Allu Arjun- Mohan Babu: పెదరాయుడు అలా.. పుష్పరాజ్ ఇలా..! ఆయనకో న్యాయం.. ఈయనకో న్యాయం

రెండు ఘటనలు.. ఒక అరెస్టు..! పెదరాయుడు అలా.. పుష్పరాజ్ ఇలా..! ఎస్.. తెలంగాణలో సినిమా స్పైసే ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. చిన్నసైజు అరాచకానికి పాల్పడ్డ మోహన్‌బాబు... నేను శుద్దపూసను అంటూ ఆడియో సందేశమిచ్చి.. అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. జరిగింది విషాదం.. మళ్లీ జరక్కుండా చూసుకుందాం.. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నా అని వీడియో సందేశమిచ్చిన పుష్పరాజ్ మాత్రం అరెస్టయి.. జైలు గోడల దాకా వెళ్లారు. ఇక్కడ హీరో ఎవరు.. విలనిజం ఎవరిది..?

Allu Arjun- Mohan Babu: పెదరాయుడు అలా.. పుష్పరాజ్ ఇలా..! ఆయనకో న్యాయం.. ఈయనకో న్యాయం
Mohanbabu, Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2024 | 9:55 PM

ఓవైపు జల్‌పల్లి ఫామ్‌హౌస్‌లో ఒక పెదరాయుడి దౌర్జన్యకాండ.. డజన్లకొద్దీ కెమెరాల సమక్షంలో జర్నలిస్టుపై పాశవిక దాడి.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు రంజిత్.. తప్పించుకుని దర్జాగా తిరుగుతున్న అసెంబ్లీ రౌడీగారు. మరోవైపు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట.. తన పరోక్షంలో జరిగినా.. సారీ చెప్పినా.. సాయం చేసినా.. అల్లు అర్జున్ ఇంటికొచ్చి అరెస్టు చేసిన పోలీసులు.. నాలుగురోజుల తేడాతో జరిగిన రెండు ఘటనలు.. వాటి పర్యవసానాలు.. అక్కడ కనిపిస్తున్న స్పష్టమైన వైరుధ్యం.. ఇదెక్కడి విడ్డూరం అంటూ షాకౌతున్న జనం.

ఆస్తితగాదాలతో తండ్రీ కొడుకులు ఘర్షణ పడ్డారన్న వార్తలొచ్చి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని పోలీస్‌స్టేషన్‌కెక్కిన తర్వాత అక్కడికెళ్లి కవర్‌ చెయ్యబోతే అప్పుడు జరిగింది జల్‌పల్లిలో జర్నలిస్టుపై దాడి ఘటన. కర్కశమైన చూపులతో హెచ్చరిస్తూ, బూతులు మాట్లాడుతూ.. మైకు తీసుకుని జర్నలిస్టు తలపై కొట్టారు మోహన్‌బాబు.. ఆనక తడుముకుని.. ఇది మీ స్వయంకృతాపరాధమే.. నా తప్పేమీ లేదు అంటూ ఆడియో సందేశమిచ్చారు. అందులో ఉన్నవన్నీ శుద్ధ అబద్ధాలే.

అరాచకాలు చాలించండి అంటూ.. తుపాకుల్ని సరెండర్ చెయ్యాలని పోలీసులు నోటీసులిచ్చినా.. హైబీపీ వచ్చిందని ఆస్పత్రిలో దాక్కుని.. ఇప్పటిదాకా పరారీలో ఉన్నారు మోహన్‌బాబు. అదీ రియల్‌లైఫ్‌లో ఆయన కనబర్చిన హీరోయిజం. కానీ.. మరో హీరో అల్లు అర్జున్ కేసులో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది వ్యవహారం. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్… డిసెంబర్ 4.. రాత్రి సమయం.. పుష్ప2 సినిమా ప్రీమియర్‌ షోటైమ్.. హీరో అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారంతో సడన్‌గా అలజడి.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక 35 ఏళ్ల ఒక మహిళ చనిపోవడం సంచలనంగా మారింది. ముందస్తు సమాచారం లేకుండా వచ్చి.. ఓపెన్‌టాప్ కారులో అభివాదం చేశారంటూ హీరో అల్లు అర్జున్‌పై BNS 118, 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేరపూరితంగా వ్యవహరించి.. ఒకరి మరణానికి కారకుడయ్యాడనేది అభియోగం. సంధ్య థియేటర్ ఓనర్‌తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు బన్నీ కూడా అరెస్టయ్యారు.

అది తన వల్లే జరిగిందా లేదా అనేది తేలకపోయినా.. జరిగింది విషాదమే కనుక అల్లు అర్జున్ దగ్గర పశ్చాత్తాపం కనిపించింది. ఇలా జరిగుండకూడదంటూ తల వంచి.. బహిరంగ క్షమాపణ చెప్పుకున్నారు. తన సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడం ఆనవాయితీగా నడుస్తోందని, ఇరవయ్యేళ్లుగా ఏ ఒక్క దుర్ఘటనా జరగలేదని.. ఇప్పుడే ఇటువంటి విషాదాన్ని చూడాల్సి వచ్చిందని.. విచారం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి బాసటగా ఉంటానని, అత్యవసర సాయం కింద పాతిక లక్షలు ఇస్తున్నానని మాట కూడా ఇచ్చారు.

కాస్త లేటైనా అల్లు అర్జున్ రియాక్టయిన విధానాన్ని అందరూ పాజిటివ్‌గా తీసుకున్నారు. గతంలో ఎన్ని సినిమా ఫంక్షన్లు జరగలేదు.. ఎన్ని ట్రాజెడీల్ని చూడలేదు.. నిర్వాహకుల్నే కదా తప్పు బట్టాలి.. ఇందులో హీరో తప్పేముంది.. అనే సానుభూతి మాటలే వినిపించాయి. కానీ.. మోహన్‌బాబు ఎపిసోడ్‌లో జరిగిందేంటి..? జల్‌పల్లి ఫామ్‌హౌస్‌లో ఆరోజు మోహన్‌బాబు స్పాన్సర్ చేసిన ఆ దృశ్యకావ్యం ఆన్‌లైన్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. అక్కడేం జరిగిందో కళ్లారా చూసి.. ఈ మోహన్‌బాబు అసలు మనిషేనా.. అని నోరెళ్లబెట్టారు జనం. ఆయన బారిన పడి.. తీవ్రగాయాలపాలైన జర్నలిస్టు రంజిత్ ఇప్పటికీ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. తన వల్ల ఇంత జరిగినా ఆయన మాత్రం జస్ట్‌… ఒక్క సారీతో సరి పెట్టారు. అది కూడా మనస్పూర్తిగా చెప్పిన ఫుల్ సారీ కాదు.. హాఫ్‌హార్టెడ్ సారీ. ఉత్తుత్తి క్షమాపణలు చెప్పి.. జనం దగ్గర సానుభూతి కోసం ఎక్స్‌ట్రాగా నాలుగైదు డైలాగులు కూడా వేశారు.

తనపై హత్యాయత్నం కేసు నమోదైనా.. పోలీసులు వెతికినా దొరక్కుండా పరారీలో ఉంటూ.. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు మోహన్‌బాబు. మరోసారి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోడానికి ఎన్ని డ్రామాలాడాలో అన్నీ ఆడుతున్నారు సీనియర్ మోస్ట్ నటుడు.. సోకాల్డ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. పబ్లిగ్గా పేట్రేగిపోయి, మర్డర్ అటెంప్ట్ చేసిన ఒక పెదరాయుడి కథ అలా ఉంటే.. తన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా.. పోలీసులకు సహకరిస్తూ అరెస్టుకు సైతం జడవని కథ పుష్పరాజ్‌ది.  కాగా పోలీసులు తమ అల్లు అర్జున్ విషయంలో తమ చర్యను సమర్ధించుకుంటున్నారు. బెనిఫిట్ షోలకు పరిమిషన్ ఇచ్చి.. హీరోలు, హీరోయిన్స్ థియేటర్స్ కు రావొద్దు అని చెప్పినా కూడా అల్లు అర్జున్ వచ్చారని, తమకు ముందుగా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని అంటున్నారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.