తినడానికి తిండి లేక కుళాయి నీళ్లు తాగుతూ గడిపా.. నాకు దారి చూపింది ఆ మహానుభావుడే
ఆర్. నారాయణమూర్తి.. ఈ పేరు తెలియనని ప్రేక్షకులు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ఆయనది ఓ సపరేట్ స్టైల్. కెమెరా ముందు వెనకా ఒకేలా ఉండే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. విప్లవ ప్రధానమైన సినిమాలను నిర్మించి, నటించారు ఆర్ నారాయణమూర్తి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి.

నటుడు ఆర్. నారాయణమూర్తి తన తొలి రోజుల సినీ జీవిత పోరాటాన్ని, ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిన్నతనం నుంచే సినిమా పట్ల అమితమైన ప్రేమను పెంచుకున్న ఆయన, తూర్పు గోదావరి జిల్లాలోని రౌతులపూడిలో సినిమా థియేటర్‌లో ఘంటసాల పాటలకు మంత్రముగ్ధుడై సినిమా నటుడు కావాలనే కలను పెంచుకున్నారు. పేపర్లలో తన పేరు పడాలని, పోస్టర్లపై తన బొమ్మ కనిపించాలని కలలు కన్నారు. తల్లిని 70 రూపాయలు అడిగి మద్రాసు చేరుకున్న నారాయణమూర్తికి అక్కడ సినిమా రంగంలో లక్షలాది మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి వాస్తవం అర్థమైందట. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి వంటి ప్రముఖులు తనను ఆదరించి హీరో వేషం ఇస్తారని భావించిన ఆయన, మద్రాసులో డబ్బులు అయిపోయి, పార్కుల్లో నిద్రపోయి, కుళాయి నీళ్లు తాగుతూ ఆకలితో, నిరాశ్రయుడై కాలం గడిపా అని తెలిపారు. ఈ కష్టకాలంలో రాజబాబు గారి మేకప్ మ్యాన్ కృష్ణ గారి అసిస్టెంట్ చిన్న ఆయనకు మహాలింగపురంలోని పాడైపోయిన కార్ షెడ్‌లో ఆశ్రయం కల్పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి వచ్చిన సమయం అది, సుమారు 1972వ సంవత్సరం. చిన్న సహాయంతో విక్రమ్ స్టూడియోలో తాతా మనవడు షూటింగ్ జరుగుతున్న ప్రతాప ఆర్ట్స్ రాజుల నిర్మాణం సెట్‌లోకి అడుగుపెట్టగలిగారు. అక్కడ ఎస్.వి. రంగారావు, గుమ్మడి, సూర్యకాంతం, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి మహామహులను చూసే అవకాశం లభించింది.
ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు
అప్పుడప్పుడు ఆయన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, అమితాబ్ బచ్చన్ వంటి నటులను మిమిక్రి చేసేవారట. ఎస్.వి. రంగారావు గారు తనను అనుకరించమని అడగగా, ఆయన ముందు అనుకరించారట. అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. తాను బొమ్మలు కూడా వేస్తానని చెప్పి, అక్కడికక్కడే నాగేశ్వరరావు, రామారావుల బొమ్మలు గీసి చూపించారట. ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు, దర్శకుడు దాసరి నారాయణరావు బయటకు వచ్చి ఆయనను చూసి ముచ్చటపడ్డారట. ఏ ఊరి తమ్ముడు.? అని దాసరి నారాయణమూర్తి భుజం మీద చేయి వేయగానే, నారాయణమూర్తికి అమ్మయ్య అని ప్రాణం లేచి వచ్చినంత అనుభూతి కలిగిందట. తన కష్టాలన్నీ మర్చిపోయారట. తనది రౌతులపూడి అని, సినిమా పిచ్చితో వచ్చానని దాసరి నారాయణరావుకి చెప్పారు. అప్పుడే ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో తాను పాస్ అయినట్లు తెలిపారు. ఎన్టీఆర్ బీఏ, శోభన్ బాబు బీఏ అని వారి పేర్ల పక్కన పడినట్లు తన పేరు పక్కన ఆర్. నారాయణమూర్తి బీఏ అనిపించుకోవాలని ఉందని చెప్పారట.
ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట
దాసరి నారాయణరావు, నువ్వు తప్పకుండా వెళ్లి బీఏ చదువుకో, పాస్ అయి రా. నేను తప్పకుండా నీకు వేషం ఇస్తాను” అని హామీ ఇచ్చారు. గురువుగారి మాట విన్న నారాయణమూర్తి, జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ శరభయ్య గారి వద్ద తొలి జూనియర్ ఆర్టిస్ట్ వేషం పొందారు. కర్పగం స్టూడియోలో కృష్ణ గారు పాడిన రాముని బంటునురా పాటలో 170 మందిలో ఒకరిగా నటించా.. ఆరు, ఏడు రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో, ఆ షూటింగ్ సెట్‌లో మటన్ పులుసుతో కూడిన మధ్యాహ్న భోజనం బాగా తినగా, తీవ్రమైన జ్వరం వచ్చింది. చాలా కాలం ఆకలితో ఉన్నవారికి ఘన పదార్థాలు వెంటనే ఇవ్వకూడదని, ముందు లిక్విడ్ మాత్రమే ఇవ్వాలని ఆ సంఘటన ద్వారా ఆయనకు అర్థమైందని తెలిపారు. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్, రెడ్డి తరుణ్ గారి నాన్నగారైన రెడ్డి కాళిదాస్ ఆయనకు మందులు ఇచ్చి సహాయం చేశారు. ఆరు, ఏడు రోజుల పాటు ఆ జూనియర్ ఆర్టిస్ట్ వేషంలో నటించినందుకు శరభయ్య గారు ఆయన ఇంటికి పిలిచి 36 రూపాయలు ఇచ్చారని. ఆ తర్వాత నారాయణమూర్తి రైలు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చి బీఏ పూర్తి చేసుకున్నారట. బీఏ పాస్ అయిన తర్వాత మళ్లీ మద్రాసు వెళ్లగా, మాట నిలబెట్టుకుంటూ దాసరి నారాయణరావు తన నేటి సింహం సినిమాలో నారాయణమూర్తికి ప్రధాన పాత్ర ఇచ్చి ఆయన సినీ జీవితానికి ఒక మలుపు తిప్పారని తెలిపారు.




