Bigg Boss Telugu 9: ఆ డైరెక్టర్ కోసం తన ఇంట్లో స్పెషల్ రూమ్ కట్టించిన సుమన్ శెట్టి.. ఫొటో కూడా పెట్టి..
సుమన్ శెట్టి.. తెలుగు ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 100కు పైగా సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టిన మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ లో సుమన్ శెట్టి కూడా ఒకడు. గతంలో ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన అతను బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో ఈ బిగ్ బాస్ హౌస్ సుమన్ శెట్టికి సరిపోదన్న కామెంట్లు వినిపించాయి. అయితే ఉన్నట్లుండి జూలు విదిల్చాడీ స్టార్ కమెడియన్. ఆటల్లోనూ, మాటల్లోనూ దూకుడు చూపించాడు. ఫలితంగా బిగ్ బాస్ మొదటి వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇప్పుడు రెండో వారంలోనూ అగ్రస్థానంలో దూసుకెళుతున్నాడు. ముఖ్యంగా బయట సుమన్ శెట్టికి ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇది క్రమంగా అతని ఓటింగ్ పర్సంటేజ్ ను కూడా పెంచుతోంది. ఇక తన అభిమానులు, ఆడియెన్స్ అంచనాలను అందుకునేందుకు సుమన్ శెట్టి కూడా చాలా కష్టపడుతున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందు సుమన్ శెట్టి కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అందులో భాగంగా టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ తేజ గురించి అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే సుమన్ శెట్టి గురించి తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తేజ సుమన్ శెట్టి గురించి మాట్లాడుతూ.. సుమన్ శెట్టి ఒకరోజు వచ్చి మీరు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువుగారు అని అడిగాడట. దానికీ తేజ అంత పెద్ద మాటలు ఎందుకులే గానీ, నీకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి ముందు ఒక ఇల్లు కొనుక్కో అని చెప్పాడట. ఆ తరువాత, కొంతకాలానికి గురువు గారు మీవల్లే నేను ఇల్లు కట్టుకున్నాను, మంచి స్థాయిలో ఉన్నాను. ఇప్పుడైనా మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని పాదాలకు నమస్కరించబోయాడట. దీనికి స్పందించిన తేజ.. రుణం తీర్చుకోవడం కాదు కానీ, నాకు సినిమా అవకాశాలు రాక, నన్నెవరూ పట్టించుకోక రోడ్డున పడిపోతే నేను ఉండటానికి మీ ఇంట్లో ఒక రూమ్ నాకోసం పెట్టు అన్నారట.
బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి..
View this post on Instagram
దీంతో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజ చెప్పిన విధంగానే సుమన్ శెట్టి తన ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఆయన కోసం అలాగే ఉంచాడట. ఆ గదిలో తేజ ఫొటోను కూడా పెట్టాడట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సుమన్ శెట్టి గురు భక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమన్ శెట్టి. మొదటి సినిమాలోనే తన యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తన కామెడీ టైమింగ్‌తో ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నాడు.
సుమన్ శెట్టికి పెరుగుతోన్న మద్దతు..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








