గట్టిగా నిలబడితేనే మీ మోకాళ్లు పనిచేయవు.. కనీసం కుక్కకు కూడా ఉపయోగం లేదు.. తమ్మారెడ్డిపై మళ్లీ విరుచుకుపడిన నాగబాబు
'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆస్కార్ నామినేషన్స్ లో నిలిపేందుకు కోటాను కోట్లు ఖర్చు చేశారంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ లో నిలిపేందుకు కోటాను కోట్లు ఖర్చు చేశారంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు, దర్శ కేంద్రుడు రాఘవేంద్రరావు తమ్మారెడ్డి వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగబాబు ఘాటైన పదజాలంతో తమ్మారెడ్డికి చురకలంటించాడు. ఇప్పటికే ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి తమ్మారెడ్డిని విమర్శించిన మెగా బ్రదర్ తాజాగా మరొక వీడియోను షేర్ చేశారు. ఈసారి మరింత ఘాటుగా తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు నాగబాబు.. ‘నమస్కారం. మన తెలుగువాడైన రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, కొరియోగ్రాఫర్ తోపాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ని మనందరం మెచ్చుకోవాలి. ఈ సందర్భంగా ఇదిరా మన తెలుగోడి సత్తా అని గర్వంగా జబ్బలు చరుచుకుని నిలబడాలి కానీ.. కుళ్లుకుని చచ్చిపోవడమేంటి? మెచ్చుకోవడం అనే సంస్కారం మీకు లేకపోవచ్చు.. కానీ కుళ్లుకుని చచ్చే దుస్ధితి ఏమిటి? మనం సినిమాలు మానేశాం. ప్రొడక్షన్ మానేశాం. మనం రిటైరైపోయాం. కుక్కకి కూడా పనికిరాం. వీడియోలు పెట్టుకుని కథలు చెప్పాలి తప్ప. కెమెరా ముందు పెద్ద అనలిస్టులాగా, మేధావుల్లాగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జనాలు మెచ్చుకోరు. గతంలో మీరు తీసిన సినిమాల్లో నటించిన వారికి సరిగ్గా రెమ్యునరేషన్లు ఇచ్చారా? ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఇంతకు ముందు మీరు రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఊరుకున్నాం. పనికి మాలిన విమర్శలు చేశారు. కానీ ఈసారి మాత్రం అస్సలు ఊరుకోను.’
ఎన్టీఆర్, రామ్ చరణ్ ల లెగ్ వర్క్ చూశారా?
‘అరే.. ఇది మన తెలుగోడు తీసిన సినిమా. ఆస్కార్ బరిలో నిలిచినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు మెచ్చుకోకపోతే గమ్ముగా ఉండాలి. మీ కుళ్లును బయట కక్కడమేంటి? మీరు చేసిన పనికిమాలిన విమర్శలకు రాజమౌళి, కీరవాణి సైలెంట్‌గా ఉండవచ్చు. ఇప్పటివరకు చిరంజీవి కానీ, పవన్ కల్యాణ్ కానీ మా పిల్లలు కానీ మీ మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. అలాగనీ శ్రుతిమించిపోతారా? ఫస్ట్..మీరు ఎలా బతకాలో ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడాలో ఆలోచించండి. ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలో నిర్ణయం తీసుకోండి. నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇది మీకే చెబుతున్నాను. ఇంకెప్పుడూ అర్థం లేకుండా మాట్లాడండి. మేమంతా సంయమనం పాటిస్తూ వచ్చాం. కానీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై మీ విమర్శలను మాత్రం తట్టుకోలేకపోతున్నాం. పాటలో ఎన్టీఆర్, చరణ్‌ల డ్యాన్స్ చూశారా? వారి లెగ్ వర్క్ గమనించారా? మీరు ఒక్కసారి గట్టిగా నిలబడితేనే మోకాళ్లు పనిచేయవు. ప్రపంచమంతా వారి డ్యాన్స్‌ను గర్విస్తుంటే మీరు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడతారా? తప్పండి.. చాలా తప్పు. మీరు నా కన్నా వయసులో పెద్దవారు.. గౌరవంగా చెబుతున్నా తమ్మారెడ్డి.. కంట్రోల్ యువర్ టంగ్. యంగ్‌స్టర్స్‌ను సపోర్ట్ చేయండి. వారేదైనా తప్పు చేస్తే మన్నించండి. విజయం సాధిస్తే వెన్నుతట్టండి. అంతేకానీ అందరూ దీన్ని మెచ్చుకుంటున్నారు కాబట్టి. నేను దీన్ని విమర్శించాలి అనుకుంటూ పనికిమాలిన పబ్లిసిటీ స్టంట్లు ఎందుకండి? ఇప్పటికైనా మీరు కళ్లు తెరచి.. బుద్ధి తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మాపై మీరు రియాక్ట్ అవ్వొచ్చు. కానీ మేం లక్ష రెట్లు ఎక్కువగా రియాక్టవుతాం’ అని తనదైన శైలిలో తమ్మారెడ్డికి చురకలంటించారు నాగబాబు. ఇలా సుమారు 10 నిమిషాల పాటు తమ్మారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మెగాబ్రదర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..