
మూవీ రివ్యూ: హరిహర వీరమల్లు
నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబి డియోల్, సత్యరాజ్, నాజర్, నిషార్ కపూర్, సునీల్, సుబ్బరాజు తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ KL
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత: ఏఎం రత్నం
దర్శకులు: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. మళ్లీ ఆయన నుంచి వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. ఐదేళ్ల కింద మొదలైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ చెప్పినట్టు నిజంగానే అదిరిపోయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఒక దొంగ. రాబిన్ హుడ్ తరహాలో పెద్దవాళ్ళను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర (సచిన్ ఖేడ్కర్) నుంచి పిలుపు వస్తుంది. అక్కడే పంచమి (నిధి అగర్వాల్) ను చూసి ఇష్టపడతాడు వీరమల్లు. తనను దొరల చర నుంచి తప్పించాలి అంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్లు. అదే సమయంలో కుతుబ్షాహీల నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలి అంటూ కుతుబ్షాహీ ప్రభువు.. వీరమల్లును కోరతాడు. ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబు (బాబి డియోల్) కూర్చొని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తుంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరుతాడు వీర. ఆ తర్వాత ఏమైంది.. ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అనేది అసలు కథ..
కథనం:
ఈ రోజుల్లో పీరియడ్ సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు సమయం కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వచ్చే అవుట్ పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజులు సీన్ 3 రోజులు.. 8 గంటల కాల్షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే.. సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అన్నీ తెలిసిపోతున్నా కానీ..
పవన్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడులే అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలాగే ఉండిపోయింది. హరిహర వీరమల్లు చూసిన తర్వాత అది కూడా పోయింది. ఫస్టాఫ్ చూశాక పర్లేదు ఏదో ట్రై చేశాడు.. మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బాగానే ఇచ్చారు. దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది. సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్.. ఇది చూశాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అని చాలా మంది పవన్ అభిమానులు కూడా కచ్చితంగా మనసులో అనుకొని ఉంటారు. సీజీ వర్క్స్ ఈ సినిమాను పూర్తిగా చంపేశాయి. చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో.. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉన్న ఇలాంటి సిజి చేశారంటే తప్పు ఎవరిది..? ఇందులో పవన్ తప్పు కూడా ఉంది.. ఆయన ఉన్న బిజీకి ఇలాంటి సబ్జెక్టు ఓకే చేయడమే తప్పు. చేశాక కచ్చితంగా డేట్స్ ఇవ్వాలి.. ఇవ్వకుండా చుట్టేస్తాం అంటే ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో.. పవన్ తప్పు కూడా అంతే ఉంది. ఆయన డేట్స్ ఇవ్వలేదు.. ఇచ్చిన డేట్స్ అసలు సరిపోలేదు.. ఫలితం స్క్రీన్ పై కనిపించింది. సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది.. ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా పాడైపోయాయి. ప్రతిసారి ఒక కష్టం రావడం.. హీరో వెళ్లి దాన్ని పరిష్కరించడం.. ఇదే సరిపోతుంది..
హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు.. దానిమీద ఇంకొన్ని మంచి సీన్స్ రాసుకొని ఉంటే బాగుండేది. అది వదిలేసి కథని ఏటెటో తీసుకెళ్లిపోయారు.
నటీనటులు:
పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఆయన స్వాగ్ కనిపిస్తుంది అంతే.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన యాక్షన్ సినిమాలు చాలా తక్కువగా చేశాడు. కానీ వీరమల్లులో మాత్రం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలున్నాయి. వాటన్నింటిలో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు జనసేనాని. నిధి అగర్వాల్ కూడా తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఔరంగజేబు పాత్రలో బాబి డియోల్ భయపెట్టాడు. తనికెళ్ల భరణి, సత్యరాజ్, సునీల్.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలామంది నటులు ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
హరిహర వీరమల్లు సినిమాకు ఆయువుపట్టు కీరవాణి సంగీతం అని చెప్పారు. కాకపోతే సినిమా చూసిన తర్వాత అంత ఇంపాక్ట్ అనిపించదు. కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తన పనితనం ఫస్టాఫ్ వరకు బాగానే చూపించాడు.. కానీ సెకండ్ హాఫ్ ఆయన చేతుల్లో కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైస్ ఆవాల్సి వచ్చింది. పవన్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఆకట్టుకోలేదు. కేవలం హిందూ ధర్మం కాపాడడం అనే లైన్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేయలేదు అనిపించింది. చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా పెద్దగా ఏమీ లేవు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు..
లైన్ బాగుంది.. కానీ చుట్టేశారు..!
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..