America: అమెరికాలో ఆ వ్యాధి భయంతో 17 లక్షల గుడ్లు వెనక్కి.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
అమెరికాలో 1.7 మిలియన్ల (17 లక్షల) గుడ్లను వెనక్కి తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 79 మంది అస్వస్థతకు గురికాగా, 21 మంది ఆస్పత్రిలో చేరారు. మరణాలు మాత్రం సంభవించలేదు. సీడీసీ, యూఎస్ ఎఫ్‌డీఏ ఈ ఘటనపై సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి..

అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలకు (కాలిఫోర్నియా, నెవాడా, వాషింగ్టన్, అరిజోనా, నెబ్రాస్కా, న్యూ మెక్సికో, ఇల్లినాయిస్, ఇండియానా, వయోమింగ్) అగస్ట్ ఎగ్ కంపెనీ ఫిబ్రవరి 3 నుండి మే 15 మధ్య సరఫరా చేసిన సుమారు 1.7 మిలియన్ బ్రౌన్ కేజ్‌ఫ్రీ, ఆర్గానిక్ గుడ్లను రీకాల్ చేశారు. న్యూజెర్సీ, కెంటకీ, నెబ్రాస్కా, నెవాడా, అరిజోనా, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలలో ఈ వ్యాప్తి నమోదైంది. ఈ వ్యాప్తి కేవలం ఈ రాష్ట్రాలకే పరిమితం కాకపోవచ్చని, నిజమైన సంఖ్య చాలా ఎక్కువ ఉండవచ్చు అని సీడీసీ తెలిపింది. సాల్మొనెల్లా ఆందోళనపై సమాచారం అందిన వెంటనే తమ గుడ్లను పాశ్చరైజ్ చేసేందుకు “ఎగ్-బ్రేకింగ్ ఫెసిలిటీ”కి పంపడం ప్రారంభించినట్లు అగస్ట్ ఎగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
సాల్మొనెల్లా అంటే ఏమిటి?
సాల్మొనెల్లా అనేది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే ఒక సాధారణ బ్యాక్టీరియా వ్యాధి. ఈ బ్యాక్టీరియా సాధారణంగా జంతువులు, మానవుల ప్రేగులలో నివసిస్తుంది. మలం ద్వారా బయటకు వస్తుంది. కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా మానవులకు సోకుతుంది. సాల్మొనెల్లా సోకిన కొంతమందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఎక్కువ మందికి 8 నుండి 72 గంటలలోపు విరేచనాలు, జ్వరం, కడుపు తిమ్మిర్లు వస్తాయి. చాలామంది ఒకటి లేదా రెండు వారాల్లో చికిత్స లేకుండా కోలుకుంటారు. అయితే, ఈ ఇన్‌ఫెక్షన్ ప్రేగుల నుండి బయటకు వ్యాపిస్తే ప్రాణాంతకం కావచ్చు.
సాల్మొనెల్లా లక్షణాలు:
విరేచనాలు
కడుపు తిమ్మిర్లు
జ్వరం
వికారం
వాంతులు
చలి
తలనొప్పి
మలంలో రక్తం
సాల్మొనెల్లాకు కారణాలు:
సాధారణంగా, మలంతో కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం ద్వారా సాల్మొనెల్లా సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు: పచ్చి మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్, పచ్చి లేదా సరిగా ఉడకని గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు. సరిగా శుభ్రం చేయని ఆహారం: టాయిలెట్ వాడిన తర్వాత లేదా డైపర్ మార్చిన తర్వాత సరిగా చేతులు కడుక్కోని వారు ఆహారాన్ని తయారు చేయడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కలుషితమైన ఉపరితలాలు:
కలుషితమైన వాటిని తాకి, నోటిలో వేలు పెట్టుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ సంక్రమించవచ్చు. పెంపుడు జంతువులు, ఇతర జంతువులు: పెంపుడు జంతువులు, ముఖ్యంగా పక్షులు, సరీసృపాలు తమ ఈకలు, బొచ్చు, చర్మం లేదా మలంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు.
నివారణ చర్యలు:
చేతులు కడుక్కోవడం: టాయిలెట్ వాడిన తర్వాత, డైపర్ మార్చిన తర్వాత, పచ్చి మాంసం లేదా పౌల్ట్రీని తాకిన తర్వాత, పెంపుడు జంతువుల మలాన్ని శుభ్రం చేసిన తర్వాత, పెంపుడు జంతువులను తాకిన తర్వాత సబ్బు, నీటితో 20 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
విడిగా ఉంచండి:
క్రాస్-కంటామినేషన్‌ను నివారించడానికి పచ్చి మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్‌ను ఇతర ఆహార పదార్థాల నుండి ఫ్రిజ్‌లో దూరంగా ఉంచండి. పచ్చి మాంసానికి ఒక చాపింగ్ బోర్డు, పండ్లు, కూరగాయలకు మరొక చాపింగ్ బోర్డు ఉపయోగించండి. పచ్చి మాంసం పెట్టిన కడగని ప్లేట్‌లో ఉడికించిన ఆహారాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ఆహారాన్ని తయారుచేసే ఉపరితలాలను సబ్బు, నీటితో బాగా శుభ్రం చేయాలి. ఆహారాన్ని పూర్తిగా ఉడికించండి. రిఫ్రిజిరేటర్‌లో లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేయండి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వీటిని వృత్తిపరమైన వైద్య సలహాగా పరిగణించరాదు. ఏదైనా ఫిట్‌నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.