Ramayana: సీత పాత్రతో అలాంటివి చేయిస్తారా? ‘రామాయణ్’ పై అలనాటి సీతమ్మ షాకింగ్ కామెంట్స్
'రామాయణ్' సినిమాలో సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అద్భుతంగా నటించింది. సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఇదే క్రమంలో కొందరు మాత్రం సాయి పల్లవి సీన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అలనాటి సీతమ్మ దీపికా చిఖాలియా స్పందించింది.

రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’సీరియల్లో సీతమ్మగా నటించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపికా చిఖాలియా. . 1987లో విడుదలైన ‘రామాయణం’ సీరియల్ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈనాటికీ ప్రేక్షకులు దీపికను, ఆమె పోషించిన సీతమ్మ పాత్రను మర్చిపోలేదు. కాగా ఇప్పుడు దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణం’ సినిమాను రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్తో పోలుస్తున్నారు. నితేష్ తివారీ రామాయణంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించారు. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా చేసింది. నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 400 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. అయితే ఈ ‘రామాయణ’లో సీత పాత్ర కూడా పోరాటాలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చాలా మంది దర్శకుడు నితేశ్ తివారీని ట్రోల్ చేస్తున్నారు. శాంతి, సహనానికి సీత ప్రతిరూపమని, ఆమెను ఎక్కడ యోధురాలిగా చూపించలేదని రామాయణ దర్శకుడిని విమర్శిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై రామాయణ్ సీరియల్ నటి దీపికా స్పందించారు. రామాయణంలో అలాంటి సన్నివేశం తనకు గుర్తులేదని ఆమె అన్నారు. తాను కూడా సోషల్ మీడియాలో సీత పోరాట దృశ్యాలను చూశానని దీపికా పేర్కొన్నారు.
‘దీని గురించి ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియడం లేదు. నాకు వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామాయణం బాగా గుర్తున్నాయి. మన రామాయణంలో కూడా ఈ గ్రంథాలలోని చాలా భాగాలు ఉన్నాయి. కానీ, ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ కూడా చూపించినట్లు నాకు గుర్తులేదు. మీరు గమనిస్తే, మన దేశంలో 300కు పైగా రామాయణాలు ఉన్నాయి. ప్రతి కథ, ప్రతి రామాయణం కొంత మేరకు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. బహుశా సినిమా నిర్మాతలు ఇలాంటి భాగాన్ని మరేదైనా రామాయణం నుంచి తీసుకుని ఉండవచ్చు, దాని గురించి నాకు తెలియదు’ అని దీపికా చెప్పుకొచ్చారు.
నితేష్ తివారీ ‘రామాయణం’ చూశారా అని దీపికను అడగ్గా, ఆమె, “లేదు, వచ్చే వారం వెళ్తాను. దీపావళి తర్వాత సినిమా చూస్తాననుకుంటున్నాను. సినిమా అద్భుతంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది,” అని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, అరుణ్ గోవిల్ హీరోగా నటించిన దీపికా చిఖాలియా కొత్త సినిమా ‘నోటీస్’ కూడా ఇప్పుడు తెరపై కనిపిస్తోంది. ఈ సినిమా వేవ్స్ ఓటీటీలో విడుదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




