Ashu Reddy: ‘అలా చేసి జీవితంలో తప్పు చేశాను అనిపించింది..’ ఓపెన్‌గా చెప్పిన అషు రెడ్డి
అషు రెడ్డి తన జీవితంలో చేసిన రెండు పొరపాట్లలో రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఒకటిగా తెలిపింది. ఈ ఇంటర్వ్యూ వల్ల తన కుటుంబానికి కలిగిన ఇబ్బంది పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తను కోరుకున్న ఫేమ్, పని ఇది కాదని భావించినట్లు తెలిపింది.

నటి అషు రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తాను గతంలో చేసిన ఇంటర్వ్యూల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాలను, పశ్చాత్తాపాన్ని వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ తన జీవితంలో చేసిన రెండు పెద్ద పొరపాట్లలో ఒకటిగా ఆమె పేర్కొంది. మరొకటి తన మాజీ ప్రియుడితో సంబంధం అని తెలిపింది. ఆమె రామ్ గోపాల్ వర్మతో రెండుసార్లు ఇంటర్వ్యూలలో పాల్గొనగా, రెండవ ఇంటర్వ్యూ చేసినందుకు మరింత పశ్చాత్తాప పడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూల వల్ల ఎదురైన పరిణామాలు తన కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయని అషు రెడ్డి వివరించింది. ఇంటర్వ్యూ సమయంలో జరిగిన సంఘటనలు, వాటి తదనంతరం తన తల్లిదండ్రులు.. పొరుగువారి నుంచి ఎదురైన ప్రశ్నలు తమ కుటుంబంలో ఒక విధమైన అలజడిని సృష్టించాయని ఆమె తెలిపింది.
“మీ అమ్మాయి ఇంత చదువుకుని ఇలా ఓపెన్‌గా మాట్లాడుతుందా?” వంటి వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూ కంటెంట్ మరింత పాజిటివ్‌గా లేదా సరదా మార్గంలో వెళ్లుంటే బాగుండేదని అషు రెడ్డి అభిప్రాయపడింది. తను చేసిన తప్పుకు వ్యక్తిగతంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ తన తల్లిదండ్రులకు కలిగిన ఇబ్బంది తనను చాలా బాధ పెట్టిందని చెప్పింది. అమెరికా నుంచి మంచి పని, మంచి గుర్తింపు పొందాలనే ఆశతో తిరిగి వచ్చిన తాను, ఈ తరహా పాపులారిటీని కోరుకోలేదని ఆమె స్పష్టం చేసింది. ఈ సంఘటన తర్వాత తాను జీవితంలో ఏం చేస్తున్నానో అని మొదటిసారి ప్రశ్నించుకున్నానని, భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పటికీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది.
ఆర్జీవీతో ఇంటర్వ్యూ అవకాశం ఎలా వచ్చిందనే దానిపై అషు రెడ్డి మాట్లాడుతూ, తాను స్వయంగా కోరలేదని, ఆర్జీవీ టీమ్ నుంచి కాల్ వచ్చినట్లు చెప్పింది. డేంజరస్ చిత్రం ప్రమోషన్ కోసం ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారని, మొదట వేరే నటీమణులను సంప్రదించిన తర్వాత.. ఎవరో రికమెంట్ చేయడంతో తనకు అవకాశం వచ్చిందని వివరించింది. తాను ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, అది సినిమా ప్రమోషన్, ఒక సరదా టాక్ షో లేదా ఏదైనా ఒక సాధారణ ఇంటర్వ్యూ అవుతుందని భావించానని, కానీ అది పూర్తిగా వేరే దిశలో వెళ్లిందని అషు రెడ్డి తెలిపింది. ఇంటర్వ్యూ తర్వాత రామ్ గోపాల్ వర్మతో తనకు ఎటువంటి సంబంధాలు లేదా ఫోన్ కాల్స్ లేవని ఆమె వెల్లడించింది. ఆయనతో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా వృత్తిపరమైన విషయం అని పేర్కొంది.
రామ్ గోపాల్ వర్మకు అరియానా లేదా వర్ష వంటి అనేక ఇతర ఛాయిస్‌లు ఉన్నాయని, తాను మాత్రమే లేనని ఆమె అభిప్రాయపడింది. గతంలో ఆయన పుట్టినరోజు ఇన్విటేషన్ వస్తే కూడా తాను అతిగా ఆలోచించి వెళ్లలేదని , ఇప్పుడు ఆయనకు కాల్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది అని ఆమె చెప్పింది. ఏదైనా పని ఉంటేనే ఆయన కాల్ చేస్తారని, అలాగే తను కూడా పని ఉంటేనే కాల్ చేస్తానని ఆమె స్పష్టం చేసింది. ఈ సంఘటనలన్నీ తన జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పాయని అషు రెడ్డి వెల్లడించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




