AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరోకు ఇచ్చింది రూ. 11 వేలే.. కానీ సినిమా ఇండస్ట్రీ హిట్.. యూత్‌ను పిచ్చెక్కించేసింది

దర్శకుడు తేజ తన తొలి సినిమా 'చిత్రం' నిర్మాణంలో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉదయ్ కిరణ్‌ను హీరోగా ఎంచుకోవడం, పారితోషిక సమస్యలు, రీమా సేన్ ఎంపిక, బడ్జెట్ పరిమితులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, బ్రహ్మానందం లాంటి ప్రముఖుల సహకారం గురించి పంచుకున్నారు. ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Tollywood: హీరోకు ఇచ్చింది రూ. 11 వేలే.. కానీ సినిమా ఇండస్ట్రీ హిట్.. యూత్‌ను పిచ్చెక్కించేసింది
2
Ravi Kiran
|

Updated on: Mar 28, 2026 | 6:08 PM

Share

దర్శకుడు తేజ తన తొలి సినిమా ‘చిత్రం’ నిర్మాణంలో జరిగిన పలు ఆసక్తికరమైన సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా ఉదయ్ కిరణ్, రీమాసేన్‌లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్‌ను హీరోగా ఎంపిక చేయడంలో తేజకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తేజ యువ హీరోలను కావాలనుకున్నారు. అయితే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక చైల్డ్ ఆర్టిస్టును ప్రధాన పాత్రకు సిఫార్సు చేశారు. తేజ ఆ అబ్బాయి తల్లికి కథ చెప్పినప్పుడు, ఆమె తన కుమారుడికి రూ. 5 లక్షల పారితోషికం డిమాండ్ చేశారు. అయితే, తేజ సినిమా బడ్జెట్ ప్రకారం హీరో పాత్రకు కేవలం రూ. 11 వేలు మాత్రమే ఇవ్వగలనని స్పష్టం చేశారు. “మా హీరో క్యారెక్టర్ విలువ రూ. 11 వేలు అంతే. మీరు అడిగింది మేము కట్టలేం,” అని తేజ ధైర్యంగా చెప్పారు. ఈ చర్చలు విఫలమవడంతో, ఉదయ్ కిరణ్‌ను తిరిగి పిలిచి హీరోగా ఖరారు చేశారు.

రీమాసేన్ ఎంపిక కూడా చాలా ఉత్కంఠగా సాగింది. ప్రారంభోత్సవానికి కేవలం కొన్ని గంటల ముందు, అర్థరాత్రి ఆమెను హీరోయిన్‌గా నిర్ణయించారు. రీమాసేన్.. ఉదయ్ కిరణ్ కంటే కొంచెం పెద్దగా కనిపిస్తుందనే చర్చలు జరిగినా, తేజ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. సినిమాకు క్యాస్టింగ్ విషయానికొస్తే.. మోడల్ కో-ఆర్డినేటర్ ఉదయ్ కిరణ్‌ను తీసుకువచ్చారు. రామానంద్ అనే క్యాస్టింగ్ కోఆర్డినేటర్ బేకరీలలో, క్యాంటీన్లలో “షారూఖ్ ఖాన్ లేదా మాధురీ దీక్షిత్ కావాలనుకుంటున్నారా?” అనే చిన్న పోస్టర్లను అతికించి, తన ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. దీని ద్వారా చిత్రం శ్రీను లాంటి అనేక మంది కొత్త నటులు ఎంపికయ్యారు.

బ్రహ్మానందం తండ్రి పాత్ర కోసం ఎంపికైనప్పుడు, నటుడు ఉత్తేజ్ ఆయనతో మాట్లాడారు. బ్రహ్మానందం కేవలం రూ. 1 లక్ష రెమ్యునరేషన్‌తో సినిమా చేయడానికి అంగీకరించడమే కాకుండా, సినిమా విజయవంతం అయ్యాకనే తన పారితోషికం చెల్లించమని, సినిమా హిట్టవుతుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ తొలి రోజు ఒక రూపాయి తీసుకుని, మిగిలిన డబ్బులు సినిమా హిట్టైన తర్వాత ఇమ్మని చెప్పారు. ఇలా ఈ సినిమాకు ప్రతి ఒక్క నటీనటులు, చిత్ర బృందాన్ని ఎంపిక చేశారట. కాగా, రామోజీరావు ఎంత ఖర్చయినా పర్వాలేదు సూపర్ హిట్ సినిమా తీయమని చెప్పినప్పటికీ, తేజ తాను ఇచ్చిన మాట ప్రకారం కేవలం రూ. 40 లక్షల బడ్జెట్‌తోనే సినిమాను పూర్తి చేశారు.

Follow Us