Jardasth Rajamouli: కరోనాతో చావు అంచుల్లోకి.. ఆ నటుడు అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయలు కట్టాడు
జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. తన దైన కామెడీ, పేరడీ పాటలతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ప్రస్తుతం ఈ నటుడు జబర్తస్త్ షో కు దూరంగా ఉంటున్నాడు. బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించడం లేదు.

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి ఒకరు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలు అలాగే పేరడీ పాటలతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు రాజమౌళి. రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్ టీమ్స్ లో ఆయన స్కిట్స్ బాగా హైలెట్ అయ్యాయి. యూట్యూబ్ లోనూ మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ తో పాటు మరే టీవీ షోలోనూ రాజమౌళి కనిపించడం లేదు. దీనికి కారణం ఆయన ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోయాడు. ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారుడిగా పని చేస్తున్నారాయన. సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన సదస్సులను ఆట, పాట రూపంలో జనాలకు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజమౌళి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కరోనా టైమ్ లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. ‘కరోనా టైమ్ లో నా పరిస్థితి చాలా దారుణం. కరోనా బారిన పడడంతో కూకట్ పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరాను. ఆ సమయంలో నా దగ్గర పైసలు కూడా లేవు. నాతో పాటు నా తల్లి, భార్య, పిల్లలు, అన్న కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సోకింది. ఆ సమయంలో కుటుంబం ఏమైపోతుందోనని చాలా భయపడ్డాను. ఇక కోవిడ్ సమయంలో నాకు షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోయాయి. దాదాపు 577 కు పైగా షుగల్ లెవెల్స్ పెరిగిపోయాయి’
‘కరోనా కారణంగా సరైన ఆహారం తీసుకునే పరిస్థితి లేకపోయింది. పైగా కరోనా కారణంగా అంతా లాక్ డౌన్ నడుస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే అర్ధరాత్రి మా ఆస్పత్రికి వచ్చారు భోలే అన్నా ( బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, సింగర్) భోలే షావలి). ఆస్పత్రి అడ్మిషన్ ఫీజు రూ. లక్ష కట్టారు. అంతేకాదు నా ఖర్చుల కోసం రూ.10 వేలు చేతిలో పెట్టేసి వెళ్లారు. భోలే అన్నా భార్య వాళ్ల పిల్లలకు చేసిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఓ తల్లిలా చూసుకుంది. షుగర్ కారణంగా కరోనా ట్రీట్మెంట్ కు నా బాడీ సహకరించలేదు. అప్పుడు భోలే షావలి సర్ భార్య నా కోసమే ప్రత్యేకంగా చికెన్, మటన్ లు వండి పెట్టి తీసుకొచ్చింది. ఆ అమ్మ పెట్టిన అన్నం తిన్న తర్వాతే నా షుగర్ లెవెల్స్ తగ్గాయి. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ దేవుడి దయతో క్షేమంగా బయట పడ్డాను. నా పరిస్థితి మెరుగైన తర్వాత భోలే అన్న కట్టిన డబ్బులు తిరిగి వెళదామని వెళ్లాను. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ‘తమ్ముడు.. నువ్వు ఏడ్చుకుంటూ డబ్బులు తీసుకెళ్లావ్.. నవ్వుతూ తీసుకురా’.. అప్పటి దాకా డబ్బులు ఇయ్యద్దు ‘ అని షావళి సర్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి’ అని ఎమోషనల్ అయ్యాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
భోలేషావళి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram




