చిన్న నిర్ణయం.. పెద్ద ఛేంజ్..! తన బాడీలో తెచ్చిన మార్పుల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్
వెండితెరపై తన చిలిపి నటనతో, చలాకీతనంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆ స్టార్ హీరోయిన్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఒకప్పుడు ఆమె నటించిన ఓ సినిమాలోని పాత్రలోని చిలిపితనాన్ని ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ నటి, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను ఎంతో ఇష్టంగా తినే మాంసాహారాన్ని పూర్తిగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఆమె వివరించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం తన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా, పర్యావరణం పట్ల తనకున్న బాధ్యతను గుర్తిస్తూ ఆమె ఈ మార్పు చేసుకున్నారు.
మరి ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకే ఈపాటికి అర్థమై ఉంటుంది.. ఆమె మరెవరో కాదు, జెనీలియా డిసౌజా. తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెనీలియా, తన వీగన్ ప్రయాణం గురించి పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాంసాహారానికి స్వస్తి..
జెనీలియా తన డైట్ మార్పుల గురించి వివరిస్తూ.. తాను 2017లోనే మాంసాహారం తినడం మానేశానని చెప్పారు. అయితే అప్పట్లో ఆమె కేవలం వెజిటేరియన్‌గా మాత్రమే ఉండేవారు. కానీ 2020లో వచ్చిన గ్లోబల్ పాండమిక్ సమయంలో ఆమె తన ఆహారపు అలవాట్లపై మరింత లోతుగా ఆలోచించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి మనం తినే ఆహారం కూడా ఒక కారణమని ఆమె గ్రహించారు.
జంతువుల పట్ల క్రూరత్వాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, పాలు, పాల పదార్థాలతో కూడిన ఉత్పత్తులను కూడా పూర్తిగా వదిలేసి వీగన్‌గా మారాలని నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం ప్రారంభంలో కష్టంగా అనిపించినా, దానివల్ల కలిగే ప్రయోజనాలు చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదని అంటోంది జెనీలియా.

Genelina D Souza
వీగన్‌గా మారిన తర్వాత తన శరీరంలో వచ్చిన సానుకూల మార్పుల గురించి జెనీలియా ఎంతో ఉత్సాహంగా చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు తనలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆమె వెల్లడించారు. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, చర్మం కూడా మరింత కాంతివంతంగా మారిందని ఆమె వివరించారు. వీగన్ డైట్ అంటే కేవలం ఆకుకూరలు మాత్రమే తినడం కాదని, అందులో కూడా ఎన్నో రుచికరమైన వెరైటీలు ఉంటాయని ఆమె గుర్తు చేశారు. తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ కూడా ఆమె నిర్ణయానికి మద్దతు తెలపడమే కాకుండా, తాము కలిసి ఒక ప్లాంట్ బేస్డ్ మీట్ స్టార్టప్‌ను కూడా ప్రారంభించినట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
View this post on Instagram
సమాజానికి ఇచ్చే సందేశం..
ఆహారం అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, అది మన భూమిని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా ఆలోచించాలని జెనీలియా సూచించారు. “మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ప్రకృతిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆరోగ్యకరమైన, పర్యావరణహితమైన అలవాట్లను నేర్పించాలని ఆమె కోరుకుంటున్నారు. కఠినమైన నియమాలు పెట్టుకోకపోయినా, మెల్లిమెల్లిగా ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయని ఆమె నమ్ముతున్నారు. సోహా అలీ ఖాన్ అడిగిన పలు ప్రశ్నలకు జెనీలియా ఎంతో స్పష్టంగా, స్ఫూర్తిదాయకంగా సమాధానాలు ఇచ్చారు.
జెనీలియా డిసౌజా తన ఫిట్‌నెస్ మరియు అందం వెనుక ఉన్న రహస్యాన్ని ఇలా పంచుకోవడం ఆమె అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. పర్యావరణం కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయం. కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికే కాకుండా ప్రకృతికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
