Singer Vani Jayaram Death: మనసులు దోచిన మధురవాణి.. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకే రెండు నేషనల్ అవార్డ్స్..
తన గాత్రంతో శ్రోతల హృదయాలను పరవశింపచేసిన లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది.
కళాతపస్వి విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించిన దిగ్గజ దర్శకుడు ఇకలేరు అన్న వార్తను ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తన గాత్రంతో శ్రోతల హృదయాలను పరవశింపచేసిన లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. 78 ఏళ్ల వాణీ జయరామ్.. చెన్నైలోని నాగంబాక్కంలోని హద్డౌస్ రోడ్డులోని తన స్వగ్రమంలో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు. అదే సమయంలో ఆమె కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు.
చిత్రసీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పురస్కారంతో ఆమెను సత్కరించారు. కానీ ఈ అవార్డు అందుకోక ముందే ఆవి కన్నుమూయడంతో అభిమానులు.. ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం రాత్రి లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ మరణంతోనే దుఃఖంలో మునిగిపోయిన చిత్రపరిశ్రమకు మరో దిగ్గజ గాయని దూరమయ్యారు. వాణి జయరామ్ 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా దాదాపు 20 వేల పాటలను ఆలపించారు. సినిమాల్లోని పాటలు మాత్రమే కాకుండా భక్తి గీతాలను కూడా ఆలపించారు. విదేశాల్లోనూ అనేక కచేరీలలో పాల్గొన్నారు.
వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగాల్ సినిమా తెలుగులో అంతులేని కథ చిత్రంలోని పాటలకు గానూ ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు డైరెక్టర్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమాలకు అందుకున్నారు. అందులో ఒకటి శంకరాభరణం చిత్రంలోని పాటలకు.. ఆ తర్వాత స్వాతి కిరణం సినిమాలోని అనాతనీయరా హార పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు.