Srikanth : అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. కానీ చిరంజీవి పిలిచి.. శ్రీకాంత్ కామెంట్స్..
నటుడు శ్రీకాంత్ తన కెరీర్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మార్గదర్శకత్వం గురించి వివరించారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న శ్రీకాంత్‌ను చిరంజీవి పిలిచి, విజయం, అపజయాన్ని సమదృష్టితో చూడాలని చెప్పారని.. ఆ మాటలే తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని అన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నటుడు శ్రీకాంత్ తన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న బాండింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారిగా తన తండ్రి ద్వారా కలిసినప్పుడు, చిరంజీవి తనను ఒక తమ్ముడిలా చూసుకున్నారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. వారిద్దరి మధ్య రాపో అప్పటినుంచి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. శ్రీకాంత్ కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుసగా ఏడెనిమిది సినిమాలు ఫ్లాప్‌లు, యావరేజ్‌లు ఎదుర్కొని తీవ్ర నిరాశలోకి వెళ్లారని.. అప్పటివరకు సక్సెస్‌లను మాత్రమే చూసిన తాను, హఠాత్తుగా ఎదురైన ఈ డౌన్‌ఫాల్‌తో మానసికంగా కృంగిపోయానని, ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని కూడా ఆలోచించానని చెప్పారు. మూడు నెలల పాటు చిరంజీవిని కలవడం మానేశానని.. అప్పుడు చిరంజీవి తనకు కబురు పంపి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు రప్పించారని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి శ్రీకాంత్‌ను గంటపాటు మాట్లాడమని చెప్పి, తన సమస్య ఏమిటో తెలుసుకున్నారని.. ఆ రోజు చిరంజీవి ఇచ్చిన ఉపదేశం తన జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని శ్రీకాంత్ వెల్లడించారు. విజయం, అపజయం అనేవి జీవితంలో సహజమని, వాటిని ఒకే విధంగా స్వీకరించాలని చిరంజీవి చెప్పారని.. ఒక విజయం పొంగిపోకుండా, అపజయం వస్తే కృంగిపోకుండా ఉండాలని ఆయన సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అలవాటు చేసుకోవాలని చిరంజీవి వివరించారని అన్నారు. ఈ మార్గదర్శకత్వం కేవలం సినిమా కెరీర్‌కు మాత్రమే కాకుండా, సాధారణ జీవితానికి కూడా వర్తించే అమూల్యమైన పాఠమని శ్రీకాంత్ అన్నారు. ఆ రోజు నుంచి తనలో డిప్రెషన్, నిరాశ వంటివి పోయాయని, జీవితాన్ని హ్యాపీగా గడపడమే తన లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు.
దర్శకుల పాత్రపై శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా విజయానికి దర్శకుడే కీలకం అని చెప్పారు. దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్గా అభివర్ణించారు. ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దాని బాధ్యత దర్శకుడిదేనని, నటులు కేవలం వారి పాత్రలను పోషించి వెళ్ళిపోతారని అన్నారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు, విశ్వనాథ్, బాపు వంటి లెజెండరీ దర్శకులు సినీ పరిశ్రమలో దర్శకుడి విలువను పెంచారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి వంటి దర్శకులతో పనిచేయాలని ప్రతి హీరో కోరుకుంటారని, వారిపై పూర్తి నమ్మకంతో ఉంటారని తెలిపారు. అయితే, కొన్నిసార్లు దర్శకులు చెప్పిన విధంగా షూటింగ్ పరిస్థితులు ఉండకపోవడం వల్ల సినిమాపై ప్రభావం చూపుతుందని, బడ్జెట్ పరిమితుల వల్ల మౌంట్ రోడ్ వంటి లొకేషన్లలో షూటింగ్ చేయలేక వేరే చోటికి మార్చడం వల్ల సీన్ ఇంపాక్ట్ తగ్గిపోతుందని శ్రీకాంత్ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
