Corona Effect on Theatres: త్రిశంకు స్వర్గంలో తెలుగు సినీ పరిశ్రమ.. థియేటర్లపై సినిమా కష్టాలు..!

దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టింది. రెండో దశ కరోనా ఊహించనంత వేగంగా విస్తరించింది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది.

Corona Effect on Theatres: త్రిశంకు స్వర్గంలో తెలుగు సినీ పరిశ్రమ.. థియేటర్లపై సినిమా కష్టాలు..!
Corona Effect On Theatres
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 20, 2021 | 2:10 PM

Corona Effect on Theatres: దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టింది. రెండో దశ కరోనా ఊహించనంత వేగంగా విస్తరించింది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాలు తెరుకుంటున్నాయి. ప్రధానంగా సినిమా రంగంపై కరోనా ప్రభావం భారీగా పడింది. సినిమా థియేటర్లు, మాల్స్ మూతపడి భారీగా నష్టాలను చవిచూసేలా చేసింది. సినిమా షూటింగ్‌లను కూడా నిబంధనల మేరకు అనుమతి ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి.. సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా థియేటర్లు బంద్ అయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. రిస్క్‌ ఎందుకన్న ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు. కరోనా తగ్గిన తర్వాతే విడుదల చేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు.

మొదటి వేవ్ కరోనా నుంచి కరోనా భయంతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. హిందీ సినిమాలే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమకు కూడా కష్టాలు తప్పడం లేదు. కరోనా కారణంగానే అనేక సినిమాలు విడుదల వాయిదా పడింది. ఖర్చు పెట్టి తీసిన సినిమాలను ఎప్పుడు రిలీజ్‌ చేయాలని నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం పెద్దగా షూటింగ్‌లు జరగడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని చూసిన తర్వాత పునరాలోచనలో పడ్డారు నిర్మాతలు. షూటింగ్‌ స్పాట్‌కు రావడానికి హీరోలు, హీరోయిన్ లు టెక్నిషియన్లు భయపడుతున్నారు. మేకప్‌మ్యాన్‌లు కూడా దొరకడం లేదు. సినిమా అంటేనే ఖర్చుతో కూడిన పని! అలాంటిది సిబ్బందికి టెస్టులు చేయించడం, పదే పదే శానిటైజేషన్ చేయాల్సి రావడం, మాస్కులు సప్లయి చేయడం వంటి వాటివల్ల నిర్మాతలకు అదనపు భారం పడుతోంది.

మొదట వేవ్ కరోనా తర్వాత సినిమా హాళ్ల కెపాసిటీ 50 శాతానికి తగ్గించినా పరిశ్రమ బాగా నష్టపోయింది. థియేటర్‌ అన్నాక వందలకొద్దీ ప్రేక్షకులు వస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది.. సినిమా థియేటర్లలో ఆంక్షలు పెడితే మాత్రం చాలా మంది నష్టపోతారు. పెద్ద సినిమా ప్రొడ్యుసర్లకు అయితే మరింత కష్టం. బయ్యర్ల దగ్గర నుంచి నిర్మాతలపై వరకు దీని ప్రభావం ఉంటుంది. కరోనా సెకండ్‌వేవ్‌ కమ్ముస్తుండటంతో ప్రజల్లో ఇప్పుడు భయం మొదలయ్యింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో సినిమారంగంపై పెను ప్రభావమే పడింది.

గత లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసివేయించింది. కానీ సెకండ్ వేవ్ సమయంలో మాత్రం థియేటర్ యాజమాన్యాలే స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు. తెలంగాణలో సినియా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ వెల్లడించింది. 23 నుంచి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు

టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు, కరోనా మహమ్మారి, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్‌ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఓటీటీలపై ఆంక్షలు విధిస్తే తప్ప థియేటర్స్‌ తెరవలేమని డిస్ట్రిబ్యూటర్లు మంకుపట్టుపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీతో దిగివచ్చారు. థియేటర్లను తెరిచేందుకు అంగీకరించారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన.. వెండితెర తిరిగి వెలగబోతోంది. ఆదివారం నాటి నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. ఈ దిశగా.. రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్.. నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ వల్ల థియేటర్ నిర్వాహకులైన తాము తీవ్రంగా నష్టపోయామనీ.. తమను ఆదుకోవాలంటూ ఎగ్జిబిటర్ల అసోసియేషన్- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసింది. తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఈ మేరకు థియేటర్లను ఆదుకునేలా ఓ స్పష్టమైన హామీ లభించింది. దీంతో ఈ సండే నుంచి సినిమా హాళ్లలో సందడి షురూ కానుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్ల అసోసియేషన్లు కలిసి తీసుకున్న ఈ సంయుక్త నిర్ణయంతో ప్రేక్షకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దానికితోడు ఈ నెల 23న కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో వంద శాతం సీట్ల సామర్ధ్యంతో మల్టిప్లెక్స్- సింగిల్ స్క్రీన్ థియేటర్ల హడావిడి తిరిగి మొదలు కానుంది. 2017 నాటి జీవో నెంబర్ 75, పార్కింగ్ ఫీజు వసూలు, విద్యుత్ ఛార్జీల మినహాయింపు, మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాలతో తమను ఆదుకోవాలన్నది ఎగ్జిబిటర్ల విన్నపం. వీటన్నిటిపై తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడం వల్లే థియేటర్ల ఓపెనింగ్ పై ఒక నిర్ణయానికి రాగలిగామని అంటున్నారు నిర్వాహకులు.

ఇక ఏపీలో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. సినిమా హాళ్లు తెరిచేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లలో గతంలో మాదిరిగా సీటుకూ సీటుకూ మధ్య ఖాళీ తప్పనిసరి నిబంధన వర్తిస్తుంది. జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని ఆదేశించారు. సినిమా టిక్కెట్ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించని థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ థియేటర్స్ తెరిచేందుకు సినిమా హాల్ ఓనర్స్ సుముఖంగా లేరు. అయితే, ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకుంటే మాత్రం సినిమా హాళ్లు తెరుస్తామంటున్నారు థియేటర్స్ ఓనర్స్. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు కొనసాగడంతో సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. Read Also… Covid-19 Vaccine: 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ట్రయల్స్.. రెడీ అవుతున్న కొవాగ్జిన్