AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే రూట్‌లో ఎదురెదురుగా ప్రయాణించే విమానాలు ఎందుకు ఢీ కొనవు? సింపుల్ రూల్ తెలుసా?

ఒకే రూట్‌లో విమానాలు ఎదురెదురుగా ప్రయాణించినా అవి ఢీకొనవు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), నిర్దిష్ట ఎత్తుల కేటాయింపు, వేర్వేరు ఎయిర్‌వేలు, రాడార్ పర్యవేక్షణ, TCAS వంటి ఆధునిక వ్యవస్థలు ప్రతి విమానం మధ్య సురక్షిత దూరాన్ని నిరంతరం పాటించేలా చూస్తాయి.

ఒకే రూట్‌లో ఎదురెదురుగా ప్రయాణించే విమానాలు ఎందుకు ఢీ కొనవు? సింపుల్ రూల్ తెలుసా?
Airplanes Crash
SN Pasha
|

Updated on: Jul 31, 2026 | 11:09 AM

Share

ఆకాశంలో వందల విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రతి రోజూ కొన్ని వేల మందిని గాల్లోకి తీసుకెళ్లి, తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే మన రోడ్డుపై ఒక ఊరికి వెళ్లాలంటే ఒకే మార్గంలో ఎన్ని సార్లు అయినా ఎలా వెళ్తామో, మళ్లీ అదే దారిన ఎలా వస్తామో విమానాలు కూడా ఒక ఎయిర్ పోర్టు నుంచి మరో ఎయిర్ పోర్టుకు ప్రతి సారి ఒకే మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. మరి అలాంటప్పుడు అని విమానాలు గాల్లో ఒకే మార్గంలో ఎదురెదురుగా రావా? వస్తే ఏమవుతుంది? అవి ఢీకొనే ప్రమాదం ఉండదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే విమానయాన రంగంలో అమలవుతున్న ఆధునిక భద్రతా వ్యవస్థలు, కఠిన నిబంధనల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు అత్యంత అరుదుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి విమానం ప్రయాణాన్ని అత్యంత ఖచ్చితంగా పర్యవేక్షించే వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కీలక పాత్ర

విమానాల రాకపోకలను నియంత్రించే ప్రధాన వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC). ప్రతి విమానం ఎప్పుడు బయలుదేరాలి, ఏ మార్గంలో ప్రయాణించాలి, ఎంత ఎత్తులో వెళ్లాలి అనే వివరాలను ATC ముందుగానే నిర్ణయిస్తుంది. ప్రయాణం మొత్తం రాడార్ సహాయంతో విమానాల కదలికలను పర్యవేక్షిస్తూ అవసరమైతే పైలట్లకు వెంటనే సూచనలు ఇస్తుంది. దీంతో రెండు విమానాలు ఒకే సమయంలో ప్రమాదకరంగా దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడకుండా చూస్తుంది.

వేర్వేరు ఎత్తుల్లో ప్రయాణం

ఒకే మార్గంలో ప్రయాణించే విమానాలకు కూడా వేర్వేరు ఎత్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక విమానం 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే, అదే మార్గంలో మరో విమానాన్ని 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేలా అనుమతి ఇస్తారు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం విమానాల మధ్య నిలువు దూరం, అడ్డదూరం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. దీంతో ఎదురెదురుగా వచ్చినా అవి ఒకదానికొకటి తగిలే అవకాశం ఉండదు.

TCAS వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

ఆధునిక విమానాల్లో ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) అనే ప్రత్యేక భద్రతా పరికరం ఉంటుంది. సమీపంలో మరో విమానం ప్రమాదకర దూరానికి వస్తే ఈ వ్యవస్థ పైలట్లకు వెంటనే హెచ్చరికలు పంపుతుంది. అవసరమైతే ఒక విమానం పైకి, మరో విమానం కిందికి వెళ్లేలా సూచనలు కూడా ఇస్తుంది. ఈ వ్యవస్థ ATCతో పాటు అదనపు భద్రతా పొరగా పనిచేస్తుంది.

GPS, రాడార్, ఉపగ్రహ సాంకేతికత

ప్రస్తుతం విమానాల నావిగేషన్ కోసం GPS, రాడార్, ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు ఉపయోగిస్తున్నారు. ప్రతి విమానం తన స్థానం, ఎత్తు, వేగం వంటి వివరాలను నిరంతరం ప్రసారం చేస్తుంది. ఈ సమాచారాన్ని ATC కేంద్రాలు ఎప్పటికప్పుడు విశ్లేషించి అవసరమైన మార్గదర్శకాలు అందిస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థలకు ఉంది.

Follow Us