Vyooham: ఆర్జీవీ వ్యూహం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.

కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ బాగా వినిపిస్తున్న పేరు వ్యూహం. ఈ సినిమాను విడుదల చేయించడానికి మూడు నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు వర్మ. చివరికి మార్చి 2న విడుదలైంది వ్యూహం. మరి వర్మ కోరుకున్న విజయం ఈ సినిమాతో దక్కుతుందా..? అసలు వ్యూహం ఎలా ఉంది..?

Vyooham: ఆర్జీవీ వ్యూహం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.
Vyooham Movie
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 02, 2024 | 7:26 PM

మూవీ రివ్యూ: వ్యూహం

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధా కృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం తదితరులు

సంగీతం: ఆనంద్

సినిమాటోగ్రాఫర్‌: సజీస్ రాజేంద్రన్

ఎడిటింగ్: మనీష్ ఠాకూర్

దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్

కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ బాగా వినిపిస్తున్న పేరు వ్యూహం. ఈ సినిమాను విడుదల చేయించడానికి మూడు నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు వర్మ. చివరికి మార్చి 2న విడుదలైంది వ్యూహం. మరి వర్మ కోరుకున్న విజయం ఈ సినిమాతో దక్కుతుందా..? అసలు వ్యూహం ఎలా ఉంది..?

కథ:

ముఖ్యమంత్రి విఎస్ వీరశేఖర రెడ్డి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో అసలు కథ మొదలవుతుంది. వీరశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కొడుకు మదన్ (అజ్మల్ అమీర్) సిఎం కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసి హై కమాండ్‌కు పంపిస్తారు. కానీ అక్కడున్న మేడమ్ దాన్ని విసిరి కొట్టడమే కాకుండా.. మదన్‌పై కేసులు పెట్టించి జైలుకు పంపిస్తారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మదన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజలకు మంచి చేసే క్రమంలో తన ప్రాణాలు కూడా లెక్క చేయడు. ఇంద్రబాబు నాయుడును అన్ని రకాలుగా రాజకీయంగా ఎదుర్కొని మదన్ ఎలా గెలిచాడు.. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.. మధ్యలో శ్రవణ్ కళ్యాణ్ (పవన్) పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ..

కథనం:

వ్యూహం అనే సినిమాను వర్మ ఎందుకు తీసాడనేది పూర్తి క్లారిటీ అందరికీ ఉంది. ఓ పార్టీ కోసమే ఆయన ఈ సినిమా తీసానని ముందుగానే చెప్పాడు. తన దృష్టిలో జగన్ హీరో.. చంద్రబాబు విలన్ అని ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు సినిమాలోనూ అదే చూపించాడు వర్మ. ముఖ్యంగా వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను, రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను, అలాగే జనంలో వైఎస్‌కు ఉన్న ఆదరణను చూపించాడు వర్మ. అక్కడ్నుంచి తండ్రి బాటలో కొడుకు ఎలా నడిచాడు.. అడ్డొచ్చిన పార్టీని సైతం ఎందుకు కాదనుకున్నాడు.. జగన్‌లోని మొండితనం ఇటువంటి వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు వర్మ. మధ్యలో ప్రతిపక్షాల కుట్రలు కూడా చూపించాడు. అయితే వైఎస్ చనిపోయినపుడు ఇంట్లో టీవీ చూస్తూ చంద్రబాబు కారెక్టర్ నవ్వింది అని చూపించడం మాత్రం వివాదంగా మారే ప్రమాదం లేకపోలేదు. అలాగే లోకేష్ కారెక్టర్‌ను కూడా పూర్తిగా పప్పు అనేలా చూపించాడు వర్మ. శ్రవణ్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్‌పై బాగానే సెటైర్లు వేసాడు. బర్రెలతో మాట్లాడించడం.. ఒంటరిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడించడం ఇలాంటివన్నీ కచ్చితంగా పవన్ ఫ్యాన్స్‌ను డీప్‌గానే హర్ట్ చేస్తాయి. దర్శకుడుగా ఆర్జీవీ తీసుకున్న వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం ఆకట్టుకోదు. మొన్నామధ్య యాత్ర 2లోనూ ఇదే కథ చెప్పాడు మహి వి రాఘవ్. కాకపోతే అందులో ఎవర్నీ పెద్దగా కించపరచకుండా జగన్ పాదయాత్రను మాత్రమే హైలైట్ చేసాడు మహి. కానీ ఇందులో అలా కాదు.. వర్మ స్ట్రెయిట్ పంచులు వేసాడు. తెలిసిన కథనే చెప్పాడు కాకపోతే అక్కడక్కడ మాత్రమే ఇది మెప్పిస్తుంది. మదన్ మోహన్ రెడ్డి, ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా న్యూస్ పేపర్లలోని వార్తల్నే సీన్స్‌గా రాసుకున్నారు. చాలా చోట్ల ఒరిజినల్ నేమ్స్ కనిపించాయి.

నటీనటులు:

మదన్ మోహన్ రెడ్డిగా అజ్మల్ అమీర్ చాలా బాగా నటించాడు. ఇదివరకు కూడా వర్మ సినిమాల్లో జగన్ పాత్రను ఆయనే చేసాడు. ఒరిజినల్ పాత్రకు అనుగుణంగా అజ్మల్ అమీర్ ఇచ్చిన హావభావాలు బాగున్నాయి. మాలతి పాత్రలో మానస రాధా కృష్ణన్ కూడా చాలా బాగా నటించింది. ఇంద్రబాబు పాత్రలో నటించిన నటుడు బాగున్నాడు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు ఆనంద్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కాకపోతే లొకేషన్స్ అన్ని చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అందులో డివోపి సజీస్ రాజేంద్రన్ సక్సెస్ అయ్యాడు. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ పర్వాలేదు. ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చెప్పాలనుకున్న కథలో నిజాయితీ కంటే సెటైర్లు ఎక్కువగా కనిపించాయి. జగన్‌ను హీరో చేసే క్రమంలో చంద్రబాబును విలన్‌గా.. పవన్, లోకేష్‌లను కమెడియన్లుగా చూపించాడు వర్మ. రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఇది వర్మ సెటైరికల్ వ్యూహం..