AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: రామయ్య మాటల్లో ఒకవైపు ఆవేదన.. మరోవైపు ఆత్మవిశ్వాసం..

జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఎప్పుడు? ఏపీలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ ఇదే టాక్‌ సీరియస్‌గా నడుస్తుంది. అటు కొందరు పొలిటికల్‌ లీడర్స్‌ కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ కేంద్రంగా టాపిక్స్‌ తీసుకొస్తూనే ఉంటారు. ఇక ఆయన సినిమా ఫంక్షన్‌ వచ్చిందంటే చాలు.. సీఎం సీఎం అంటూ నినాదాలు రీసౌండ్‌ ఇస్తూనే ఉంటాయి. కాని ఆయన మాత్రం ఏనాడూ నోరు మెదపలేదు. కాని వార్‌ 2 సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్‌.. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. పాలిటిక్స్‌కు దగ్గరగా.. సాగినట్లే కనిపించింది. తాత ఆశిస్సులు ఉన్నంతకాలం నన్నెవరూ ఏం చేయలేరన్న ధీమా.. ఎన్టీఆర్‌లో కనిపించిందంటే.. ఆ తాత వేసిన బాటలో నడవడానికి రెడీ అయ్యారా? జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త వార్‌ను షురూ చేశారా?

Jr NTR: రామయ్య మాటల్లో ఒకవైపు ఆవేదన.. మరోవైపు ఆత్మవిశ్వాసం..
Jr Ntr
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2025 | 8:29 PM

Share

తారక్‌.. మైక్‌ పట్టుకున్నాడంటే చాలు… అది సినిమా ఫంక్షన్‌ ఐనా మరోటైనా… ఏం మాట్లాడుతాడు.. ఆ మాటల వెనుక అర్థాలేంటని చెవులు రిక్కించుకుని వింటారు. ఇప్పుడూ అంతే!. తాజాగా వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్‌లో తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులున్నంత వరకూ … నన్నెవరూ ఆపలేరు అంటూ క్లిష్టల్ క్లియర్‌గా.. ఆత్మవిశ్వాసంతో చెప్పారు తారక్. ఇంతకీ ఈ మెసేజ్‌ ఎవరికి! ఎవరిని ఉద్ధేశించి తారక రామారావు ఈ మాటలంటున్నారు! ఇంతకీ ఆయన ప్రయాణం ఎక్కడికి! ఆ ప్రయాణంలో ఆయనను ఆపేది ఎవరు! అన్న చర్చ మొదలైంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో.

అసలు ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వేదిక మీదకు వచ్చిన దగ్గర నుంచి జూనియర్‌ హావభావాలే వేరుగా వున్నాయి. ప్రతి పదం, ప్రతి మాటా భావోద్వేగాలతో నిండిపోయాయ్‌. తాను ఒంటరినయ్యాననే భావన రేకెత్తిస్తూనే.. అభిమానుల అండతో తన లక్ష్యం దిశగా వెళ్లటాన్ని ఎవరూ ఆపలేరనే ఓ ధైర్యాన్ని కూడా ప్రకటించారు ఎన్టీఆర్‌. ప్రసంగంలో.. సినిమా ప్రమోషన్‌తో పాటు.. మరో ఎమోషన్‌ కూడా బయటకు వచ్చింది. కాస్త నాటకీయత.. మరికాస్త రాజకీయత కనిపించింది. అలా అని పూర్తి పొలిటికల్‌ స్పీచ్‌ కూడా కాదు. ఆయన ఏం చెప్పదల్చుకున్నారనేదే ఇక్కడ ఇంపార్టెంట్‌. తాను… తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక్కడిగానే ప్రయాణాన్ని మొదలుపెట్టానన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌.

తాత పంచిన రక్తం అంటూ… తొలి సినిమాతోనే తాతకు తగిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ‘నేను ఒక్కడినే’ అనే సందేశాన్ని ఇవ్వడం వెనుక కారణమేంటి? అన్నది చర్చనీయాంశం. ఈ ఒక్క మాట చాలు ఆయన అభిమానులకు ఏం చెప్పదల్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. తన తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరని డైరెక్ట్‌గానే అనేశారు. మరి ఈ మెసేజ్‌ తాను ఎవరికి చెప్పాలనుకున్నారో… వాళ్లకు రీచ్‌ అయినట్టే అన్నది తారక్ అభిమానుల వెర్షన్. అంతేనా… జీవితమంతా మిమ్మల్ని ఆనందంగా వుంచటానికే తన అడుగులు అని భరోసా కూడా ఇచ్చారు. అటు అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేస్తుండగానే ఈ డైలాగ్‌ అనేశారు. ఈ ప్రయాణం తన ఒక్కడిది మాత్రమే కాదనీ… అందరినీ కలుపుకుని తీసుకుని వెళతానన్నారు.

ఈ నర్బగర్భ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి చెప్మా…! అంటూ ఇప్పుడు ఎవరికి తోచిన రీతిలో వాళ్లు భాష్యాలు చెప్పుకుంటున్నారు. ఇదే మాటని ఆ మధ్య జరిగిన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ మాట్లాడారు ఎన్టీఆర్‌. అభిమానులను కలుస్తానని.. నీట్‌గా ప్లాన్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌ 2009 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎప్పుడూ పొలిటికల్‌ స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వలేదు. కాని ఫస్ట్‌ టైమ్‌ ఆయన మైక్‌ ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. నర్మగర్భంగానే చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎవరిని టచ్‌ చేయడానికి? ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ప్రైమ్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారంటే.. భవిష్యత్‌కు ఇప్పుడే పునాదులు వేస్తున్నారా? తనతో పాటు.. తన అభిమానులు సైతం కాలర్‌ ఎగురేసుకునేలా చేయడం.. వెనుక పొలిటికల్‌ యాంబిషన్స్‌ కూడా ఉన్నాయా? ఈ స్పీచ్‌లో ఎక్కువగా తాను ఒంటరిని అనడమే కాదు.. తాత, తండ్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం.. కేవలం తన అన్నల ప్రస్తావన తప్ప మరొకరి పేరు కూడా తీసుకోకపోడం వెనుక ఏం ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికైతే సస్పెన్స్‌.