AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bun Butter Jam Movie: తమిళంలో అలరించిన ‘బన్ బటర్ జామ్’ తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిందా..?

తమిళంలో మంచి విజయం సాధించిన బన్ బట్టర్ జామ్ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేసారు. రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో ప్రేమతో పాటు స్నేహాన్ని కూడా చూపించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..

Bun Butter Jam Movie: తమిళంలో అలరించిన 'బన్ బటర్ జామ్' తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిందా..?
Bun Butter Jam
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 23, 2025 | 5:04 PM

Share

మూవీ రివ్యూ: బన్ బటర్ జామ్ నటీనటులు: రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, శరణ్య, దేవదర్శన, భవ్య త్రిఖ తదితరులు సినిమాటోగ్రఫీ: బాబు కుమార్ ఎడిటర్: జాన్ అబ్రహాం సంగీతం: నివాస్ ప్రసన్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రాఘవ్ మిర్దత్

కథ:

చంద్రు (రాజు జెయ‌మోహ‌న్‌), మధుమిత (ఆధ్య ప్రసాద్) ఇంట‌ర్ పూర్తి చేసుంటారు.. ఇద్దరూ ఈ జనరేషన్ కిడ్స్.. ఫుల్ ఫాస్ట్ ఉంటారు. కాకపోతే ఇంట్లో మాత్రం స్వాతిముత్యాల్లా బిల్డప్ ఇస్తుంటారు. మరోవైపు వాళ్ల పేరెంట్స్‌కు ఇదివరకే పరిచయం ఉండటంతో.. ఇంటర్ అయిపోగానే వాళ్లిద్దరికి పెళ్ళి చేయాలనుకుంటారు. బయట చూసిన సంబంధాలైతే చెడిపోతాయని.. తమ పిల్లలను తాను కలపాలనుకుంటారు. కానీ చంద్రు, మధు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇదే సమయంలో చంద్రు ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాక నందిని (భ‌వ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు. కాకపోతే నందినిని ప్రేమించడం చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ (మైకేల్ తంగ‌దురై) కు నచ్చదు.. అదే అమ్మాయిని తను కూడా లవ్ చేస్తుంటాడు. ఆ విషయం చెప్పకుండా స్నేహితుడిని దూరం పెడతాడు. మరోవైపు మధుమిత ఆకాష్ (VJ పప్పు)ని ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ స్టోరీ చివరికి ఏ మలుపు తిరిగింది.. అసలు చంద్రు, మధు పెళ్లి జరిగిందా లేదా.. ఎవరి ప్రేమ ఎటు వైపు వెళ్లింది అనేది ఈ చిత్రం కథ..

కథనం:

బ‌న్ బ‌ట‌ర్ జామ్.. టైటిల్‌కు తగ్గట్లుగానే ఇది పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ మధ్యే తమిళంలో విడుదలై అక్కడి యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ అలా ఎందుకు పెట్టారు అంటే.. హీరో అండ్ గ్యాంగ్ ఎప్పుడూ అదే హోటల్‌లో కూర్చుంటారు కాబట్టి.. అంతే తప్ప కథకు సంబంధం ఉండదు. దర్శకుడు మిర్దత్ తన కథను పూర్తిగా యువతను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్ చూపించిన కొన్ని సన్నివేశాలు ఇందులోనూ ఉన్నట్లు అనిపిస్తాయి. నేటి జనరేషన్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా సరదాగా వెళ్లిపోతుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. మరోవైపు హీరో ఇంట్లో అమ్మ వాళ్లు చేసే చిలిపి పనులు బాగానే ఉంటాయి.. ఫన్ బాగానే జనరేట్ అయింది. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ అయిన చంద్రు, మధుమిత.. వాళ్ళ తల్లుల పాత్రలు బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంటర్వెల్ వరకు స్పీడ్‌గానే వెళ్తుంది కథ. ఆ తర్వాత ఎవరి ప్రేమ ఎటు వెళ్తుందనేది కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఫస్టాఫ్‌లో ఉన్న ఫాస్ట్ నెరేషన్ సెకండాఫ్‌లో మిస్ అయింది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు పర్లేదు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించినట్లుగానే ఉంటుంది.. సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఈ జనరేషన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఫాస్టుగా ఉంటాయనేది ఇందులో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు మిర్దత్.

నటీనటులు:

చంద్రు పాత్రలో రాజు జెయ‌మోహ‌న్‌ బాగా చేసాడు.. అక్కడక్కడా నవ్విస్తూనే ఎమోషనల్‌గానూ పర్లేదు అనిపించాడు. మధుమిత పాత్రలో భ‌వ్య త్రిఖ పర్లేదు.. రీల్స్ చేసే అమ్మాయిల పాత్ర స్వభావాన్ని చూపించింది. ఆధ్య ప్రసాద్ క్యూట్‌గా ఉంది. సీనియర్ నటీమణులు శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్‌, దేవ‌ద‌ర్శిన‌ తల్లి పాత్రల్లో అదరగొట్టేసారు. వాళ్ల కామెడీ సినిమాకు బలం. విజె పప్పు ప్రతి సీన్‌లో నవ్వించి చివర్లో ఎమోషనల్‌గా మెప్పిస్తాడు. చార్లి, మైకేల్ తంగ‌దురై.. మిగిలిన నటీనటులు ఓకే..

టెక్నికల్ టీం:

నివాస్ ప్రసన్న సంగీతం బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది కానీ తెలుగులో పాటల విషయంలో మాత్రం సింగర్స్ సెలక్షన్ చాలా దారుణంగా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ వీక్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు రాఘవ్ మిర్దద్ అనుకున్న కథ నేటి జనరేషన్ ఫీలింగ్స్ చూపించడం.. దాన్ని చాలా వరకు కవర్ చేసాడు.. కాకపోతే ఇంకాస్త రేసీ స్క్రీన్ ప్లేతో చెప్పాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బన్ బటర్ జామ్.. కొంచెం సాఫ్ట్‌గా.. కొంచెం సాల్టీగా..!