కాక్రోచ్ మిల్క్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్.. తాగితే దిమ్మతిరిగే ఎనర్జీ.. అసహ్యించుకోకుండా ఇది తెలుసుకోండి..
మనకు పాలు అంటే బర్రె లేదా ఆవు గుర్తుకొస్తాయి. కానీ త్వరలోనే మార్కెట్‌లోకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక కొత్త రకం పాలు రాబోతున్నాయి. అదే కాక్రోచ్ మిల్క్. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక ప్రోటీన్లు, కేలరీలు ఉన్న సూపర్ ఫుడ్‌గా ఇది మారగలదని శాస్త్రవేత్తలు పరిశోధనలు చెప్తున్నాయి. ఈ పవర్ మిల్క్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాలు అనగానే మనకు ఆవులు, గేదెలు లేదా బాదం, సోయా, ఓట్ మిల్క్ గుర్తుకొస్తాయి. కానీ త్వరలోనే మార్కెట్‌లోకి ఒక ఊహించని కొత్త పాలు రాబోతున్నాయి. వినడానికి కాస్త విచిత్రంగా, అస్యహ్యంగా అనిపించినా.. కాక్రోచ్ మిల్క్ ప్రపంచంలోనే అత్యంత పౌష్టికాహారంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం మనిషి వాడుకోవడానికి అందుబాటులో లేనప్పటికీ, భవిష్యత్తులో పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఏమిటీ బొద్దింక పాలు?
సాధారణంగా బొద్దింకలు గ్రుడ్లు పెడతాయి. కానీ పసిఫిక్ బీటిల్ కాక్రోచ్ అనే ఒక ప్రత్యేకమైన బొద్దింక జాతి మాత్రం నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. తల్లి బొద్దింక తన కడుపులోని పిల్లలకు పోషణ అందించడానికి లేత పసుపు రంగులోని పాలు వంటి ద్రవాన్ని స్రవిస్తుంది. పిల్లలు ఈ ద్రవాన్ని తాగినప్పుడు, అది వారి పొట్టలో మెరిసే స్ఫటికాలుగా మారుతుంది. ఈ దట్టమైన పాల స్ఫటికాలపైనే శాస్త్రవేత్తల దృష్టి పడింది.
గేదె పాల కంటే 3 రెట్లు ఎక్కువ శక్తి..
2016లో బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బైండింగ్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ రామస్వామి నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరిశోధనలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా క్షీరదాలలో అత్యధిక కేలరీలు ఉండేవి గేదె పాలలోనే. కానీ ఈ బొద్దింక పాలలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీ* ఉన్నాయని తేలింది. వీటిలో శరీర కణాల పెరుగుదలకు, పునర్నిర్మాణానికి అవసరమైన అత్యవసర ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, మంచి కొవ్వులు, హెల్తీ షుగర్స్ సమృద్ధిగా ఉన్నాయి.
పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయం
ప్రస్తుతం డెయిరీ ఫామింగ్ కోసం వేలాది ఎకరాల భూమి, నీళ్లు, మేత అవసరమవుతున్నాయి. కానీ కీటకాల పెంపకం ద్వారా పర్యావరణంపై ఎలాంటి భారం పడదు. తక్కువ ఖర్చు, తక్కువ స్థలంతోనే ఈ పోషకాలను ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాళ్లు..
త్వరలోనే ఈ పాలు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయా అంటే.. దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఒక చిన్న బొద్దింక నుండి అతి స్వల్ప పరిమాణంలో పాలను సేకరించడం వ్యాపారపరంగా చాలా కష్టమైన పని. ఈ పాలు మనుషులు తాగడానికి ఎంతవరకు సురక్షితమో చెప్పడానికి ఇంకా పూర్తిస్థాయి ఆధారాలు లేవు. ఎంతటి పోషకాలు ఉన్నప్పటికీ.. బొద్దింక పాలు అనే పదాన్ని జీర్ణించుకోవడం సగటు మనుషులకు పెద్ద సవాలే.. ఏది ఏమైనా భవిష్యత్తు ఆహార సంక్షోభానికి ఇది ఒక సరికొత్త పరిష్కారంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.
