గేమ్ ఛేంజర్‌కు షాక్.. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోకు అనుమతి రద్దు
Game Changer Movie: గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ విజ్క్షప్తి మేరకు ఆ మూవీ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోస్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అనుమతులను రద్దు చేస్తున్నట్లు హోం శాఖ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీకి షాక్ తగిలినట్టయ్యింది.
గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు మార్నింగ్ స్పెషల్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సినిమాకు ఈ వెసులుబాటును రద్దు చేస్తూ తెలంగాణ హోంశాఖ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తెలంగాణలో ఇకపై సినిమాల మార్నింగ్ షోలకు అనుమతివ్వబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది.
గేమ్ ఛేంజర్ మూవీ టిక్కెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై శనివారంనాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెబుతూ.. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచన చేయాలని సూచించింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది.తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం(జనవరి 10)నాడు వరల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అయ్యింది.
మెగా సెలబ్రేషన్స్ షురూ…
ఓ వైపు మెగాభిమానులు.. మరో వైపు సినీ ప్రేక్షకులు ఇస్తోన్న ఆదరణతో ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో రెండో రోజున కూడా వసూళ్ల పరంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజర్ కొనసాగిస్తుండటం విశేషం.
ప్రజా నాయకుడు అప్పన్నగా.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్ రామ్ నందన్ అనే రెండు పాత్రల్లో చరణ్ చూపించిన పెర్ఫామెన్స్ వేరియేషన్స్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇక డాన్సుల విషయంలో మెగాపవర్ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్ తదితరుల నటనకు సూపర్బ్ అప్లాజ్ వస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రతీ సన్నివేశాన్ని ఎంతో గ్రాండియర్‌గా శంకర్ తెరకెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అయ్యాయి.
రామ్ చరణ్‌ను శంకర్ ఎలా ప్రెజంట్ చేస్తారోనని అందరూ ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అందరి అంచనాలను మించుతూ శంకర్ మాస్టర్ టేకింగ్, రామ్ చరణ్ పెర్ఫామెన్స్‌తో గేమ్ చేంజర్ నెక్ట్స్ రేంజ్‌లో సంక్రాంతి విన్నర్‌గా కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ సక్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం విశేషం. గేమ్ చేంజర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ను కలిసిన రామ్ చరణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.