AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!

అవినీతి నిరోధక శాఖ జరిపిన భారీ సోదాల్లో ఒక మాజీ ప్రభుత్వ అధికారి అక్రమాస్తుల గుట్టు రట్టయింది. ఈ దాడిలో ఏకంగా రూ.1.62 కోట్ల నగదు, 13 కేజీల బంగారం, 9 కేజీల వెండితో పాటు దేశంలోని ఖరీదైన నగరాల్లో రూ.13 కోట్ల విలువైన స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారి ఇంట్లో ఆదాయానికి మించి సంపాదించిన మొత్తం అక్రమాస్తుల విలువ సుమారు రూ.35 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. విజయవంతంగా దాడులు నిర్వహించిన విజిలెన్స్ బృందానికి రూ.1 లక్ష బహుమతిని కూడా ప్రకటించారు. అధికారుల సమాచారం మేరకు..

రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి.. అధికారులే కంగుతినేలా అక్రమాస్తులు.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్!
Retired Arto
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2026 | 9:56 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా విజిలెన్స్ శాఖ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఒక మాజీ రవాణా శాఖ అధికారి (ARTO) ఇల్లే కేంద్రంగా సాగిన ఈ సోదాల్లో కళ్లు బైర్లు గమ్మే రేంజ్‌లో అక్రమాస్తులు బయటపడ్డాయి. లక్నోలోని ఆయన నివాసంలో జరిపిన తనిఖీల్లో నగదు, బంగారం, వెండి, ల్యాండ్ డాక్యుమెంట్ల రూపంలో సుమారు రూ.35 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపార సామ్రాజ్యాన్ని తలపించేలా అక్రమాస్తులు:

గతంలో ఆగ్రాలో అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ARTO)గా పనిచేసిన లలిత్ కుమార్ అనే అధికారిపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన లక్నో విజిలెన్స్ ప్రత్యేక బృందం.. అలీగంజ్ ప్రాంతంలోని చంద్రలోక్ కాలనీలో ఉన్న లలిత్ కుమార్ నివాసంలో మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

ఇల్లంతా కరెన్సీ కట్టలు – 13 కేజీల బంగారం:

రైడ్ సమయంలో అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. లలిత్ కుమార్ ఇంట్లోని వివిధ గదులు, రహస్య ప్రదేశాల్లో ప్యాకెట్ల రూపంలో దాచి ఉంచిన రూ.1.62 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. దీనితో పాటు ఏకంగా 13 కేజీల బంగారం బార్లు, ఇటుకలు, ఆభరణాల రూపంలో, 9 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాల్యూయర్ ద్వారా వీటిని లెక్కించగా, కేవలం బంగారం, వెండి విలువే సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తేలింది.

స్థిరాస్తులు, పెట్టుబడులు:

బంగారం, నగదు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పత్రాలను కూడా విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. లక్నో, బారాబంకి, రాయ్‌బరేలి జిల్లాల్లో అనేక నివాస గృహాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు దొరికాయి. అలాగే లక్నో, నోయిడాలలో ఖరీదైన ఫ్లాట్ల బుకింగ్స్ పేపర్లు లభించాయి. ఈ స్థిరాస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవి కాకుండా బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మరో రూ. కోటికి పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఆయన ఇంట్లో ఒక రివాల్వర్, ఇన్నోవా, 20 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

టీమ్‌కు రూ.1 లక్ష రివార్డ్:

ఈ భారీ సోదాల్లో దొరికిన ఆస్తులన్నింటినీ ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ఈ లంచగొండి అధికారిపై అవినీతి నిరోధక చట్టం కింద తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఇంతటి భారీ స్కామ్‌ను విజయవంతంగా ఛేదించిన లక్నో సెక్టార్ విజిలెన్స్ బృందానికి ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ డైరెక్టర్ రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us