Thimmarajupalli TV : ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మాయ చేసాడుగా..!
కిరణ్ అబ్బవరం ఇన్నిరోజులు హీరోగా సినిమాలు చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా అవతమెత్తాడు. కిరణ్ నిర్మాణంలో మునిరాజు దర్శకత్వంలో కొత్త నటీనటులతో తెరకెక్కిన రూరల్ ఎమోషనల్ డ్రామా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: తిమ్మరాజుపల్లి టీవీ
నటీనటులు: సాయి తేజ్ (హీరో), వేధా జలంధర్ (హీరోయిన్), ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, తేజ విహాన్, టీవీ రామన్, చిట్టిబాబు, ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు
నిర్మాణ సంస్థలు: కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్
సంగీతం: వంశీకాంత్ రేఖన
సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి
దర్శకత్వం: వి. మునిరాజు
నిర్మాతలు: కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల (సహ నిర్మాత)
కథ:
తిమ్మరాజుపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. 90వ దశకంలో ఆ ఊరికి ప్రతీ జాతరకు ఓ టీవీని అద్దెకు తీసుకొచ్చి సినిమాలు చూపిస్తుంటాడు సతీష్ (సాయితేజ్). అలాంటిది ఆ ఊరికి మొదటిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప (ప్రదీప్ కొట్టే). అతడి చెల్లి శారద (వేదా జలంధర్)ను సతీష్ ప్రేమిస్తుంటాడు. కానీ అది రాజప్పకు నచ్చదు. అదే సమయంలో ఆ టీవీ చుట్టూ ఊరి జనాల భావోద్వేగాలు, వారి జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయి అనేది ప్రధానాంశం. ఊళ్లో అందరూ ఆ టీవీ దగ్గరే చేరి వినోదాన్ని పొందుతున్న సమయంలో, అనూహ్యంగా ఆ టీవీ విషయంలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అసలు ఆ టీవీ వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఆ గొడవకు కారణం ఎవరు? ఈ క్రమంలో ఆ ఊరి ప్రజల మధ్య ఎలాంటి ఎమోషనల్ సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ సమస్యను ఎలా పరిష్కరించారు అనేదే ఈ చిత్ర కథ.
కథనం:
దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే సినిమా ప్రారంభం చాలా నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల అమాయకత్వం, వారి మధ్య ఉండే పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాకులతోనే నిండిపోతుంది. ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్. ఇంటర్వెల్ నుంచి కథనం మారిపోయింది.. ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. సెకండ్ హాఫ్‌లో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, అన్ని లాజికల్ పాయింట్స్ ను టచ్ చేస్తూ ఇచ్చిన ముగింపు కథనానికి పెద్ద బలాన్నిచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లోని లోపాలను సెకండ్ హాఫ్ చాలా వరకు కవర్ చేసిందని చెప్పాలి. ఓవరాల్‌గా ఎమోషన్స్, ట్విస్టులతో సినిమా బాగానే ముందుకెళ్లింది.
నటీనటులు:
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ రానివ్వలేదు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్‌గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. సాయి తేజ్ పల్లెటూరి యువకుడిగా, ఎమోషనల్ సీన్స్‌లో సహజంగా కనిపించాడు. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటీనటులందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడుతూ ఊరి నెటివిటీని తీసుకురావడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. అతిగా నటించకుండా తమ పరిధిలో అద్భుతంగా చేశారు.
టెక్నికల్ టీం:
టెక్నికల్‌గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖన అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్లకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. కిరణ్ అబ్బవరం లాంటి హీరో నిర్మాతగా మారి తన ప్రొడక్షన్‌లో ఇలాంటి ఒక ప్రయోగాత్మక రూరల్ డ్రామాను ఎంచుకోవడం అభినందించదగ్గ విషయం. ఖర్చు తక్కువే అయినా మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 90ల్లోని జ్ఞాపకాలు.. స్వచ్ఛమైన పల్లెటూరి కథ..!




