ఎల్‌నినో పని ఐపోయినట్టేనా..? లోటు వర్షపాతానికి చెక్ పడ్డట్టేనా..? మేఘమా ఏమిటి సందేశం..
ఎల్‌నినో ప్రభావంతో దేశంలో కరువు వస్తుందనే హెచ్చరికలు ఒకవైపు వినిపిస్తుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఎల్‌నినో ప్రభావం తగ్గిందా? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణమేంటి? రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది..? వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకోండి..

ఢిల్లీలో మోదీ క్యాబినెట్ మీటింగ్ నుంచీ, మన గల్లీ చివర్లో చాయ్ కొట్టు దాకా మాయదారి ఎల్‌నినో గురించే చర్చ.. ఎందుకంటే, 60 శాతం వానలు తగ్గి, దేశంలో 12 రాష్ట్రాలు ఎల్‌నినో దెబ్బకు తల్లడిల్లుతాయని, కేంద్ర వాతావరణ విభాగమే లెక్కతేల్చింది. పొదుపు చేసుకోకపోతే పరిస్థితి అదుపుతప్పి, కరువు ముంచుకొస్తుందని సాక్షాత్తూ ప్రధాని మోదీయే సెలవిచ్చారు. ఇటు, ఎల్‌నినోను ముందస్తుగానే వెనకనుంచి సొమ్ము చేసుకుంటున్నారు బ్లాక్‌మార్కెటీర్లు. రెండునెలల్లోనే క్వింటాలు బియ్యం ధరను వెయ్యిరూపాయల దాకా పెంచేశారు. పప్పూ ఉప్పూ కూడా పెరుగుతాయి.. రాబోయే రెండేళ్లూ కరవుకాటకాలే అని ఊరుఊరంతా మారుమోగిపోతోంది మౌత్‌టాక్. కాసేపు అలా బైటికి తొంగిచూస్తే మాత్రం ఏదో తేడా కొడుతోంది. ఎప్పుడూ ముసురుపట్టి, ప్రతీ పూటా వానలు కురిసి, రోడ్డెమ్మటి మోకాళ్ల లోతులో నీళ్లు నిలబడి, ఇల్లుదాటి రావాలంటేనే జడుసుకుంటున్నారు జనం. మరో మూడురోజులు తప్పదు కుండపోత.. జరభద్రం అని భయపెడుతోంది వెదర్ రిపోర్టు. మరి.. ఎల్‌నినో ముచ్చట ఏమైనట్టు? సూపర్ ఎల్‌నినో అన్నారు.. అదంతా డూపేనా? అని ఇన్నోసెంట్ ఫేస్‌తో జనం ప్రశ్నలు. జవాబులెక్కడ? నెలన్నర లేటైనా లేటెస్టుగా దంచికొడ్తున్న వానలు ఈ వర్షం సాక్షిగా.. గేమ్ ఆఫ్ ఎల్‌నినో ఏమైనట్టు? కొద్దికొద్దిగా మాయమౌతోందా? లేక ఇప్పటికీ పసిఫిక్ సైడ్ నుంచి నక్కిచూస్తోందా? వేసవి ముగింపుకొచ్చి, జల్లుల కాలం మొదలైనా నిన్నటిదాకా మండేఎండలతో తల్లడిల్లింది తెలుగునేల. జూలై మూడోవారంలో కూడా ఒక్కోచోట 45 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. అదే సమయంలో 20 సెంటీమీటర్ల...
