Kota Srinivasa Rao: భయపెట్టడమూ.. నవ్వించడం రెండు ఆయనకే సాధ్యం.. వెండితెరపై చెరగని ముద్ర..
విలన్గా ముచ్చెమటలు పట్టిస్తాడు.. తన మాటలతో అందరిని నవ్విస్తాడు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు. మధ్య తరగతి తండ్రిగా.. అల్లరి తాతయ్యగా,
విలన్గా ముచ్చెమటలు పట్టిస్తాడు.. తన మాటలతో అందరిని నవ్విస్తాడు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు. మధ్య తరగతి తండ్రిగా.. అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా.. హత్యలు చేసే గుండాగా.. కామెడీ విలన్గా.. ఇలా ఒక్కటేమిటి… ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. తెలుగు వారు అయిన.. వెండి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాస్ రావు భర్తీ చేశారనడంలో సందేహం లేదు. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాస్ రావుకు అభిమానులు కూడా ఎక్కువే.
వయసు మీద పడడంతో గత కొన్ని రోజులుగా సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు కోట శ్రీనివాస్ రావు. ఒకప్పుడు విలన్ పాత్రైన, తండ్రి, కామెడీ చేయాలన్న కోట శ్రీనివాస్ రావు ఉండాల్సిందే. 1978లో వచ్చిన “ప్రాణం ఖరీదు” చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు కోట. కానీ తనలోని కామెడీ రాజును వెలికితీసింది మాత్రం జంధ్యాల గారే. ఆయన చిత్రాలు కోట అభినయానికి పెద్ద పీట వేశాయి. హాస్యనటునిగా, గుణచిత్ర నటునిగా పలుమార్లు అవార్డులూ, రివార్డులూ సంపాదించారు కోట శ్రీనివాస్ రావు. అలాగే విలన్ పాత్రలకుగానూ.. నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాస్ రావు. విజయ శాంతి, చరణ్ రాజ్ ముఖ్యపాత్రలలో నటించిన “ప్రతిఘటన” సినిమాలో కోట శ్రీనివాస రావు నటన అద్భుతం అనే చెప్పాలి. “నమస్తే తమ్మీ” అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జంధ్యాల చిత్రం అహ నా పెళ్లంట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా కోట నటన వర్ణనాతీతం. అలాగే వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన గణేష్ సినిమాలో సాంబశివుడు అనే కామెడి విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
కోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే. వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడి హిట్టయింది. ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’లో ఈ జంట చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్లిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్. ఇలా ఎన్నో సినిమాల్లో కోట విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2015లో కోట శ్రీనివాస్ రావు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. జూలై 10న కోట శ్రీనివాస్ రావు పుట్టిన రోజు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట శ్రీనివాస్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది టీవీ9 తెలుగు..