Anushka Shetty: హీరోయిన్ అనుష్క పేరు చెప్పి రూ. 51 లక్షలు దోచేశారు.. చివరకు..
హీరోయిన్ అనుష్క శెట్టి డేట్స్ ఇప్పిస్తానంటూ విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మణ్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్స్ పేర్లు చెప్పితో.. వారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని.. వారి సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్లతో గతంలో దిగిన ఫోటోలను చూపిస్తూ.. పలువురు కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ రష్మిక సినిమాలో ఛాన్స్ అంటూ లక్షల్లో నగదు తీసుకుని పారిపోయిన ఘటన మరువక ముందే మరో హీరోయిన్ పేరుతో ఓ ప్రొడ్యూసర్ నుంచి ఏకంగా రూ. 51 లక్షల్ని కాజేశాడు. హీరోయిన్ అనుష్క శెట్టి డేట్స్ ఇప్పిస్తానంటూ విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మణ్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం అనుష్క మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ ఇప్పిస్తానని.. సదరు నిర్మాతను పలుమార్లు బెంగుళూరు తీసుకెళ్లిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ. 26 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మణిశర్మతోనూ మూవీ కోసం మాట్లాడిస్తానని మరికొన్ని లక్షలు తీసుకున్నాడు. ఇలా మొత్తంగా రూ. 51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. అయితే రోజులు గడుస్తున్నా ఇద్దరి అపాయింట్మెంట్ ..డేట్స్ ఇప్పించలేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణాచారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు లక్ష్మణాచారి.. ఫిలింఛాంబర్ లో ఎల్లారెడ్డి పై ఫిర్యాదు చేశారు. దాంతో ఎల్లారెడ్డి తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదు. ఇదే విషయమై ఎల్లారెడ్డిని నిలదీయగా.. డబ్బులు ఇవ్వనని బెదిరిస్తున్నట్లు ప్రొడ్యూసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తానని కూడా రివర్స్ లో బెదిరిస్తున్నట్లు లక్ష్మణాచారి చెప్పుకొచ్చారు.