Sri Rama: తెరపైకి సిక్స్‌ ప్యాక్‌ రాముడు, వీఎఫ్‌ఎక్స్‌ రాముడు వస్తున్నాడు.. మరి ఆ ఎన్టీ రాముడిని మైమరిపిస్తాడంటారా.?

Rama Character In Movies: ఆ దేవ దేవుడు శ్రీ రాముడికి.. సినీ ఇండస్ట్రీకి విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాముడి గొప్పతనాన్ని, ఆయ త్యాగ గుణాన్ని, రాజ నీతిని ఈ కాలం ప్రజలకు తెలుపుతూ...

Sri Rama: తెరపైకి సిక్స్‌ ప్యాక్‌ రాముడు, వీఎఫ్‌ఎక్స్‌ రాముడు వస్తున్నాడు.. మరి ఆ ఎన్టీ రాముడిని మైమరిపిస్తాడంటారా.?
Sri Rama
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2021 | 10:37 AM

Rama Character In Movies: ఆ దేవ దేవుడు శ్రీ రాముడికి.. సినీ ఇండస్ట్రీకి విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాముడి గొప్పతనాన్ని, ఆయన త్యాగ గుణాన్ని, రాజ నీతిని ఈ కాలం ప్రజలకు తెలుపుతూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు శ్రీరాముడు అంటే మదిలో మెదిలేది సీనియర్‌ ఎన్టీఆర్‌ అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతలా రాముడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆ గుండ్రటి మోము, ఆ నడక, ఆ నడత, ఆ చిద్విలాసం… అచ్చుగుద్దినట్టు ఆ శ్రీరామచంద్రుడిని జిరాక్స్ తీసినట్టుండే రామారావు.. వెండితెరపై నిండుచంద్రుడిలా వెలిగిపొయ్యేవారు. తెర తియ్యగానే.. ఎన్టీ రాముడు కనబడితే ఆటోమేటిక్‌గా చేతులు రెండూ జోడించి దండం పెట్టేవారు నాటి ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాముడు పాత్ర తీరు మారిపోతోంది. ఈ మోడరన్‌ రాముడు సిక్స్‌ ప్యాక్‌తో ఉంటున్నాడు. ప్రస్తుతం తెరపైకి రావడానికి సిద్ధమవుతోన్న సినిమాల్లో రాముడు హాలీవుడ్‌ హీరోను తలపిస్తున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం… రాముడిని సిక్స్‌ప్యాక్‌లో చూడాలని మోడరన్ ప్రేక్షకుడు కోరుకుంటున్నాడో లేదో గాని.. ప్రతీ కొత్త రాముడూ పొద్దున్నే జిమ్ముకెళుతున్నాడు. ఎలాగూ అన్నీ షర్ట్‌లెస్‌ సీన్లే కదా అనుకున్నారో ఏమో… ఆరు పలకల పొట్ట కోసం పాకులాడుతున్నారు. మరికొందరు రాముళ్లయితే కోర మీసకట్టుతో మరీ నాటుగా… మోటుగా తయారవుతున్నారు. ఈ సిక్స్‌ప్యాక్‌ మీసాల రాముళ్లను చూడలేక రెండు కళ్లూ మూసుకుపోతున్నాయి కొందరికి. చూడగానే.. మనసిచ్చి మొక్కాలనిపించే ఆ ఎన్టీ రాముడికి… ఇప్పుడు కరెక్ట్ రీప్లేస్‌మెంట్‌ ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది.

రేపటి రాముడు ఎలా ఉండనున్నాడు..

రామ కథ ఎన్నిసార్లు విన్నా, చూసినా చూడాలనిపిస్తుంది. దీనినే క్యాష్‌ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు ఈ క్రమంలోనే ఈ తరం ప్రేక్షకుల కోసం రాముడి పాత్రకు ఆదిపురుష్ లాంటి గ్రాఫికల్ వండర్స్‌ సిద్ధమవుతున్నాయి. మా బాహుబలికి రాముడి వేషం కట్టి.. ఆ ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ చేసి… మమ్మల్ని తరింపజెయ్యాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అవొచ్చేలోగా ఆ తొందర ఆపుకోలేక ఇక్కడ వింతవింతగా ఫ్యాన్‌ మేడ్ రాముళ్లు తయారవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇలాంటి ఫొటోలు కోకొల్లలు. సాహో స్టార్‌ని, సూపర్‌స్టార్‌ని శ్రీరామచంద్రుడిగా చూపించడానికి బడా దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌ లాంటి హంక్‌ స్టార్‌లు కూడా రాముడి గెటప్ వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వెండితెరపై రేపటి రాముడు ఎలా వుండబోతాడోనని బెంబేలెత్తిపోతున్నాడు సగటు రామభక్తుడు.

ఆనాటి రాముడు ఎలా ఉన్నాడంటే..

గతంలో తెరకెక్కిన రామ పాత్రలను ఒక్కసారి తేరిపార చూస్తే.. కాసింత ఉపశమనం దక్కేది. రామానంద్‌సాగర్‌ రామాయణంలో చూసిన అరుణ్‌గోవిల్‌ ముఖారవిందం ఇప్పటికీ గుర్తుంది. శ్రీరామరాజ్యంలో నందమూరి బాలక్రిష్ణుడికి రాముడి వేషం కట్టి.. డిస్టింక్షన్ మార్కులు కొట్టేశారు బాపు. అంతకుముందు సుమన్ లాంటి ఆజానుబాహువుల్ని రాముడి గెటప్‌లో చూపించి.. పర్వాలేదనిపించారు దర్శకేంద్రుడు. ఇలా… అలనాటి రాముడిని ఆధునిక రాముడిలో చూసుకుంటూ కొద్దిగానైనా స్వాంతన పొందుతున్నాడు ప్రేక్షకదేవుడు. కానీ.. రేపటిరోజున రాబోయే ఆ కొత్త రాముడు.. ఎలా వుండబోతున్నాడు…? ఎలా వున్నా… ఈ VFX రాముడు… సిక్స్‌ప్యాక్‌ రాముడు… ఆ ఎన్టీ రాముడి ప్రతిష్టను భ్రష్టు పట్టించకుండా వుంటే అదే చాలన్నది మనందరి వేడుకోలు.

– రాజా శ్రీహరి, TV9 తెలుగు, ET Desk

Also Read: రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.

Prabhas: డాన్‏గా ప్రభాస్.. కొత్త సినిమా కాదు గురూ.. అసలు విషయం వీడియోలో చూసేయ్యండి..

Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..