Kuberaa Movie Review: ఇరగదీసిన ధనుష్, నాగార్జున.. కుబేర సినిమా ఎలా ఉందంటే..
తమిళ్ స్టార్ హీరో ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేరా. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలైంది కుబేరా. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: కుబేరా
నటీనటులు: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సార్బ్, దిలీప్ తాహిల్, సునయన, సౌరవ్ ఖురానా తదితరులు
సినిమాటోగ్రఫర్: నికేత్ బొమ్మిరెడ్డి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు
కథ:
నీరజ్ (జిమ్ సార్బ్) దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మెన్‌లో ఒకరు. ఆయనకు బంగాళాఖాతంలో 15 ఏళ్ళకు దేశం మొత్తం సరిపోయే ఆయిల్ గనులు దొరుకుతాయి. దాన్ని దక్కించుకోడానికి ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు. దానికోసం వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేయించాల్సి వస్తుంది. అలా ఎవరు చేస్తారు అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ల దృష్టిలోకి వస్తాడు దీపక్ తేజ్ (నాగార్జున). కానీ ఆయన జైల్లో ఉంటాడు. అసలు దీపక్ జైల్లో ఎందుకున్నాడు..? వీళ్ళందరి జీవితంలోకి బిచ్చమెత్తుకుని బతికే దేవా (ధనుష్) ఎలా వచ్చాడు..? దేవా లైఫ్‌లోకి (రష్మిక మందన్న) ఎలా వచ్చింది..? అసలు వాళ్లందరి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది కథ..
కథనం:
బెస్ట్ రైటింగ్.. కుబేర సినిమా చూసిన తర్వాత అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఇదే. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే.. ఒక తెలుగు దర్శకుడు నుంచి ఇలాంటి రైటింగ్ చూసి చాలా సంవత్సరాలయిపోయింది.. హానెస్ట్ అటెంప్ట్.. అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. టైటిల్ కార్డ్ నుంచి.. శుభం కార్డ్ పడే వరకు శేఖర్ మార్క్ కనిపించింది. అక్కడక్కడ కాస్త లెంగ్త్ ఎక్కువైంది.. దాంతో పాటు స్క్రీన్ ప్లే తడబాటు కూడా ఉంది. కానీ సినిమాలో ఉన్న హై ఎమోషన్స్ ముందు అవి పెద్దగా కనిపించవు. ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది.. సెకండ్ హాఫ్ కూడా చాలావరకు బాగా లాక్కొచ్చాడు. ముఖ్యంగా బెగ్గర్స్‌ను తీసుకుని వెళ్తున్న సమయంలో వాళ్ల ఫ్లాష్ బ్యాక్ చూపించడం శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది. అంతేకాదు.. ఇక్కడ విలన్ ఆ వెంకన్నకు గోపురం చేయిస్తానని మొక్కుకున్నపుడు.. వెంటనే తిరుమల వెంకన్న షాట్ పడటం దగ్గర్నుంచి మొదలుపెడితే.. చివర్లో ఓ సన్నివేశంలో వచ్చే శివుడి స్తోత్రం వరకు చాలా వరకు తన మార్క్ చూపించాడు శేఖర్ కమ్ముల. చివరి 20 నిమిషాలు మాత్రం ఎందుకో వదిలేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే కుబేర రేంజ్ ఇంకా పెరిగేది. డెఫినెట్‌గా శేఖర్ కమ్ముల సినిమాలలో లీడర్ తర్వాత ది బెస్ట్ రైటింగ్ ఇదే. డబ్బు చుట్టూ ప్రపంచం ఎలా తిరుగుతుంది.. ప్రపంచాన్ని డబ్బు ఎలా ఆడుకుంటుంది అనేది ఇందులో చాలా బాగా చూపించాడు.. ధనుష్ కంటే నాగార్జున క్యారెక్టర్రైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటాయి.. అక్కడే శేఖర్ కమ్ముల మార్క్ మనకు కనిపిస్తుంది. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా.. కమర్షియల్ కోణంలో కథను నడిపించాడు శేఖర్ కమ్ముల. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బలంగా రాసుకున్నాడు శేఖర్. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పోయిరా మామ పాట కూడా హైలీ ఎమోషనల్‌గా ఉంటుంది.
నటీనటులు:
ధనుష్ అద్భుతంగా నటించాడు అనేకంటే ప్రాణం పెట్టాడు అనాలి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది తనకు ఉందని మరోసారి చేసి చూపించాడు ధనుష్. నాగార్జున ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్.. ఆయన క్యారెక్టర్ అదిరిపోయింది. మంచికి, చెడుకు మధ్య నలిగిపోయే పాత్ర ఇది. ఇంత సీరియస్ కథలో రష్మిక మందన్నతో కామెడీ చేయించాడు దర్శకుడు శేఖర్. ఆమె పాత్రను డిఫెరెంట్‌గా రాసుకున్నాడు. బాలీవుడ్ నటుడు జిమ్ సార్బ్ బాగా చేశాడు. నాగార్జున భార్యగా చిన్న పాత్రలో సునయన బాగా నటించింది. మిగిలిన నటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
కుబేరకు మెయిన్ హీరో దేవి శ్రీ ప్రసాద్. ఆయన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేశాయి. ముఖ్యంగా నా కొడకా సాంగ్‌తో పాటు పోయిరా పాట నెక్ట్స్ లెవల్. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ కాస్త లెంత్ అనిపించింది కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఆయన్ని తప్పు బట్టలేము. శేఖర్ కమ్ముల దర్శకుడిగా కంటే రైటర్‌గా అదరగొట్టాడు. కొన్ని సీన్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయి. నిర్మాతలు కథకు తగ్గట్లు ఖర్చు పెట్టారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా కుబేర.. ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ మనీ గేమ్..







