Tollywood: ‘ఆయన గోల్డ్ ఎహే’.. ఆ సింగర్‌కు టాలీవుడ్ అగ్ర హీరో నుంచి ఫోన్.. ఎవరైనా ఊహిస్తారా..?
తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై నందమూరి బాలకృష్ణతో గాయని లాలసకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఆయన ప్రవర్తన, సింప్లిసిటీ, మాట్లాడే విధానం ఆమెను ఆశ్చర్యపరిచాయి. బాలకృష్ణ స్వయంగా లాలసకు ఫోన్ చేసి, మాట్లాడడం, కోవిడ్ సమయంలో ఆమె పంపిన సందేశానికి సారీ చెబుతూ మళ్ళీ ఫోన్ చేయడం వంటి సంఘటనలను లాలస పంచుకున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై నందమూరి బాలకృష్ణను కలిసిన క్షణాలను గాయని లాలస ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ అనుభవాలు తన జీవితంలోనే ది బెస్ట్ అని ఆమె పేర్కొన్నారు. బాలకృష్ణతో తన మొదటి అనుభవాన్ని వివరిస్తూ, ఎపిసోడ్ షూటింగ్ రోజు కంటెస్టెంట్లు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్లేలోపే బాలకృష్ణ సెట్‌కు వచ్చి కూర్చున్నారని లాలస చెప్పారు. సాధారణంగా గెస్టులు కంటెస్టెంట్ల తర్వాత వస్తారని, అయితే బాలకృష్ణ ముందుగానే రావడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. ఆయన సెట్‌లో ఉండగా ఒకరకమైన నిశ్శబ్దం, భయం, గౌరవం ఉంటాయని ఆమె తెలిపారు. బాలకృష్ణ ఇంట్రడక్షన్ డాన్స్ షూటింగ్ సమయంలో.. కొరియోగ్రాఫర్ రెండు, మూడు సార్లు మాత్రమే చూపించగా, ఆయన చాలా నిశితంగా గమనించి, రెండు టేకుల్లోనే ఆ డాన్స్ మూవ్స్ పూర్తి చేశారని లాలస ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం, సీనియారిటీకి తాను సెల్యూట్ చేస్తానని అన్నారు.
ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ వెళ్లిపోయారని, అయితే ఒక వారం తర్వాత తన ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చిందని లాలస గుర్తుచేసుకున్నారు. అది నందమూరి బాలకృష్ణ నంబర్ అని గుర్తించకుండా, ఆమె తరగతిలో ఉన్నందున కాల్‌ను అటెంట్ చేయలేదు. క్లాస్ అయిపోయాక లాలస ట్రై చేస్తే బిజీ వచ్చింది. కాసేపటికి ఆమెకు మళ్లీ అదే నంబర్ నుంచి ఫోన్ రాగా, కాల్ లిఫ్ట్ చేయగా.. లాలస అని బాలకృష్ణ వాయిస్ వినిపించేసరికి తాను షాక్ అయ్యానని చెప్పారు. ఎపిసోడ్ రోజు కంగారులో ఎవరితోనూ మాట్లాడలేకపోయానని, అందువల్ల టాప్ సిక్స్‌లో ఉన్న కంటెస్టెంట్లందరికీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నానని బాలకృష్ణ చెప్పినట్లు లాలస వివరించారు. దాదాపు పది నిమిషాల పాటు తమ కుటుంబ సభ్యుల గురించి, ఆమె చదువు గురించి, సొంత ఊరి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారని ఆమె చెప్పారు. ఈ సంఘటన బాలకృష్ణపై తన గౌరవాన్ని మరింత పెంచిందని ఆమె అన్నారు.
Also Read: టెన్త్, ఇంటర్‌లో హైపర్ ఆది మార్క్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
ఆ తర్వాత బాలకృష్ణకు కోవిడ్ వచ్చినప్పుడు, లాలస టేక్ కేర్ సర్ అని ఒక సాధారణ మెసేజ్ పంపించారు. అయితే, దానికి బాలకృష్ణ అప్పుడు రిప్లై ఇవ్వలేకపోయినా, ఒక వారం తర్వాత మళ్లీ లాలసకు స్వయంగా ఫోన్ చేసి, మెసేజ్‌కు రిప్లై ఇవ్వలేకపోయినందుకు సారీ చెప్పారని లాలస తెలిపారు. ఐదు నిమిషాల పాటు కోవిడ్ లక్షణాల గురించి అడిగి తెలుసుకున్నారని ఆమె పేర్కొన్నారు. బాలకృష్ణ వంటి గొప్ప వ్యక్తి తనతో అంత ప్రేమగా మాట్లాడటం, ఆయన నంబర్ తన వద్ద ఉండటం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, అయినా కూడా తనలాంటి వారికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం ఆయన గొప్పతనమే అని లాలస ప్రశంసించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
