Kaikala Satyanarayana: స్వర్గానికేగిన యమధర్మరాజు.. పూర్తయిన దిగ్గజ నటుడు కైకాల అంత్యక్రియలు
ఇండస్ట్రీలో అజాత శత్రువుగా తనకంటూ ప్రత్యేకంగా స్థానాన్ని సంపాదించుకున్నారు కైకాల సత్యనారాయణ. అనారోగ్య సమస్యతో డిసెంబర్ 23న కన్నుమూశారు.

టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలుగు సినీ చరిత్రలో కైకాల శకం ముగిసింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల మరణం సినీ లోకానికి తీరని విషాదం. తెలుగు కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా.. ఇండస్ట్రీలో అజాత శత్రువుగా తనకంటూ ప్రత్యేకంగా స్థానాన్ని సంపాదించుకున్నారు కైకాల సత్యనారాయణ. అనారోగ్య సమస్యతో డిసెంబర్ 23న కన్నుమూశారు. ఆయన మరణ వార్త విని సినీలోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. నేడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిపారు కుటుంబ సభ్యులు. దాదాపు 777 సినిమాల్లో నటించి అలరించారు కైకాల. కైకాల చేయని పాత్ర లేదు అనడంలో సందేహం లేదు.
దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్ధివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. తెలుగు నట శిఖరం కైకాల సత్యనారాయణ చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆయన భౌతికకాయానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్ నివాళి అర్పించారు. మహా నటుడి భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.
బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది.




