గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
ప్రతి వివాహిత జీవితంలో తనకు అండగా నిలిచే భర్త ఉండటం ఎంతో ముఖ్యం. పెళ్లయిన ప్రతి మగాడు తన భార్య మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం ఇంటి పనుల్లోనే కాదు, పిల్లల పెంపకం మరియు ఇతర బాధ్యతల్లోనూ భర్తలు సమాన భాగస్వాములు కావాలి.

జీ5 ఒరిజినల్ మూవీగా ‘శ్రీమతి’లో నివేదా థామస్ ప్రధాన పాత్రను పోషించగా.. తిరువీర్, హరితేజ, రేణూ దేశాయ్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 4న ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో రాజ శేఖర్ మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ టైటిల్ వినగానే ఇదొక మంచి చిత్రం అవుతుందని నాకు అనిపించింది. ఇందులో మంచి కథ, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుందని అనుకుంటున్నాను. నివేదా గారికి, తిరువీర్ గారికి, నిరంజన్ గారికి, చైతన్య గారికి ఆల్ ది బెస్ట్. ‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి. ప్రతీ ఇంట్లో అందరూ శ్రీమతికి సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘‘ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’.. ఇప్పుడు రాబోతోన్న ‘శ్రీమతి’ మూవీని అందరూ తప్పకుండా చూడాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి.. పిల్లలు ఎలా ఉండాలి.. భార్యాభర్తలు ఎలా ఉండాలి.. అనేది చూపించేలా సినిమాలు వచ్చాయి. ‘శ్రీమతి’ లాంటి చిత్రాలు ఇంకా రావాలి’ అని అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ కథ నా మనసుకి ఎంతో నచ్చింది. పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారుతుంది. ఇతర భాషలతో పోల్చుకుని చూడకండి. మలయాళంలో పుట్టిన ఈ ఆలోచనను తెలుగు వారికి తగ్గట్టుగా విశ్వక్ తెరకెక్కించారు. ఈ టీంలో పని చేసిన ప్రతీ ఒక్కరూ సున్నిత మనస్కులే. ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతుంది. తిరువీర్ గారు, రేణూ దేశాయ్, గోపరాజు రమణ గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. నా కెరీర్లో ఇదొక విలువైన చిత్రం. ఇందులో నటించడం నా అదృష్టం. మగాడికి వ్యతిరేకంగా కాదు.. మన సిస్టంకి వ్యతిరేకంగా తీసిన సినిమా. మా ‘శ్రీమతి’ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
తిరువీర్ మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ కథ నాకెంతో నచ్చింది. వేరే భాషలో మంచి కథ వస్తే మన తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకు రావడం తప్పు కాదు. ‘దేవదాస్’ నుంచి ‘దృశ్యం’ వరకు మనం ఎన్నో చూశాం. శ్రీమతి మంచి చిత్రం. అందరూ తప్పకుండా చూడండి, అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ సినిమాకు సపోర్ట్ చేసిన నివేద గారికి, తిరువీర్ గారికి థాంక్స్. ఈ చిత్రంలోని ప్రతీ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. రేణూ దేశాయ్ గారు, రాజీవ్ కనకాల గారు, గోపరాజు రమణ గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. విశ్వక్, ఆదిత్య ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ జర్నీలో నాకు తోడుగా ఉంటున్న నా శ్రీమతి చైతన్యకి థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ కోసం నన్ను డైరెక్టర్‌గా తీసుకున్న నిరంజన్ గారికి, చైతన్య గారికి థాంక్స్. ఇది చెప్పాల్సిన కథ. ఆదిత్య విజువల్స్, ఎడ్విన్ మ్యూజిక్ బాగుంటుంది. ఆల్రెడీ ఈ సినిమా ఉంది కదా.. మళ్లీ ఎందుకు చూడాలని అంతా అడుగుతున్నారు. ఆర్టిస్టుల పర్ఫామెన్స్ గురించి ఈ మూవీ చూడాలని నేను గర్వంగా చెప్పగలను. నివేదా థామస్ అద్భుతంగా నటించారు. ఆమె తన నటనతో మ్యాజిక్ చేశారు. తిరువీర్, రేణూ దేశాయ్, గోపరాజు రమణ ఇలా అందరూ గొప్పగా నటించారు. 25 రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేశాం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నివేదా గారికి, తిరువీర్ గారికి.. నా టీంకు థాంక్స్’ అని అన్నారు. రేణూ దేశాయ్ మాట్లాడుతూ .. ‘‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ రీమేక్ మళ్లీ ఎందుకు అని నాకు కూడా అనిపించింది. అందరూ అద్భుతంగా నటించారు. ఫలానా వారి కూతురు, ఫలానా వ్యక్తి భార్య అని ముద్ర వేసేస్తుంటారు. గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు. ఇలాంటి కథను ప్రతీ భాషలో, ప్రతీ ఒక్కరికీ అందించాలి’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
