Almonds Benefits: రోజుకు 5 బాదం తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీటిని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మనకు తెలియని మరెన్నో ప్రయోజనాలున్నాయి. గర్భిణీ స్త్రీల దగ్గరినుంచి మెనోపాజ్ దశకు చేరుకుంటున్న వారందరికీ బాదం పప్పు తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

బాదంలో మన రోజూవారీ శక్తికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాల కారణంగా వీటిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. గర్భిణీ స్త్రీల దగ్గరినుంచి మెనోపాజ్ దశకు చేరుకుంటున్న వారందరికీ బాదం పప్పు తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు. నిపుణులు. మెదడుకు ఇవి చేసే మేలు వల్ల వయసుపైబడ్డ తర్వాత వచ్చే ఎన్నో సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది.
మీ గుండె సేఫ్..
బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బందిపడుతున్న ఎంతో మందికి బాదం వరం లాంటివి. ఎందుకంటే వీటిని శరీరం నుంచి బయటపడేయడంలో అలాగే రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయి. అందుకే గుండెజబ్బులున్న వారు, ఆ రిస్క్ ఉన్నవారు కచ్చితంగా టైట్ లో ఇవి చేర్చుకోవాలి.
మెదడు మొద్దుబారకుండా..
బాదంలో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి. అందుకే బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తాయి.
బ్లడ్ షుగర్ రాకుండా..
ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ బ్లడ్ షుగర్ ను దరిచేరకుండా చేస్తాయి. అదే విధంగా షుగర్ వ్యాధి రాకుండా ముందు నుంచే శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇప్పటికే షుగర్ కంట్రోల్ కాక ఇబ్బంది పడుతున్న వారు కూడా వీటిని డైట్ లో చేర్చుకోవడం ఎంతో మేలు.
ముఖం కళ తప్పినట్టుగా ఉందా?..
చర్మానికి అవసరమైన తేమ లేనప్పుడు అది పొడిబారిపోతుంది. దాని కారణంగా కాంతిహీనంగా కనపడుతుంది. రోజూ బాదం తినేవారి ముఖంలో గ్లో పెరుగుతుంది. అంతేకాదు అది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది కూడా. బాదం లో ఉండే ప్రత్యేక గుణాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. ఏజింగ్ ను నెమ్మదించేలా చేస్తాయి. అందువల్ల ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించొచ్చు.
ఆకలిని తట్టుకునేలా..
ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడో లేదా ప్రయాణాల్లోనో ఆకలి వేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం తీసుకునే వీలుండదు. వారు నాలుగు బాదంలను దగ్గరుంచుకుంటే చాలు. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ ఆకలిని వెంటనే తగ్గిస్తాయి. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరికను కంట్రోల్ లో ఉంచుతాయి. అందువల్ల బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి స్నాక్ ఐటెంగా చెప్పొచ్చు.
మలబద్దకానికి..
వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మలబద్దకం సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు బాదం ను నానబెట్టి తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం నుంచి వెంటనే రిలీఫ్ దొరకుతుంది. అయితే వీటిని నానబెట్టకుండా తీసుకున్నప్పుడు అరుగుదల కష్టమవుతుందని గుర్తుంచుకోవాలి.
వ్యాధుల బెడద లేనట్టే..
ప్రస్తుతం కాలంలో ఏం తినాలన్నా, తాగాలన్నా ఏదో ఓ సమస్య భయపెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ మొదలు డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటివన్నీ చిన్న వయసులోనే అటాక్ చేస్తున్నాయి. వీటికి మన బాడీలో ఇన్ ఫ్లమేషన్ ఎక్కువగా కారణమవుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడంలో బాదంలోని యాంటి ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. బాదం డైట్ లో ఉంటే ఆ వ్యాధుల బెడద లేనట్టే మరి.
ఉక్కులాంటి ఎముకలకు..
ఇందులో ఉండే కాల్షియం స్థాయిలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మెగ్నీషియం కూడా ఎముకలు ఉక్కులా మారేందుకు సాయం చేస్తాయి. బాదం వల్ల భవిష్యత్తులో ఆస్టియోపొరొసిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
ఇన్ఫెక్షన్లకు ఆమడ దూరం..
మనలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లు.. ఇలా తరచూ ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత సమస్యగా మారుతుంది. బాదంలో ఉండే జింక్ కారణంగా రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది.