AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balayya: ఏంటి.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?

బాలకృష్ణ సినీ జీవితంలో బాక్సాఫీస్ విజయాలు ఎన్ని ఉన్నా, అంచెలంచెలుగా ఎదిగినా, ఆగిపోయిన చిత్రాలు, ఎదురైన ఆటంకాలు ఎన్నో. నటరత్న నుంచి నర్తనశాల వరకు, పలు కారణాలతో పట్టాలెక్కకుండానేనో, మధ్యలోనేనో నిలిచిపోయిన బాలయ్య చిత్రాల వెనుక ఆసక్తికర విషయాలు ఈ కథనంలో.

Balayya: ఏంటి.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
Nandamuri Balakrishna - Akkineni Nageswara Rao
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2026 | 9:15 AM

Share

నటసింహం బాలకృష్ణను బాక్సాఫీస్ బొనంజాగా ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలు ఎన్నో. ఆయన సినిమా యావరేజ్‌గా నడిచినా వసూళ్లకు మాత్రం ఇబ్బంది ఉండేది కాదు. ఇక సినిమా హిట్ అయితే కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ పరంపర ఉన్నప్పటికీ, బాలకృష్ణ సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాలు వివిధ కారణాలతో ఆగిపోయాయి. అటు రీల్ జీవితంలోనూ ఇటు రియల్ జీవితంలోనూ తగిలిన దెబ్బలు, ఎదురుదెబ్బలు ఎన్నో ఉన్నాయి.  1986లో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..నటరత్న టైటిల్‌తో పేపర్ యాడ్ కూడా ఇచ్చారు. దర్శకుడు జంధ్యాల, నిర్మాత జి. సుబ్బారావు అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే వీసాలు రావడం ఆలస్యం కావడంతో బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో హీరో కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబును తీసుకుని, కథలో మార్పులు చేసి చిన్ని కృష్ణుడు పేరుతో చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత, బాలకృష్ణకు బాబాయ్ అబ్బాయ్ చిత్రం తర్వాత శపథం అనే మరో చిత్రాన్ని క్రాంతి కుమార్ దర్శకత్వంలో 3D లో తీయాలని సన్నాహాలు చేశారు. ఆ సమయంలో 3D చిత్రాల సందడి ఎక్కువగా ఉండేది. కథ కూడా సిద్ధమైంది. అయితే అనుకోని అవాంతరాలు ఎదురై, క్లాప్ కొట్టకుండానే శపథం చిత్రం ఆగిపోయింది.

అశోక చక్రవర్తి చిత్రాన్ని నిర్మించిన కోగంటి హరికృష్ణ, ఆ చిత్రం విడుదలయ్యాక బాలకృష్ణతో బాలకృష్ణుడు అనే చిత్రాన్ని ప్రకటించారు. అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం వంటి చిత్రాల కథ దాదాపు ఒకటే కావడంతో, ఆ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల ఆగ్రహించిన బాలకృష్ణ, ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు. 2002లో బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ హీరోగా ఒక చిత్రాన్ని ప్రారంభించారు. దేశభక్తి నేపథ్యంలో లవ్, సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ కథలో బాలకృష్ణ కమాండో పాత్రలో కనిపించాల్సి ఉంది. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా, వి. సముద్ర దర్శకుడు. మార్చి 8న అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ కొద్ది రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కూడా ఆగిపోయింది. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే భార్గవ్ ఆర్ట్స్ అనుకునే రోజులు అవి. మాతో పెట్టుకోకు చిత్రం తర్వాత భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలకృష్ణ హీరోగా ఒక భారీ జానపద చిత్రాన్ని ప్రారంభించారు. విక్రమసింహ భూపతి అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ మహారాజుగా, యోధుడిగా రెండు పాత్రలు పోషించారు. రోజా, పూజా బాత్రా కథానాయికలు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. సగానికి పైగా చిత్రం పూర్తయిన తర్వాత హీరో బాలకృష్ణకు, నిర్మాత గోపాల్ రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయింది. దురదృష్టవశాత్తు, ఆ తర్వాత గోపాల్ రెడ్డి శ్రీమతి, గోపాల్ రెడ్డి, ఆపై ఆయన కుమారుడు భార్గవ్ మరణించారు.

పౌరాణిక చిత్రాలు అన్నా, ఆ తరహా పాత్రలు అన్నా బాలకృష్ణకు ఎంతో ఇష్టం. అన్న ఎన్టీఆర్ నటించిన అద్భుత చిత్రం నర్తనశాలను అదే పేరుతో తన దర్శకత్వంలో తీయాలని నిర్ణయించుకున్నారు. తన అర్జునుడి పాత్రను, శరత్ బాబు ధర్మరాజు పాత్రను, భీముడి పాత్రను శ్రీహరి, ద్రౌపది పాత్రను సౌందర్య ఇందులో పోషించారు. ఒక వారం రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత బాలకృష్ణకు యాక్సిడెంట్ కావడం, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం వల్ల నర్తనశాల షూటింగ్ ఆగిపోయింది. అంతవరకు తీసిన సన్నివేశాలను ఎడిట్ చేసి 16 ఏళ్ళ తర్వాత బాలకృష్ణ ఓ లఘుచిత్రంగా విడుదల చేశారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి. గోపాల్‌తో 2011లో హర హర మహాదేవ చిత్రం మొదలైంది. ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. గతంలో లక్ష్మీ నరసింహ చిత్రంతో బాలకృష్ణతో విజయం సాధించిన బెల్లంకొండ సురేష్, ఈ ప్రాజెక్ట్‌ను మళ్ళీ బాలకృష్ణతో ప్రారంభించారు. అయితే, బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో బెల్లంకొండ సురేష్‌తో పాటు మరో వ్యక్తి గాయపడటం, అది పెద్ద వివాదంగా మారడంతో సినిమా నిర్మాణం ఆగిపోయింది. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా తీయాలని ప్రయత్నించి ప్రారంభించినా, ప్రారంభోత్సవం రోజున అభిమానుల ఆగ్రహానికి గురైన వినైల్స్ (కమల్ హాసన్ దశావతారం పోస్టర్‌లో బాలకృష్ణ ఫేస్ పెట్టడం) వివాదం వల్ల చివరకు హర హర మహాదేవ చిత్రం కూడా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇలా బాలకృష్ణ సినీ ప్రస్థానంలో విజయాలు ఎంత ఉన్నాయో, వాటి వెనుక ఆగిపోయిన ఎన్నో చిత్రాల కథలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి.

(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టులు నుంచి సేకరించాం)

Follow Us