Balayya: బిడ్డ బతుకు కోసం బాబాయ్ ఆరాటం.. బాలయ్య నిజంగా నీ మనసు వెన్న అయ్య
బాలయ్య నాన్నగారు.. నాన్నగారు అని ఎలా అంటూ ఉంటారో, మా బాల బాబాయ్, మా బాల బాబాయ్ అని అనుక్షణం తపిస్తూ ఉంటారట తారకరత్న. అందుకే ఇంత కష్ట సమయంలో ఆయనకు మృత్యువు చేరువ కాకుండా అడ్డుగా నిలబడిపోయాడు బాలయ్య.
‘మాట కాస్త కటువుగా ఉంటుంది.. మనసు మాత్రం వెన్న’. నందమూరి బాలకృష్ణ గురించి ఆయన అభిమానులు చెప్పే మాట ఇది. మొత్తంగా బాలయ్య ఫిల్టర్ లేని మనిషి. తారతమ్యాలు ఉండవ్. ఎదుటి వ్యక్తి.. పెద్దవాడా, చిన్నవాడా, ధనికుడా, పేదోడా అని ఉండదు. అందరితో ఒకేలా ఉంటారు. మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. అందుకే ఆయన మాట్లాడే మాటలు వివాదాలు అవుతుంటాయి. మాటలే కాదు బాలయ్య టెంపర్ కూడా అలానే ఉంటుంది. అతి చేస్తే.. అభిమానులకు ఇచ్చిపడేస్తారు. నా ఫ్యాన్స్‌ను ఎవరో బౌన్సర్లు కొట్టేది ఏంటి.. కోపం వస్తే నేనే ఒక దెబ్బ వేస్తాను అన్నది బాలయ్య వెర్షన్. కెరీర్‌లో ప్రజంట్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు బాలయ్య. అటు వెండితెరపై సింహనాదం చేస్తూనే, మరోవైపు ఓటీటీలో గర్జిస్తున్నారు. ఆయన మనస్తత్వం ఏంటో అన్‌స్టాపబుల్ ద్వారా జనాలకు తెలిసింది. ఇదిలా సాగుతుండగా అక్కినేనిని అవమానించారంటూ వివాదం చెలరేగింది. ‘పిచ్చోళ్లలా ఉన్నారే.. మా బాబాయ్‌ని నేనేందుకు తక్కువ చేస్తాను’ అంటూ ఒక్క మాటతో ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు వేశారు బాలయ్య.
కాగా తారకతర్న అస్వస్థతకు గురైనప్పటి నుంచి బాలయ్య వ్యవహరిస్తున్న తీరపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తొలుత కుప్పుంలో కేసీ ఆస్పత్రికి తరలించినప్పటి నుంచి అన్నీ తానై చూసుకున్నారు బాలయ్య. తారకతర్నకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన చాలా తాపత్రయపడ్డారు. అన్ని పనులు వదిలేసి బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడి నారాయణ హృదయాల ఆస్పత్రిలోనే ఉంటూ.. అటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఇటు అభిమానులకు భరోసానిస్తూ.. చెక్కుచెదరని మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నారు బాలకృష్ణ.
దీంతో అటు నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని మాట తడబడుతుంది ఏమో, మనసు ఎప్పుడు తడబడదు. స్వచ్ఛమైన ఆ మనసుకి అచ్చమైన అభిమానులం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిడ్డ బతుకు కోసం బాబాయ్ ఆరాటం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.