AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు’.. రజనీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఒకప్పుడు ‘సూపర్‌స్టార్‌’ బిరుదు ఇస్తుంటే నేను నిరాకరించాను. వెంటనే అందరూ నేను వెనకడుగు వేశానన్నారు. శివాజి గణేశన్‌, కమల్‌హాసన్‌లాంటి ప్రముఖ నటులు నటిస్తుండగా సూపర్‌స్టార్‌ పట్టం నాకు ఇవ్వడంపై పెద్ద వివాదమే జరిగింది. నాకెందుకు ఆ ‘సూపర్‌స్టార్‌’ అనుకున్నా.. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే వస్తోంది. నిజానికి సూపర్‌స్టార్‌ కిరీటం నాకు ఎప్పుడూ తలనొప్పిగానే ఉంది. కానీ నేను వాటి గురించి పట్టించుకోను. మొరగని కుక్క లేదు. విమర్శించని నోరూ లేదు.. ఇవి రెండూ లేని ఊరూ లేదు. ఎవరేం చెప్పినా మన పని మనం చేసుకుంటూ..

'మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు'.. రజనీ వివాదాస్పద వ్యాఖ్యలు
Superstar Rajinikanth
Srilakshmi C
|

Updated on: Aug 10, 2023 | 9:09 AM

Share

సూసర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోతాయ్‌. బాక్సాఫీస్‌ బద్దలైపోతుంది. రజనీకాంత్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ రేంజ్‌ అదీ..! అందుకే ఆయన సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తుంటారు. తాజాగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన కొత్త మువీ ‘జైలర్‌’. నేడు (ఆగస్టు 10) ప్రపంచవ్యాప్తంగా జైలర్‌ మువీ విడుదలైంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు సందడి మొదలైంది. కాగా ఇటీవల ఈ మువీ ఆడియో రిలీజ్‌ ఫంజక్షన్‌ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై రజనీ ఇచ్చిన స్పీచ్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆయన మాటలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. అంతగా ఏం మాట్లాడారా అనుకుంటున్నారా.. ఆయన మాటల్లోనే..

‘ఒకప్పుడు ‘సూపర్‌స్టార్‌’ బిరుదు ఇస్తుంటే నేను నిరాకరించాను. వెంటనే అందరూ నేను వెనకడుగు వేశానన్నారు. శివాజి గణేశన్‌, కమల్‌హాసన్‌లాంటి ప్రముఖ నటులు నటిస్తుండగా సూపర్‌స్టార్‌ పట్టం నాకు ఇవ్వడంపై పెద్ద వివాదమే జరిగింది. ఆ ‘సూపర్‌స్టార్‌’ బిరుదు నాకెందుకు అనుకున్నా.. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే వస్తోంది. నిజానికి సూపర్‌స్టార్‌ కిరీటం నాకు ఎప్పుడూ తలనొప్పిగానే ఉంది. కానీ నేను వాటి గురించి పట్టించుకోను. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరూ లేదు.. ఇవి రెండూ లేని ఊరూ లేదు. ఎవరేం అనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోతుండాలి. అర్థమైందా రాజా..’ అంటూ తనదైన శైలిలో రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఐతే రజనీకాంత్‌ తాజా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే అంశం కూడా చర్చణీయాంశంగా మారింది. రజనీ స్పీచ్‌ చివర్లో ఆర్ధమైందా రాజా.. అని చెప్పడం ద్వారా ఆ మధ్య రజనీకాంత్‌ను ఏపీ మంత్రులు విమర్శించినందుకు కౌంటర్‌ ఇచ్చారా..? వారికి సమాధానం చెబుతున్న తీరులోనే రజనీ ప్రసంగించారా..? అనే సందేహం కూడా కలుగుతోంది. లేదు.. లేదు.. తమిళనాట హీరో విజయ్‌ను ఉద్దేశించి అన్నారని మరొక వర్గం భావిస్తోంది. అసలు రజనీ ఎవరిని టార్గెట్‌ చేసి వ్యాఖ్యానించారనే అంశం మాత్రం మాత్రం తేలకపోవడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్‌ హోదా నుంచి రజనీ తప్పుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడారనే ప్రచారం కూడా జరుగుతోంది.

కాగా నేడు విడుదలైన ‘జైలర్‌’ చిత్రం థియేటర్ల వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మువీలో మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, సునీల్‌, యోగిబాబు.. తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. తమన్నా ‘కావాలయ్యా..’ అనే స్పెషల్‌ సాంగ్‌ ఆడిపాడి అలరించింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.