపక లోపానికి దారితీస్తుంది. ఇది రోజురోజుకూ పెరుగుతూ ఎక్కువ కాలం ఉండే మెంటల్ డిక్లైన్ (జ్ఞాపకశక్తి కోల్పోవడం)గా మారే ప్రమాదం ఉంది.
ఇన్సులిన్ సరిగా విడుదల కాకపోవడం వల్ల మెదడులోని నరాల్లో సంకేతాలు పంపడం మారిపోతుంది. శరీరంలోని కొన్ని భాగాలు మెదడుకు అవసరమైన శక్తిని ఇవ్వకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పద్ధతులు పాటిస్తే జ్ఞాపకశక్తి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అధిక కార్బోహైడ్రేట్లు, తీపి పదార్థాలను తగ్గించండి. ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ప్రాణాయామం లాంటి గుండెకు మంచి చేసే వ్యాయామాలు చేయండి. ఇవి మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మద్యం, ధూమపానం మానేయాలి.. ఇవి మెదడు పనితీరును తగ్గించడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని బలహీనంగా చేస్తాయి.
రోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం మెదడు విశ్రాంతికి జ్ఞాపకశక్తి మెరుగుదలకీ చాలా ముఖ్యం.
చదవడం, క్రాస్ వర్డ్స్, పజిల్స్, శ్రద్ధగా వినడం లాంటివి మెదడును చురుకుగా ఉంచుతాయి. ధ్యానం కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
జ్ఞాపక లోపం ఎక్కువగా ఉంటే న్యూరాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. అవసరమైతే మెమరీ ఎన్ హాన్సింగ్ మందులపై సలహా తీసుకోవచ్చు.
డయాబెటిస్ వల్ల మెదడు పని తీరు తగ్గే అవకాశం ఉన్నా.. సరైన జీవనశైలి, ఆహార నియమాలు, మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడు మనం జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మానసిక ఆరోగ్యానికి మంచి భవిష్యత్తును అందిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)