Anil kumar poka |
Updated on: Feb 04, 2023 | 4:00 PM
ప్రముఖ గాయని వాణీజయరామ్ చెన్నైలోని స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. నేపథ్యగాయనిగా ఎన్నో గొప్ప పాటలను పాడారు వాణీజయరామ్. 1945 నవంబర్ 30న జన్మించారు వాణీజయరామ్.
తమిళనాడులోని వేలూరులో పుట్టిన ఆమె అసలు పేరు కలైవాణి. ఆమెది సంగీత కుటుంబం. శాస్త్రీయ సంగీతానికి గౌరవం ఇచ్చే కుటుంబంలో పుట్టారు వాణీ జయరామ్.కర్ణాటకసంగీతంలో శిక్షణ పొందిన ఆమె ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు పాడటం దిట్ట.
అలా ఆమె రేడియోలో పాడటం మొదలుపెట్టారు. సినిమా సంగీతానికి వారి కుటుంబంలో అసలు స్థానం ఉండేది కాదు. సినిమా పాటలను వినడానికి కూడా తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదట. అయినా సినిమాల్లో పాడాలన్నది ఆమె కోరిక.
చెన్నై క్వీన్ మేరీస్ కాలేజీలో ఎకనామిక్స్ లో డిగ్రీ చేశాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు వాణీ జయరామ్.. ఆ ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌కి వచ్చాకే జయరామ్‌తో పెద్దలు వివాహం చేశారు.
పెళ్లయ్యాక ఆయన కోసం ఆమె మకాం ముంబైకి మారింది. జయరామ్‌కి స్వతహాగా సంగీతం అంటే ఇష్టం. ఆయన సితార్ వాయించేవారు. అలా ఆయన ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు వాణీ జయరామ్.
రోజుకు 18 గంటల పాటు సాధన చేసేవారట.గురువుల ప్రోత్సాహం వల్లనే 1969లో బాంబేలో తొలి కచ్చేరీ చేశారు వాణీ జయరామ్. అలా ఆమె ఇచ్చిన ఓ కచేరీకి సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ హాజరయ్యారు. ఆమె పాట నచ్చి గుడ్డీ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు.
తొలి సినిమాలో పాడిన బోలే రే పపి పాట అప్పట్లో పెద్ద హిట్ అయింది. దానికి తాన్‌సేన్ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు.
నౌషాద్, ఆర్.డి.బర్మన్, మదన్‌మోహన్, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పండిట్ రవిశంకర్, ఇళయరాజా, ఎం.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహదేవన్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. రఫి, కిశోర్‌కుమార్ వంటివారితోనూ పాడారు.
ఎస్.పి.కోదండపాణి సంగీతంలో అభిమానవంతుడు అనే సినిమాలో ఎప్పటివలె కాదురా స్వామీ అంటూ పాడిన పాట.. ఆమె తొలి తెలుగు సినిమా పాట. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా పాటలు పాడిన గళం ఆమెది. దాదాపు ఇరవైవేల పాటలకు పైగా పాడారు వాణీజయరామ్.
సినిమా పాటలనే కాదు, ఆధ్యాత్మిక గీతాలను కూడా అలపించారు వాణీజయరామ్.అత్యంత క్లిష్టమైన కంపోజిషన్‌ని కూడా సునాయాసంగా పాడతారనే పేరు ఉంది వాణీజయరామ్‌కి.తమిళ్, మలయాళం, కన్నడలో ఆమె వేల పాటలు పాడారు. క్లాస్ అయినా, క్లాసికలైనా, జానపదమైనా, జాజ్‌బీటైనా, ఆమె పాడిన పాట ఏదైనా సరే దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఆమె గాత్రానికి స్పెషల్ గుర్తింపు ఉంది. తన జీవితాంతం సంగీతానికే అంకితం అని ప్రకటించారు వాణీ జయరామ్.కె.బాలచందర్ అపూర్వ రాగంగళ్ సినిమాకు ఓ సారి, శంకరాభరణం సినిమాకు రెండో సారి, హిందీలో మీరా సినిమాకు మరో సారి జాతీయ అవార్డులను దక్కించుకున్నారు వాణీ జయరామ్.
ఒడిశా, గుజరాత్, తమిళనాడు స్టేట్ అవార్డులతో పాటు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. ఫిల్మ్ ఫేర్ లైఫ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఆమెకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
ఆ అవార్డు అందుకోకుండానే ఆమె కన్నుమూయడం బాధాకరం అంటున్నారు అభిమానులు. ఆమె కన్నుమూశారని వార్త తెలిసి సినీ, సంగీతలోకం శోకసంద్రంలో మునిగిపోయింది
అపూర్వమైన గళం అంటూ ఆమె పాడిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.