Shah Rukh Khan: ఒక్క వాచీ ధరతో ఊరు మొత్తాన్నే కొనేయొచ్చు! బాద్‌షా పెట్టుకునే వాచ్ స్పెషాలిటీస్ తెలుసా
ఆయన నడకలో ఒక రాజసం.. ఆయన మాటల్లో ఒక విద్వత్తు.. ఆయన కట్టుబొట్టులో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. బాలీవుడ్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో, కేవలం సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ అత్యంత విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు.

ఇటీవల రియాద్‌లో జరిగిన ఒక అవార్డు వేడుకకు ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకుని ఎంతో స్టైలిష్‌గా వచ్చారు. కెమెరాలన్నీ ఆయన ముఖంపై ఫోకస్ చేస్తే, వాచ్ ప్రియులు మాత్రం ఆయన మణికట్టు వైపు చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన చేతికి ఉన్న ఆ వాచ్ సాదాసీదాది కాదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే కొద్దిమంది దగ్గర మాత్రమే ఉన్న అత్యంత అరుదైన టైమ్ పీస్ అది. దాని ధర వింటే ఎవరైనా కళ్ళు తిరగాల్సిందే. మరి ఆ ‘మిస్టీరియస్’ వాచ్ ఏంటి?
అరుదైన రోలెక్స్..
షారుఖ్ ఖాన్ రియాద్ వేదికగా ధరించిన వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డైటోనా ‘బ్లూ శఫైర్’. దీనిని వాచ్ కలెక్టర్లు ‘ఆఫ్-క్యాటలాగ్’ పీస్ అని పిలుస్తారు. అంటే, మీరు రోలెక్స్ స్టోర్‌కు వెళ్లి ఈ వాచ్ కావాలని అడిగితే దొరకదు. ఈ కంపెనీ తమ అత్యంత వీఐపీ క్లయింట్ల కోసం మాత్రమే రహస్యంగా, అతి తక్కువ సంఖ్యలో వీటిని తయారు చేస్తుంది. అందుకే దీనిని ‘ఘోస్ట్’ వాచ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని గురించిన వివరాలు పబ్లిక్ రికార్డుల్లో కూడా చాలా తక్కువగా ఉంటాయి.
వాచ్ ప్రత్యేకతలు..
ఈ వాచ్ 40 ఎంఎం వైట్ గోల్డ్ కేస్‌తో రూపొందించబడింది. దీనిపై ఏకంగా 54 వజ్రాలు అమర్చారు. వాచ్ చుట్టూ ఉన్న బెజెల్‌పై గాఢ నీలం రంగులో ఉండే శఫైర్ (నీలమణి) రాళ్లను బాగెట్ ఆకారంలో అందంగా పొదిగారు. లోపల ఉండే డయల్ వెండి రంగులో మెరుస్తూ, కాంతి పడినప్పుడు రంగులు మారుతున్నట్టు కనిపిస్తుంది. లగ్జరీ వాచ్ ట్రాకర్ల అంచనా ప్రకారం, ఈ వాచ్ విలువ సుమారు రూ. 13 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే.. పదమూడు కోట్ల రూపాయలు!
షారుఖ్ ఖాన్ ఈ వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఆయన ఇదే వాచ్‌తో కనిపించారు. అంటే ఇది ఆయనకు అత్యంత ఇష్టమైన కలెక్షన్లలో ఒకటి అని అర్థమవుతోంది. సాధారణంగా షారుఖ్ ఖాన్ తన ఖరీదైన వస్తువులను ఎక్కడా ప్రదర్శించరు. ఎంతో హుందాగా, సాదాసీదాగా ఆ వాచ్ ధరించి తన పని తాను చేసుకుపోతారు.
ఈ ‘సైలెంట్ ఫ్లెక్స్’ స్టైలే బాద్‌షాను ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. షారుఖ్ ఖాన్ దగ్గర ఇలాంటివి ఎన్నో అరుదైన వస్తువులు ఉన్నాయి. కానీ రూ. 13 కోట్ల విలువైన ఈ వాచ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక వాచ్ ఖరీదుతో ఒక విల్లా లేదా ఒక లగ్జరీ కార్ల షోరూమ్‌నే కొనేయొచ్చు అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
