AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthi Movies: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాతో లైన్‌ క్లియర్‌..ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలివే..

సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండగకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాకు కనీసం యావరేజ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు దుమ్మురేపుతాయి. అందుకే స్టార్‌ హీరోలందరూ సంక్రాంతి పండగను లక్ష్యంగా చేసుకుంటారు. అందుకు తగ్గట్లే మొన్నటి వరకు 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' లాంటి పెద్ద సినిమాలు వస్తాయి

Sankranthi Movies: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాతో లైన్‌ క్లియర్‌..ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలివే..
Basha Shek
|

Updated on: Jan 03, 2022 | 8:18 AM

Share

సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండగకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాకు కనీసం యావరేజ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు దుమ్మురేపుతాయి. అందుకే స్టార్‌ హీరోలందరూ సంక్రాంతి పండగను లక్ష్యంగా చేసుకుంటారు. అందుకు తగ్గట్లే మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’ లాంటి పెద్ద సినిమాలు వస్తాయి అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ‘భీమ్లా నాయక్’ ముందే పండగ బరినుంచి తప్పుకోగా.. ఒమిక్రాన్‌ ఆందోళనతో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడింది. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’ కూడా రావడం అనుమానంగానే ఉంది. దీంతో ఊహించని విధంగా ఈ సంక్రాంతికి పలు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

బంగార్రాజుతో మొదలు..

తమిళంలో అజిత్‌ నటించిన ‘వలిమై (తెలుగులో బలం)’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగానే సంక్రాంతి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నాగార్జున ‘బంగార్రాజు’ ముందుకొచ్చాడు. నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ వెండితెరకు పరిచయమవుతున్న ‘హీరో’ జనవరి 15న సంక్రాంతికి వినోదం పంచడానికి మన ముందుకు వస్తున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ‘డీజే టిల్లు’ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ‘విజేత’తో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన చిత్రం ‘సూపర్ మచ్చి’ సినిమా జనవరి 14న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

రౌడీ బాయ్స్‌ వినోదాలు.. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘రౌడీ బాయ్స్’. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘హుషారు’ ఫేం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తో్న్న ఈచిత్రం కూడా పండగలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మరోవైపు సీనియర్‌ దర్శక నిర్మాత ఎంఎస్‌ రాజు తెరకెక్కించిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’ జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుమంత్‌ అశ్విన్‌, మెహర్‌ చావల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘శేఖర్‌’ కూడా! ఇక పొంగల్‌ బరిలో రాజశేఖర్‌ నటించిన ‘శేఖర్‌’ సినిమా కూడా నిలవనుందని తెలుస్తోంది. రాజశేఖర్‌ సతీమణి, నటి జీవిత చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మలయాళ సూపర్‌ హిట్‌ ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌కు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇక వీటన్నిటి కంటే ముందు ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘అతిథి దేవోభవ’ సినిమా సంక్రాంతి బరిలో నిలవ నుంది. నువేక్ష హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమా’ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫిక్స్‌ చేసుకున్న డేట్‌ (జనవరి 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని చిన్న సినిమాల్లో ఏవి ప్రేక్షకుల మెప్పు పొందుతాయో, పండగ విజేత ఎవరో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.