Health Tips: ప్రతి నలుగురిలో ఒకరిని అటాక్ చేస్తున్న వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే ముప్పు ఉన్నట్టే..
ఆధునిక జీవనశైలిలో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. సరైన సమయంలో లక్షణాలను గుర్తించి, తక్షణమే చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడటంతో పాటు వైకల్యాన్ని నివారించవచ్చు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసరం.

ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైద్యులు సుభాష్ కౌల్, పి. విజయ, జి. ఉష, సలీల్ పాల్గొని ప్రసంగించారు. బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాలను గుర్తించే విధానం, స్ట్రోక్ వచ్చినప్పుడు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై వారు కీలక విషయాలను చర్చించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే?
మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా మెదడులోని రక్తనాళం పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల మెదడు కణాలు దెబ్బతిని, శాశ్వత వైకల్యం లేదా ప్రాణాపాయం సంభవించవచ్చు.
స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు:
అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)
మధుమేహం (రక్తంలో అధిక చక్కెర స్థాయులు)
పొగతాగడం, మద్యం సేవించడం
స్థూలకాయం, అనారోగ్యకరమైన జీవన విధానం
స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం – ‘BE FAST’ సూత్రం:
B – Balance (పట్టు): ఒక్కసారిగా మైకం రావడం లేదా నడుస్తున్నప్పుడు పట్టు తప్పి పడిపోవడం.
E – Eyes (కళ్లు): అకస్మాత్తుగా చూపు మసకబారడం లేదా పూర్తిగా కనిపించకపోవడం.
F – Face (ముఖం): ముఖం ఒకవైపునకు వాలిపోవడం లేదా ఒకవైపు కదలిక కోల్పోవడం.
A – Arm (చెయ్యి): ఒక చెయ్యి లేదా కాలు బలహీనంగా మారడం లేదా మొద్దుబారిపోవడం.
S – Speech (మాట): మాట్లాడేందుకు కష్టపడటం లేదా మాట అస్పష్టంగా, తడబడుతూ ఉండటం.
T – Time (సమయం): పై లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణం ఆసుపత్రికి వెళ్లాలి – తొలి 4 గంటలు అత్యంత కీలకం.
సకాలంలో చికిత్స ఎందుకు ముఖ్యం?
స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, 4 గంటల్లోపు రోగిని ఆసుపత్రికి చేర్చగలిగితే, త్రోంబోలిసిస్ వంటి చికిత్సల ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చు. అంతేకాదు, దీనివల్ల ఏర్పడే శాశ్వత వైకల్యాన్ని కూడా నివారించవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్‌ను సకాలంలో గుర్తించి చికిత్స చేయడం వల్ల స్ట్రోక్‌ను నివారించవచ్చని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు వారు హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.




