Tollywood: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న చిన్నారి.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్.. వీడియో ఇదిగో
ఈ స్టార్ హీరోయిన్ కు సొంతంగా ప్రైవేట్ ఐల్యాండ్ ఉందని రూమర్లు ఉండచ్చు.. మనీ లాండరింగ్ ఆరోపణలు వినిపించవచ్చు.. తరచూ ఈడీ విచారణలకు వెళ్లచ్చు గాక.. కానీ ఈ ముద్దుగుమ్మ ఎన్నో మంచి పనులు చేస్తోంది. మూగ జీవాల సంరక్షణ, ఆడ పిల్లల చదువులు, స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయం చేస్తుంటుంది.

పిల్లలకు ఏదో చిన్న జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. అలాంటిది తమ బిడ్డలు హైడ్రోసెఫాలస్ లాంటి అరుదైన జబ్బుల బారిన పడితే ఆ పేరెంట్స్ బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నారీ చిన్నారి తల్లిదండ్రులు. హైడ్రోసెఫాలస్ అంటే మెదడులో నీరు అని అర్థం. సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మెదడులోని వెంట్రికల్స్‌లో పేరుకుపోయి మెదడు కణజాలాలపై ప్రమాదకరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే మరిన్ని తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. హైడ్రోసెఫాలస్ లాంటి వ్యాధులకు సర్జరీ లేదా దీర్ఘకాలిక వైద్య సంరక్షణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ఖర్చులను భరించలేక చాలా మంది తల్లిదండ్రులు తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ క్రమంలోనే హైడ్రోసెఫాలస్ వ్యాధితో బాధపడుతోన్న ఓ చిన్నారి జీవితంలో వెలుగులు నింపాలని చూస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తాజాగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతోన్న పిల్లాడి ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులతో ముచ్చటించింది. పిల్లాడికి అందుతున్న వైద్యంపై ఆరా తీసింది. అలాగే ఆ చిన్నారికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేసింది.
ఈ సందర్భంగా పిల్లాడికి అవసరమైన సర్జరీ చేయిస్తానని జాక్వెలిన్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెలుగులోకి తెచ్చాడు. పిల్లాడితో హీరోయిన్ కలిసున్న వీడియోను చేస్తూ.. హీరోయిన్ అభినందనలు తెలిపాడు. అలాగే పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని రాసుకొచ్చాడు.
పిల్లాడితో జాక్వెలిన్ ఫెర్నాండెజ్..
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పిల్లాడి పట్ల జాక్వెలిన్ స్పందించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ హీరోయిన్ ది మనసూ అందమైనదే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తుంటుంది. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అన్నట్లు జాక్వెలిన్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ప్రభాస్ నటించిన సాహోలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసిందీ అందాల తార.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








