AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలెలా ఉంటారు ఇంత సన్నగా! స్టార్ హీరోయిన్‌ ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన న్యూట్రిషనిస్ట్‌

బాలీవుడ్ బెబోగా పేరు తెచ్చుకున్న ఆ స్టార్ హీరోయిన్ అంటే ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటెయిన్ చేస్తారు అని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ బ్యూటీ.

అసలెలా ఉంటారు ఇంత సన్నగా! స్టార్ హీరోయిన్‌ ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన న్యూట్రిషనిస్ట్‌
Bollywood Star Heroine..
Nikhil
|

Updated on: Jan 05, 2026 | 6:15 AM

Share

మన ఇంటి పరిసరాల్లో దొరికే స్వచ్ఛమైన భారతీయ ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఆమె అంత ఫిట్‌గా ఉన్నారని ఆమె న్యూట్రిషనిస్ట్ తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవడానికి, చర్మం పొడిబారకుండా ఉండటానికి ఆమె డైట్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు ఉంటాయని సమాచారం. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకే పాటికి అర్థమై ఉంటుంది.. ఆమె మరెవరో కాదు కరీనా కపూర్. ఆమెకు ఎంతో కాలంగా డైట్ సలహాలు ఇస్తున్న ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్, ఈ శీతాకాలంలో భారతీయులు ఖచ్చితంగా తీసుకోవలసిన కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి వివరించారు. ఆ సూపర్​ ఫుడ్స్​ ఏంటో తెలుసుకుందాం..

Kareena Kapoor Khan

Kareena Kapoor Khan

ప్రాంతీయ వంటకాలు..

రుజుతా దివేకర్ తన తాజా ఇంటర్వ్యూలో భారతీయ సంప్రదాయ ఆహారానికి ఉన్న గొప్పతనాన్ని వివరించారు. శీతాకాలంలో కేవలం ఆపిల్స్, ఆరెంజెస్ మాత్రమే కాకుండా.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే చిరుధాన్యాలు, ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె చెప్పారు. ముఖ్యంగా ‘బజ్రా భక్రీ’ (సజ్జలతో చేసే రొట్టె) ఈ కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడిని అందిస్తుందని, ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆమె సూచించారు. సజ్జలు కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇవి శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి.

చోళై, గొంద్ లడ్డూ ప్రాముఖ్యత

చలికాలంలో కీళ్ల నొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అరికట్టడానికి ‘చోళై’ (తోటకూర లాంటి ఆకుకూర) అద్భుతంగా పనిచేస్తుందని రుజుతా పేర్కొన్నారు. ఇందులో క్యాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. అలాగే శీతాకాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే వెన్నునొప్పి సమస్యకు ‘గొంద్ లడ్డూ’ ఒక అద్భుతమైన ఔషధమని ఆమె వివరించారు. ఇది ఎముకల బలానికి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది. దీనిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల రోజంతా ఉల్సాహంగా ఉండవచ్చని ఆమె సలహా ఇచ్చారు.

సీజనల్ ఫ్రూట్స్, నెయ్యి

మన డైట్‌లో నెయ్యిని శత్రువులా చూడకూడదని రుజుతా ఎప్పుడూ చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలన్నా, జుట్టు మెరవాలన్నా భోజనంలో కనీసం ఒక స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉండాల్సిందే. అలాగే ఈ సీజన్‌లో దొరికే జామకాయలు, రేగు పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి సహజంగా విటమిన్ సి అందించి జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తాయి. పాశ్చాత్య ఆహార పద్ధతుల కంటే మన పూర్వీకులు నేర్పిన ఈ దేశీయ ఆహారాలే మన శరీర తత్వానికి సరిగ్గా సరిపోతాయని ఆమె బలంగా విశ్వసిస్తారు.

రుజుతా దివేకర్ చెప్పిన ఈ చిట్కాలు పాటిస్తే ఈ శీతాకాలంలో మందుల అవసరం లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కరీనా కపూర్ వంటి స్టార్లు సైతం మన సంప్రదాయ ఆహారాన్నే నమ్ముకున్నారంటే, మన వంటకాలలో ఎంతటి శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన సప్లిమెంట్ల కంటే మన వంటింట్లో దొరికే ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవడం మేలు.