అప్పుడు ఎత్తుకొని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు.. చాలా అల్లరివాడు.. రోజా కామెంట్స్ వైరల్
సౌత్ ఇండస్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. 90వ దశకంలో దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ హీరోల సరసన నటించిన ఆమె..ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకున్నారు.

ఆర్కే రోజా.. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు రోజా. సినిమాలు, రాజకీయాలతోనే కాదు బుల్లితెరపై కూడా సందడి చేసి ప్రేక్షకులను అలరించారు రోజా. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు రోజా.. తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రోజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో రోజా తన సినీ జీవితంలోని అనేక మధుర జ్ఞాపకాలను, ప్రముఖ నటులతో తన అనుభవాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభం గురించి మాట్లాడుతూ.. భైరవ ద్వీపం సినిమాలో క్వీన్ గెటప్ కోసం తనకు స్క్రీన్ టెస్ట్ చేయకుండానే ఎంపిక చేశారని రోజా వెల్లడించారు. ఆ పాత్రలో తాను ఎంత బాగుంటావో అని దర్శకులు మెచ్చుకునేవారని తెలిపారు. అన్నమయ్య చిత్రంలో మోహన్ బాబు పక్కన క్వీన్ క్యారెక్టర్‌కు కూడా భైరవ ద్వీపం చూసి ఎంపిక చేశారని రోజా తెలిపారు.
టాప్ హీరోలతో తన అనుభవాలను వివరిస్తూ, వెంకటేష్ సెట్‌లో కొద్దిగా రిజర్వ్‌డ్‌గా ఉంటారని, అందరినీ పిలిచి మాట్లాడే స్వభావం ఆయనకు ఉండదని తెలిపారు. బాలకృష్ణ మాత్రం చాలా ఉల్లాసంగా ఉంటారని, అందరితో కూర్చొని కబుర్లు, పాటలు, పద్యాలు పాడుతూ సరదాగా గడుపుతారని అన్నారు రోజా.. నాగార్జున గురించి మాట్లాడుతూ, ఆయన అంటే అందరు హీరోయిన్లకు చాలా ఇష్టమని, ఆయన చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారని, ఎవరినీ బాధపెట్టరని పేర్కొన్నారు. నార్మల్‌గా కొందరు హీరోలు హీరోయిన్లు తమ పక్కనే కూర్చొని మాట్లాడాలని లేదా తక్కువ డైలాగులు ఉండాలని భావిస్తారని, కానీ నాగార్జున అలా కాదని రోజా వివరించారు.
చిరంజీవితో తన మొదటి సినిమా ముఠామేస్త్రిలో మొదటి షాట్ డ్యాన్స్‌తోనే ప్రారంభమైందని రోజా గుర్తుచేసుకున్నారు. ఆ పాట ఇది ఎంత ఘాటు ప్రేమయో పారిజాతం అని తెలిపారు. స్లో సాంగ్ అయినప్పటికీ, చిరంజీవి తనతో చాలా సహనంగా వ్యవహరించారని, నేర్చుకోవడానికి సమయం ఇచ్చారని ఆమె తెలిపారు. కృష్ణ గారి గురించి మాట్లాడుతూ, ఆయన డ్యాన్స్‌లో ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటారని, తమతో రిహార్సల్స్ చేయకుండానే, చూసి ఒకే టేక్‌లో చేసేవారని తెలిపారు రోజా. ప్రస్తుత జనరేషన్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి వారితో అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలు చేయాల్సి రావచ్చని సరదాగా అన్నారు. రాజకీయాల్లో చాలా మంది నటుల కంటే ఎక్కువ యాక్ట్ చేస్తారని ఆమె సరదాగా అన్నారు. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు తాము ఆయన్ను ఎత్తుకొని పెంచామని, ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడని, అప్పుడు చాలా అల్లరివాడని గుర్తుచేసుకున్నారు. ఊటీ స్కూల్‌లో చేరిన తర్వాత సైలెంట్ అయ్యాడని తెలిపారు. ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు గర్వంగా అనిపించిందని, మెగా అభిమానిగా, కుటుంబంలో ఒకరిగా ఆ సినిమాలోని మొదటి షాట్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. చిన్నప్పుడు చిరంజీవి డాన్స్ వేస్తుంటే, రామ్ చరణ్ కూడా అదే పాటలకు డాన్స్ చేసేవాడని, తన డాడీ డాన్స్ అతనిలో కనిపిస్తుందని తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి ఇంటికి తరచుగా వెళ్లేవారమని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
