పిల్లలకు జ్వరం వస్తే కంగారు పడకుండా ఇలా చేయండి..! త్వరగా కోలుకుంటారు..!
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కంగారు పడడం సహజం. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు త్వరగా కోలుకోవచ్చు. వారి ఆరోగ్యం బాగుండడానికి అసౌకర్యాలు తక్కువగా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల జ్వరం వల్ల వచ్చే ప్రభావాన్ని తగ్గించవచ్చు.

జ్వరం వచ్చినప్పుడు శరీరంలో నీటి స్థాయి వేగంగా తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్ కి దారితీసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తేమను కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. వారిని బలవంతంగా ఎక్కువగా నీరు తాగమనకండి. ఆ స్థానంలో కొద్దికొద్దిగా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, సూప్ లాంటివి ఇవ్వడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన తేమను నిలుపుకొని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి.
పిల్లలకు జ్వరం ఉన్నప్పుడు మందంగా ఉండే దుస్తులు వేస్తే శరీర వేడి బయటకు పోకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే పలుచగా ఉండే, గాలి వెళ్లేలా ఉండే దుస్తులు వేసేలా చూసుకోండి. అలాగే వారి గదిలో గాలి ఆడేటట్లు ఉండాలి. చలిగాలిలో కాదు కానీ.. కొంచెం చల్లగా ఉండేలా చూసుకుంటే వారికి రిలీఫ్ కలుగుతుంది.
జ్వరం ఉన్నప్పుడు శరీరం జబ్బుతో పోరాడుతుంది. అందుకే పిల్లలు బాగా నిద్రపోవడం, విశ్రాంతిగా ఉండడం చాలా ముఖ్యం. ఆడుకునేంత ఉత్సాహం లేకపోవడం సహజం. వారిని బలవంతం చేయకుండా రిలాక్స్ అవ్వనివ్వండి. బాగా విశ్రాంతి తీసుకుంటే జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
పిల్లలకు వచ్చే జ్వరం స్థాయిని తరచూ చెక్ చేయాలి. డిజిటల్ థర్మామీటర్ ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజులో మూడుసార్లు శరీరం ఉష్ణోగ్రతను చెక్ చేయండి. వేడి చాలా ఎక్కువగా పెరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
పిల్లలకు జ్వరం వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్లు మందులు ఇవ్వడం మంచిది కాదు. వైద్యుల సలహా తీసుకుని వారి వయస్సు, బరువు ఆధారంగా తగిన మోతాదులో మందులు ఇవ్వాలి. ఎక్కువ మోతాదు ఇస్తే అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
చాలా మంది తల్లిదండ్రులు జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయనివ్వరు. కానీ గోరువెచ్చని నీటితో తేలికగా స్నానం చేయిస్తే పిల్లలకు ఉపశమనం వస్తుంది. ముఖ్యంగా కండరాల నొప్పులు తగ్గుతాయి. చల్లటి నీటిని మాత్రం వాడకండి.
పసుపు అల్లంలో ఉండే సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు జ్వరం సమయంలో మంచి సహాయంగా ఉంటాయి. చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో తేలికగా ఉండేలా అల్లం, పసుపు టీ ఇవ్వవచ్చు. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్ కు వ్యతిరేకంగా పని చేస్తుంది.
మిరియాల్లో ఉన్న సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాస సంబంధిత ఇబ్బందులను తగ్గిస్తాయి. కొద్దిగా మిరియాల కషాయం పిల్లలకు వేడిగా కాకుండా గోరువెచ్చగా ఇవ్వడం వల్ల జలుబు దగ్గు లాంటి లక్షణాలు తగ్గుతాయి.
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇలా సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారు త్వరగా కోలుకుంటారు. ఇంటి చిట్కాలను పాటిస్తూనే పరిస్థితి విషమంగా ఉంటే డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)