నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన నటులలో గుండు హనుమంతరావు ఒకరు. ఎన్నో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన.. ముఖ్యంగా అమృతం సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే తెరపై నవ్వులు పంచిన ఆయన జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు.. కన్నీళ్లు నిండి ఉన్నాయి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హాస్యనటుడు. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఒక నవ్వు వికసిస్తుంది. తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే హాస్య నటులలో ఆయన ఒకరు. ఆ నటుడు మరెవరో కాదు.. గుండు హనుమంతరావు. ఈ పేరు కంటే ఎక్కువగా అమృతం సీరియల్ నటుడు అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. అనేక చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి ఆయన పండించిన కామెడీ టైమింగ్, ముఖ్యంగా ‘అహనా పెళ్ళంట!’ చిత్రంలో చెవిటి వ్యక్తిగా ఆయన చేసిన నటన తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుంది. కానీ, వందలాది చిత్రాల్లో కోట్లాది మందిని నవ్వించిన హాస్యనటుడు గుండు హనుమంతరావు వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో విషాదభరితం. ఆయన వ్యక్తిగత జీవితం గురించి దర్శకుడు నందమ్ హరిశ్చంద్రరావు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
గుండు హనుమంతరావు 1956లో విజయవాడలో కాంతారావు, సరోజనమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఇష్టం. ఆయన వేసిన మొదటి నాటకంలో ఆయన పర్సనాలిటీకి ఏమాత్రం సంబంధం లేని ‘రావణ బ్రహ్మ’ వేషం వేయడం విశేషం. చదువు పూర్తయిన తర్వాత విజయవాడలో ‘కన్ఫెక్షనరీ’ (చాక్లెట్లు, స్వీట్ల హోల్‌సేల్ వ్యాపారం) నిర్వహించేవారు. ఒకసారి మద్రాస్‌లో ఆయన వేసిన ‘ఇదేమిటి’ అనే నాటకాన్ని ప్రముఖ దర్శకుడు జంధ్యాల, సాక్షి రంగారావు చూశారు. హనుమంతరావు టాలెంట్ నచ్చి జంధ్యాల గారు సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన అన్నట్టుగానే ‘సత్యాగ్రహం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘అహనా పెళ్ళంట!’ చిత్రంలో ఇచ్చిన ఐదు నిమిషాల చెవిటి క్యారెక్టర్ ఆయన సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
‘అహనా పెళ్ళంట!’ విజయం తర్వాత గుండు హనుమంతరావుకి తిరుగులేకుండా పోయింది. రాజేంద్ర ప్రసాద్ పక్కన అసిస్టెంట్‌గా లేదా స్నేహితుడిగా ఆయన చేసిన ‘మాయలోడు’, ‘రాజేంద్ర గజేంద్ర’, ‘పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలికి శుభలేఖ’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దాదాపు అన్ని సినిమాల్లో ఆయన ఒక ముఖ్య కమెడియన్‌గా ఉండేవారు.’నువ్వు లేక నేను లేను’ వంటి చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి పంతులు వేషాలు వేసి, ఆయన గుట్టు రట్టు చేసే అసిస్టెంట్‌గా ఎంతో నవ్వించారు. దాదాపు 600 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన భార్య పేరు జాన్సీరాణి. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తెరపై అంతగా నవ్వించిన హనుమంతరావు జీవితంలో 2008 నుండి వరుస కష్టాలు మొదలయ్యాయి. 2008లో ఆయన కూతురు మెదడువాపు వ్యాధితో చిన్న వయసులోనే మరణించింది. ఆ బాధ నుండి ఆయన కోలుకోకముందే 2010లో భార్య జాన్సీరాణి కూడా కన్నుమూశారు. దీంతో ఆయన జీవితంలో ఒంటరివాడయ్యారు. కొడుకు భవిష్యత్తు పాడవకూడదని కష్టపడి అమెరికాకు ఎం.ఎస్ చదవడానికి పంపించారు.
చివరి దశలో హనుమంతరావుకి గుండె జబ్బు, రెండు కిడ్నీలు పాడైపోయాయి. డయాలిసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని కఠిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాల్సిన ఆయన కుమారుడు, తండ్రి పరిస్థితి చూసి ఉద్యోగాన్ని, అమెరికా లైఫ్‌ను వదిలి ఇండియాకు వచ్చేసాడు. తల్లి, చెల్లెలు లేని ఆ ఇంట్లో తండ్రికి ఒక భార్యలా, తల్లిలా అన్ని సేవలు కొడుకే దగ్గరుండి చూసుకున్నాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి మెగాస్టార్ చిరంజీవి బెడ్ మీద ఉన్న హనుమంతరావు గారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. కానీ బైపాస్ సర్జరీ, కిడ్నీల సమస్యతో శరీరం పూర్తిగా సహకరించకపోవడంతో 2014లో (సుమారు 58 సంవత్సరాల వయసులో) ఆయన కన్నుమూశారు. గుండు హనుమంతరావు మరణం తర్వాత ఆ కుటుంబంలో కొడుకు ఒక్కడే మిగిలాడు. హనుమంతరావు పార్థివ దేహం వద్దే ఆయన ప్రాణస్నేహితుడు, ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఎంతో భావోద్వేగానికి లోనై.. “నేను ఈ అబ్బాయిని దత్తత తీసుకుంటున్నాను.. వీడికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటాను” అని అందరి ముందు అనౌన్స్ చేశారు. తోటి నటుడి కుటుంబానికి బ్రహ్మానందం నిలబడిన తీరు ఇండస్ట్రీలో ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న బ్రహ్మానందం..

Brahmanadam
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
